వర్షాకాలంలో డేట్స్‌ ఎందుకు తినాలో తెలుసా?

వర్షాకాలం వ్యాధుల కాలం అంటుంటారు. సాధారణంగానే ఈ కాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం ఖాయం.

Published : 14 Sep 2023 20:57 IST

వర్షాకాలం వ్యాధుల కాలం అంటుంటారు. సాధారణంగానే ఈ కాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం ఖాయం. మరి, వీటితో సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందించడం మన చేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మనకు అలవాటే. అయితే వాటిలో ఖర్జూర పండ్లకు మొదటి ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. ఫలితంగా వానాకాలపు వ్యాధుల్ని దూరం చేసుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.

ఇన్ఫెక్షన్లకు విరుగుడుగా..!

సీజన్లను బట్టి మనం కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకుంటుంటాం.. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ మన శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా అవి అడ్డుకోవడమే ఇందుకు ప్రధాన కారణం! ఇలాగే వర్షాకాలంలో ఖర్జూర పండ్లు తినడానికీ కొన్ని కారణాలున్నాయి.. అవేంటంటే..!

ఈ కాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర అనారోగ్యాలతో పోరాడేందుకు అవసరమైన పోషకాలు ఇందులో మిళితమై ఉంటాయి.

శరీరంలో శక్తి స్థాయుల్ని, హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని మెరుగుపరచడంలో డేట్స్‌ ముందుంటాయి.

నిద్రలేమి సమస్యకు ఇది విరుగుడుగా పని చేస్తుంది.

ఈ కాలంలో వాతావరణ పరిస్థితుల రీత్యా శారీరక శక్తి తగ్గిపోయి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. అలాంటప్పుడు డేట్స్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది.

రుచిలో తిరుగులేని ఖర్జూరాలను తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా ఇనుమడిస్తుంది.

వీటిని ఎప్పుడు తీసుకోవాలంటే..?

ఏ వయసు వారైనా సరే.. పరగడుపున తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.

అదే రక్తహీనత (హెమోగ్లోబిన్‌ స్థాయులు తక్కువగా ఉంటే) ఉన్న వారు మధ్యాహ్నం భోజనం చేశాక తినాలి.

పిల్లలు అందులోనూ యుక్తవయసులోకి చేరువవుతోన్న వారు వీటిని మిడ్‌ మీల్‌ స్నాక్‌ (ఉదయం 11.30 నుంచి 12.30 మధ్యలో)గా తీసుకోవడం మరీ మంచిదట!

ఎన్నెన్నో ప్రయోజనాలు!

వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ వల్ల పలు చర్మ సమస్యలు తలెత్తుతాయి. జుట్టు గడ్డిలా మారుతుంది. ఇందుకు శరీరంలో విటమిన్‌ బి6 లోపమే కారణమంటున్నారు నిపుణులు. అందుకే ఈ విటమిన్‌ అధికంగా ఉండే ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు.

క్యాల్షియం, మెగ్నీషియం.. ఈ రెండు ఖనిజాలు శరీరంలోని అనవసర కొవ్వుల్ని కరిగించి చక్కటి శరీరాకృతిని మన సొంతం చేయడానికి తోడ్పడతాయి. అందుకే బరువు తగ్గి నాజూగ్గా మారాలనుకునే వారు ఈ రెండు పోషకాలు ఉన్న డేట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

నెలసరి సమయంలో మూడ్‌ బాగోలేక చిరుతిళ్లు తినాలని మనసు ఆరాటపడుతుంది. ఇలాంటప్పుడు డేట్స్‌ తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు నెలసరి నొప్పుల నుంచీ ఉపశమనం పొందచ్చు.

డేట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డ్యామేజ్‌ చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడతాయి.

ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఖర్జూరాలకు ఉందని పలు అధ్యయనాల్లో సైతం రుజువైంది.

ప్రసవానికి చేరువవుతోన్న మహిళలు డేట్స్‌ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖ ద్వారం సులభంగా తెరుచుకుంటుందని, తద్వారా సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని, టైప్‌-1 మధుమేహంతో బాధపడే వారూ నిస్సందేహంగా వీటిని తీసుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తున్నాయి కదా అని డేట్స్‌ని మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజుకు ఐదారుకు మించి తీసుకోకుండా ఉండడం మేలంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్