AI Dress: అమ్మాయిల వైపు కన్నెత్తి చూశారో.. ఇక అంతే!

‘కాదేదీ కళకు అనర్హం అన్నట్లు.. కాదేదీ ఏఐకి అనర్హం!’ అనేస్తోంది నేటి యువతరం. కృత్రిమ మేధతో మనుషుల్ని, వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారుచేస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్యాషన్‌నీ చేర్చింది క్రిస్టీనా ఎర్నెస్ట్‌.

Published : 04 Jul 2024 12:14 IST

(Photos: Screengrab)

‘కాదేదీ కళకు అనర్హం అన్నట్లు.. కాదేదీ ఏఐకి అనర్హం!’ అనేస్తోంది నేటి యువతరం. కృత్రిమ మేధతో మనుషుల్ని, వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారుచేస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్యాషన్‌నీ చేర్చింది క్రిస్టీనా ఎర్నెస్ట్‌. తన ఫ్యాషన్‌ ప్రతిభతో ఓ అందమైన డ్రస్‌ని రూపొందించిన ఆమె.. దానికి ఏఐతో హంగులద్దింది. ప్రస్తుతం ఆమె డిజైన్‌ చేసిన ఈ అవుట్‌ఫిట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏఐ మాయాజాలం అద్భుతం.. దాన్ని సరైన రీతిలో అందిపుచ్చుకుంటే ఇలాంటి సృజనాత్మకత ఉత్పత్తులే బయటికొస్తాయి..’ అంటూ క్రిస్టినా క్రియేటివిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి, ఇంతకీ ఎవరీ క్రిస్టీనా? ఆమె రూపొందించిన ఈ డ్రస్‌ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

సృజనాత్మక ఆలోచనలు చేయడంలో నేటి యువతరం ముందుంటుంది. తమ ఆలోచనలకు టెక్నాలజీని జోడించి కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు కొందరు. క్రిస్టీనా కూడా ఇందుకు మినహాయింపు కాదు. గత ఐదేళ్లుగా గూగుల్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న ఆమెకు ఫ్యాషన్ అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే విభిన్న ఫ్యాషబుల్‌ దుస్తుల్ని రూపొందించే ఆమె.. ఈసారి సరికొత్త ఆలోచన చేసింది. తాను డిజైన్‌ చేసిన ఓ లాంగ్‌ ఫ్రాక్‌కు కృత్రిమ మేధతో హంగులద్దింది.

మెడుసా డ్రస్‌.. మాయ ఇది!

నలుపు రంగు వి-నెక్‌, స్లీవ్‌లెస్‌ లాంగ్‌ ఫ్రాక్ రూపొందించిన క్రిస్టీనా.. దానిపై అక్కడక్కడా బంగారు వర్ణపు పాముల్ని డిజైన్‌ చేసి.. వాటితో హంగులద్దింది. అది కూడా కృత్రిమ మేధతో రూపొందించిన రోబోటిక్‌ పాములవి! ఈ క్రమంలోనే మెడ చుట్టూ ఓ పెద్ద రోబోటిక్‌ పామును ఆభరణంగా డిజైన్ చేసిన ఆమె.. డ్రస్‌ నడుము భాగంలో చిన్న చిన్న ఏఐ పాముల్ని వేలాడదీసింది. ఎవరు ఎదురుపడినా తలెత్తి ఆ వ్యక్తి ముఖం చూసి గుర్తుపట్టేలా వీటిని రూపొందించిందామె. అలాగే కుడి చేతికి హ్యాండ్‌ కఫ్‌ మాదిరిగా మరో పామును ఆభరణంగా జత చేసింది. ఇలా తాను రూపొందించిన ఈ ఏఐ అవుట్‌ఫిట్‌కు ‘మెడుసా డ్రస్’ అని పేరు కూడా పెట్టుకుందామె. ఇక ఇదే డ్రస్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్న క్రిస్టీనా..

‘రోబోటిక్‌ స్నేక్‌ డ్రస్ రూపొందించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. కృత్రిమ మేధ టెక్నాలజీతో ఈ డ్రస్‌పై ఉన్న పాములకు కొన్ని కమాండ్స్‌ ఇచ్చా. ఎవరైనా ఈ డ్రస్‌ ధరించిన వారి వైపు కన్నెత్తి చూస్తే.. వీటిపై ఉన్న ఏఐ పాములు తల పైకెత్తి వారిని చూసేలా, గుర్తుపట్టేలా వీటిని డిజైన్‌ చేశా. అపరిచితులు, అమ్మాయిలకు ప్రమాదం తలపెట్టాలని చూసే వారిపై ఇదొక నిఘా వ్యవస్థలా పనిచేస్తుంది. సడన్‌గా చూసి ఇవి నిజమైన పాములేమో అనుకొని సదరు వ్యక్తులు భయపడి పోయే అవకాశమూ ఉంటుంది. దాంతో ప్రమాదం నుంచి సులభంగా బయటపడచ్చు. నాకు తెలిసి.. కృత్రిమ మేధతో రూపొందించిన తొలి డ్రస్‌ ఇదే కాబోలు!’ అంటోందీ ఏఐ ఇంజినీర్.

