ఆ దేశంలో పిల్లలకు నాలుగంచెల లంచ్‌ బాక్స్‌!

పిల్లలు స్కూలుకెళ్తున్నారంటే అమ్మలకు ఒకటే బెంగ.. రోజూ లంచ్‌ బాక్స్‌లోకి ఏం పెట్టాలా అని?! ఎందుకంటే ఆరోగ్యం పేరుతో చేసిన వంటకాలు వారికి ఓ పట్టాన నచ్చవు. అలాగని రోజూ ఏదో ఒకటి పెట్టి పంపించలేం. తీరా ఇంత కష్టపడి మధ్యాహ్న భోజనం తయారుచేసి పెడితే.. అందులో సగానికి సగం మిగుల్చుకొని ఇంటికి పట్టుకొచ్చే వారే ఎక్కువ.

Published : 23 Jun 2024 12:08 IST

పిల్లలు స్కూలుకెళ్తున్నారంటే అమ్మలకు ఒకటే బెంగ.. రోజూ లంచ్‌ బాక్స్‌లోకి ఏం పెట్టాలా అని?! ఎందుకంటే ఆరోగ్యం పేరుతో చేసిన వంటకాలు వారికి ఓ పట్టాన నచ్చవు. అలాగని రోజూ ఏదో ఒకటి పెట్టి పంపించలేం. తీరా ఇంత కష్టపడి మధ్యాహ్న భోజనం తయారుచేసి పెడితే.. అందులో సగానికి సగం మిగుల్చుకొని ఇంటికి పట్టుకొచ్చే వారే ఎక్కువ. అయితే పిల్లలు అమితంగా తినాలన్న తల్లుల ఆరాటమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. మన దేశంతో పోల్చితే ఇతర దేశాలకు చెందిన పిల్లలు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండడానికి కారణం.. తమ లంచ్‌ బాక్స్‌లో పెట్టిన పదార్థాలు వదిలిపెట్టకుండా తినడమే అంటున్నారు. అలాగే వారి తల్లులు కూడా లంచ్‌ కోసం తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకుంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో- ఇతర దేశాలకు చెందిన తల్లులు తమ పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం ఎంచుకునే ఆ ఆరోగ్యకరమైన పదార్థాలేంటో తెలుసుకుందాం రండి..

తింటే సరిపోదు.. ఒంటికి పట్టాలి!

మన దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఆహార నియమాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ క్రమంలో ఉత్తరాన చాలా చోట్ల రోటీ/చపాతీని ప్రధాన ఆహారంగా తీసుకుంటే.. దక్షిణ భారతంలో అన్నానికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. ఇలా పిల్లల స్కూల్‌ లంచ్‌ కూడా ఆయా ప్రాంతాల్ని బట్టి ఉంటుంది. అయితే తమ చిన్నారులు ఎలాగోలా బాక్స్‌లో పెట్టింది తింటే చాలనుకుంటారు చాలామంది తల్లులు. ఈ ఉద్దేశంతోనే నోటికి రుచించాలని కూరల్లో నూనె ఎక్కువగా వాడడంతో పాటు నూడుల్స్‌/పాస్తా/పిజ్జా/శాండ్‌విచ్‌.. వంటి నిమిషాల్లో సిద్ధమైపోయే పదార్థాలు తయారుచేసిస్తారు. నిజానికి దీనివల్ల పిల్లల కడుపు నిండినప్పటికీ.. వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అందవంటున్నారు నిపుణులు. తద్వారా వారు పదే పదే అనారోగ్యాల పాలవడం, యాక్టివ్‌గా లేక చదువుపై దృష్టి పెట్టలేకపోవడం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు. అదే కొన్ని దేశాల్లోని తల్లులు తమ పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు/పద్ధతుల్నే ఎంచుకుంటున్నారని చెబుతున్నారు.


France: అక్కడ నాలుగంచెల ‘లంచ్’!

మన పిల్లలు ఒక బాక్స్‌లో పెట్టిన ఆహారం తినడమే గొప్ప విషయమనుకుంటే.. ఫ్రాన్స్‌లో చిన్నారులు తమ లంచ్‌ను నాలుగు భాగాలుగా స్వీకరిస్తారట! అదీ నాలుగు విభిన్న మెనూలతో!

⚛ మొదటి దశలో.. వెజిటబుల్‌ సలాడ్‌తో లంచ్‌ను ప్రారంభిస్తారు.

⚛ ఇక రెండో దశలో.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో రోస్ట్‌ చేసిన బ్రకలీ, చేపలు తీసుకుంటారు.

