ప్రతి విషయాన్నీ తన తల్లికి చెబుతున్నాడు..!

నా వయసు 25 సంవత్సరాలు. గత రెండేళ్లుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మాకు ఏ అంశంలో భేదాభిప్రాయం వచ్చినా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే పరిష్కరించుకుంటాం. అయితే ఆరు నెలల క్రితం మా ప్రేమ విషయాన్ని అతను వాళ్లింట్లో చెప్పాడు.

Published : 28 Jun 2024 12:35 IST

నా వయసు 25 సంవత్సరాలు. గత రెండేళ్లుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మాకు ఏ అంశంలో భేదాభిప్రాయం వచ్చినా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే పరిష్కరించుకుంటాం. అయితే ఆరు నెలల క్రితం మా ప్రేమ విషయాన్ని అతను వాళ్లింట్లో చెప్పాడు. వారు కూడా మా ప్రేమను అంగీకరించారు. అయితే అప్పట్నుంచి ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. మా మధ్య జరిగే ప్రతి విషయాన్నీ అతను తన తల్లికి చెబుతున్నాడు. దానివల్ల పలు సందర్భాల్లో మా ప్రణాళికలు అనుకోకుండా రద్దయ్యాయి. మా మధ్య సమస్య వచ్చినప్పుడల్లా అతని తల్లి నాకు ఫోన్‌ చేసి కారణాలు అడుగుతోంది. దానివల్ల సమస్య మరింత పెద్దదిగా మారుతోంది. ఇదే విషయాన్ని నా బాయ్‌ఫ్రెండ్‌కు చెబితే నువ్వు ఇంకా పరిణతి చెందలేదని అంటున్నాడు. కానీ, ఇలాంటి సమస్యలు అంతకుముందు ఎదురవ్వలేదు. దీనిని ఎలా పరిష్కరించుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా అత్తాకోడళ్ల బంధం అనగానే అదేదో జాతి వైరంగా భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఇద్దరూ ఒకే కుటుంబం గురించి ఆలోచించినా.. అవలంబించే పద్ధతులు వేరుగా ఉండడం వల్ల అభిప్రాయభేదాలు వస్తుంటాయి. ఫలితంగా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అయితే వీటిని అధిగమించి అత్తాకోడళ్లయినా సరే..  తల్లీకూతుళ్ల మాదిరిగా ఉండేవారు కూడా ఉన్నారు. ఇక మీ విషయానికి వస్తే మీ ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. ఎప్పుడైతే మీ విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పాడో అప్పట్నుంచి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

మీ బాయ్‌ఫ్రెండ్‌కు మీ సమస్యను వివరించినా మీకు పరిణతి లేదని చెప్పడంతో మీ బాధ రెట్టింపైందని అర్థమవుతోంది. ఈ క్రమంలో మొదటగా మీరు కొంత వ్యక్తిగత సమయాన్ని మీ కోసం కేటాయించుకోండి. ఈ సమయంలో అసలు ఏ అంశాలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాయి? మీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు ఏంటి? అనేది స్వీయ పరిశీలన చేసుకోండి. ఇది సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

మీ ఇద్దరి మధ్య సమస్యలు వస్తున్నాయని.. వాటిని అతను అర్థం చేసుకోవడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో- వీలైతే ఈ విషయాలను అతని కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో వారికి తగిన గౌరవం ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నీ తల్లిపై నాకు కూడా గౌరవం ఉందన్న విషయాన్ని మీ బాయ్‌ఫ్రెండ్‌కు స్పష్టం చేయండి. దీనివల్ల కొంత సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.

మీరిద్దరూ కొత్త బంధంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఈ క్రమంలో దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మీకంటూ కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం అవసరం. అలాగే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు ఇద్దరి మధ్య కొన్ని పరిధులను గీసుకోండి. ఇవి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికీ ఉపకరిస్తాయి. అప్పటికీ ఏదైనా సమస్య అనిపిస్తే ఒకసారి ప్రీ మ్యారేజ్‌ కౌన్సెలింగ్‌ తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్