⚛ ఛీజ్‌ లేనిదే అక్కడి పిల్లల లంచ్‌ పూర్తి కాదట! అందుకే మూడో దశలో.. బ్రెడ్‌పై జామ్‌, ఛీజ్‌ వేసుకొని యమ్మీగా లాగించేస్తారట!

⚛ ఇక ఆఖరిగా నాలుగో దశలో ఏదో ఒక స్వీట్‌తో నోరు తీపి చేసుకొని మరీ మధ్యాహ్నం తరగతి గదిలోకి అడుగుపెడతారట ఫ్రెంచ్‌ పిల్లలు.

ఇలా ఈ నాలుగంచెల మెనూతో.. వారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయంటున్నారు నిపుణులు. అయితే ఇవన్నీ వేర్వేరు బాక్సుల్లో పెడితే తింటారో, లేదోనని.. నాలుగు భాగాలుగా విభజించిన డబ్బాలోనే.. తలా కొంచెం చొప్పున పెడతారట అక్కడి తల్లులు. దీనివల్ల ఆహార వృథా తగ్గుతుందని, పిల్లల కడుపూ నిండుతుందన్నది వారి నమ్మకం!


Japan: తినడం కాదు.. వండుతారు కూడా!

పిల్లలు ప్రయోగాత్మకంగానే చాలా విషయాలు నేర్చుకుంటారు. పోషకాహారం విషయంలోనూ అంతే! సాధారణంగా ‘ఇది ఆరోగ్యానికి మంచిది.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి..’ అని చెప్తే వారు పట్టించుకోరు. అందుకే ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా అర్థం చేయించడానికి జపాన్‌ తల్లులు వారి పిల్లల్ని చిన్న వయసు నుంచే వంటల్లోనూ భాగం చేస్తారట! ఈ క్రమంలో వారి కోసం చేసే వంటకాల్లో సహాయం తీసుకోవడం, ఇంటికి అతిథులొచ్చినప్పుడు కొన్ని పదార్థాల్ని వారితో సర్వ్‌ చేయించడం, వారు తినే ప్లేట్స్‌ వారే కడిగేలా అలవాటు చేయించడం.. ఇలాంటి మంచి అలవాట్లు జపాన్‌ పిల్లల సొంతమంటున్నారు నిపుణులు. ఇక పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం.. అన్నం, కాయగూరలు, చేపల్ని ఎంచుకుంటారట జపాన్‌ తల్లులు.


Finland: ఉచిత భోజనం.. ఆరోగ్యకరంగా!

మన దగ్గర చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోన్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. రోజూ ఉడికించిన గుడ్డును పిల్లలకు అందిస్తోంది ప్రభుత్వం. అయితే ఫిన్లాండ్‌లోనూ పిల్లలందరికీ ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తారని, అదీ పోషకభరింరితంగా ఉండేలా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీట్‌రూట్‌ సలాడ్‌, సూప్స్‌, ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పులు.. వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారట! ఇలా పిల్లలందరికీ ఉచితంగా, అదీ ఆరోగ్యకరంగా మధ్యాహ్న భోజనం అందిస్తోన్న తొలి దేశంగా ఫిన్లాండ్‌కు పేరుంది. ఇక అక్కడి తల్లులూ తమ పిల్లలు ఇంట్లో ఉన్న సమయాల్లోనూ ఇలాంటి పోషకాహారమే తయారుచేసి అందిస్తారట!


Ethiopia: ‘గ్రీన్‌’ డైట్!

పర్యావరణానికే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది మొక్కల ఆధారిత ఆహారం. అందుకే ఇథియోపియాకు చెందిన తల్లులు ఎక్కువగా ఈ తరహా ఆహార పద్ధతుల్నే తమ పిల్లల మెనూలో భాగం చేస్తారట! ముఖ్యంగా వారి లంచ్‌లోకి.. పప్పులు, ఆకుకూరలతో పాటు ప్రత్యేక పద్ధతుల్లో పులియబెట్టి తయారుచేసిన బ్రెడ్‌ను అందిస్తారట! మరికొన్నిసార్లు.. గుడ్లు, మాంసంతో తయారుచేసిన ఆరోగ్యకరమైన వంటకాల్ని కూడా పిల్లల లంచ్‌ బాక్స్‌లో పెడతారట! ఇవన్నీ పిల్లల శరీరానికి కావాల్సిన పోషకాలను బ్యాలన్స్‌డ్‌గా అందిస్తాయని అక్కడి తల్లులు చెబుతున్నారు.


Norway: అక్కడ క్యాంటీన్లుండవు!

మన దగ్గర కొన్ని స్కూళ్లలో క్యాంటీన్లుంటాయి.. వాటిలో ఆరోగ్యకరమైన ఆహారం కంటే పిల్లలు ఇష్టపడే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారం పక్కన పెట్టి మరీ వీటికి అలవాటు పడిపోతుంటారు చిన్నారులు. దీంతో అనారోగ్యాల పాలవుతుంటారు. కానీ నార్వేలో ఈ పద్ధతి నిషిద్ధం! అక్కడి చాలా స్కూళ్లలో క్యాంటీన్లు, కాఫీ షాపులు.. వంటివి ఉండనే ఉండవట! దాంతో పిల్లలు కచ్చితంగా ఇంటి ఆహారం తెచ్చుకోవాల్సిందే! ఇదే ఆరోగ్యకరమన్న ఉద్దేశంతోనే అక్కడి ప్రభుత్వం ఈ నియమం పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక అక్కడి తల్లులు తమ పిల్లల లంచ్‌ బాక్స్‌లోకి పండ్లు, ఆకుకూరలు, మాంసం, ఛీజ్‌.. వంటి పోషకాహారంతో తయారుచేసిన వంటకాలే పెడుతుంటారట! నార్వేలోని ఈ పద్ధతి నచ్చి.. మరికొన్ని దేశాలూ ఇదే విధానాన్ని అనుసరించే పనిలో పడ్డాయట!

ఆ దేశాల్లో.. ఇలా!

⚛ హాంకాంగ్‌ తల్లులు తమ పిల్లల లంచ్‌ బాక్స్‌లోకి ఉడికించిన వంటకాలే పెడుతుంటారట! ఈ క్రమంలో ఉడికించిన కాయగూరలు, అన్నం, మాంసాహార వంటకాలకు ప్రాధాన్యమిస్తుంటారట!

⚛ థాయ్‌ల్యాండ్‌ పిల్లలు ఏషియాలోనే అత్యంత పోషకభరితమైన లంచ్‌ తీసుకుంటున్నట్లు ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌’ తెలిపింది. ముఖ్యంగా స్టికీ రైస్‌, కాయగూరలు-పండ్లతో తయారుచేసిన సలాడ్‌, గ్రిల్డ్‌ చికెన్‌.. వంటి బ్యాలన్స్‌డ్‌ డైట్‌ను అక్కడి తల్లులు తమ చిన్నారుల ఆహారంలో భాగం చేస్తారట!

⚛ ఇటలీ దేశ చట్టం ప్రకారం.. అక్కడి విద్యార్థుల ఆహారంలో 70 శాతం సహజసిద్ధంగా పండించిన పదార్థాలే ఉండాలన్నది నియమం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే అక్కడి తల్లులు తమ చిన్నారుల లంచ్‌లోకి పండ్లు, ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన స్వీట్లు, కాయగూరలు, సలాడ్స్‌.. వంటివి పెడుతుంటారట!

⚛ అగ్రరాజ్యం అమెరికాలోని పిల్లలకు.. హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌, టొమాటో సూప్‌, క్యారట్‌ స్టిక్స్‌, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌, పండ్లు.. వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని లంచ్‌ బాక్స్‌లో అందిస్తారట అక్కడి తల్లులు.

⚛ దక్షిణ కొరియాలో పిల్లల లంచ్‌ కోసం భాగాలుగా విభజించిన స్టీల్‌ బాక్సుల్నే ఎంచుకుంటారట! వీటిలో అన్నం, సూప్స్‌, కూరలు, మాంసం.. వంటివి సమపాళ్లలో అందిస్తారట! తద్వారా వారికి పోషకాలు కూడా సమపాళ్లలో అందుతాయన్నది అక్కడి తల్లుల నమ్మకం!

⚛ ఇజ్రాయెల్‌లో ఒంటిపూట బడులే ఉంటాయట! ఈ క్రమంలో పిల్లల స్నాక్స్‌ కోసం తల్లులు.. ఉడికించిన కోడిగుడ్లు, నట్స్‌, పండ్లు.. వంటి తేలికపాటి ఆహారం ఎంచుకుంటారట!

⚛ ఇంగ్లండ్‌లోనూ తల్లులు తమ పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్నే ఎంచుకుంటారంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. పండ్లు, ఉడికించిన కాయగూరలు, తక్కువ చక్కెరలతో తయారుచేసిన బ్రెడ్‌.. వంటివి అందిస్తారట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్