మీ సృజనాత్మకత.. స్ఫూర్తిదాయకం!

ఇక తాను రూపొందించిన ఈ ఏఐ డ్రస్‌ను తానే ధరించి.. అదెలా పనిచేస్తుందో తెలియజేసే వీడియోను ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకుంది క్రిస్టీనా. అంతేకాదు.. దీని డిజైనింగ్‌, కోడింగ్‌కు సంబంధించిన అంశాల్నీ విడివిడిగా ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందామె. ప్రస్తుతం ఈ ఏఐ డ్రస్‌ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. లక్షల కొద్దీ వ్యూస్‌ని, లైక్స్‌ని సొంతం చేసుకుంటోంది. పలువురు దీనిపై స్పందిస్తూ క్రిస్టీనా సృజనాత్మకతను కొనియాడుతున్నారు.

‘ఈ డ్రస్‌ అద్భుతం.. మీ క్రియేటివిటీ స్ఫూర్తిదాయకం! అమ్మాయిల్ని స్టెమ్‌ రంగంలో ప్రోత్సహిస్తే ఇలాంటి అద్భుతాలే బయటికొస్తాయి..’ అంటూ ఒకరు స్పందించారు.
‘ఫ్యాషన్‌, టెక్నాలజీ రంగాలపై ఈ డ్రస్‌ మరింత సానుకూల ప్రభావం చూపుతుందనుకుంటున్నా.. చాలా బాగుంది..’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకొంతమంది కృత్రిమ మేధతో, ఫ్యాషన్‌తో తమకున్న అనుభవాల్ని.. ఈ క్రమంలో తాము డిజైన్‌ చేసిన ఉత్పత్తుల గురించి పంచుకుంటే.. ఇదే డ్రస్‌లో పలు మార్పులు చేర్పులు చేయాలంటూ కొందరు సలహాలిస్తున్నారు.


అమ్మాయిలకు.. రోబోటిక్‌ పాఠాలు!

అయితే కృత్రిమ మేధతో ఇలాంటి క్రియేటివ్‌ ఉత్పత్తుల్ని సృష్టించడం క్రిస్టీనాకు కొత్త కాదు.. గతంలో ‘టీ తయారుచేసే రోబో’, ‘డెస్క్‌టాప్‌ ఫ్యాన్‌’, ‘మ్యూజికల్‌ కప్‌ కేక్‌ టాపర్‌’, ‘కలర్‌ ఛేంజింగ్‌ స్కర్ట్‌’.. వంటివెన్నో రూపొందించింది క్రిస్టీనా. అంతేనా.. ఆయా ఉత్పత్తులకు పలు అవార్డులు-రివార్డులు కూడా అందుకుంది. స్టెమ్‌ రంగంలో అమ్మాయిల్ని ప్రోత్సహించడానికి ‘షి బిల్డ్స్‌ రోబోస్‌’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించిందిన ఆమె.. ఈ వేదికగా ఉచితంగా వారికి రోబోటిక్స్‌, ఏఐ పాఠాలు చెబుతోంది.

‘నాకు గణితం, సైన్స్‌ అంటే చిన్నతనం నుంచే ఆసక్తి. ఈ మక్కువతోనే భవిష్యత్తులో స్టెమ్‌ రంగంలోకి రావాలనుకున్నా. స్కూల్లో ఉన్నప్పుడే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నాకు పరిచయమైంది. అది నాకెంతో నచ్చింది. దీని సహాయంతో కొత్త కొత్త ఆలోచనలు చేయచ్చనిపించింది. ఇలా ఇవన్నీ ఇలినాయిస్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివేలా నన్ను ప్రోత్సహించాయి. ఇక ఇక్కడి ప్రయోగశాలలో రోబో, ఆపరేటింగ్‌ సిస్టమ్‌.. వంటి సాంకేతికతను ఉపయోగించుకొని నేను సృష్టించిన కొత్త ఉత్పత్తులు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అంతేకాదు.. ఇక్కడి ఇంజినీరింగ్‌ అంబాసిడర్స్‌ గ్రూప్‌లోనూ నేను భాగమయ్యా. ఇందులో భాగంగా స్థానిక పాఠశాలలకు వెళ్లడం, అక్కడి పేద పిల్లల్ని స్టెమ్‌లో ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం.. వంటివి చేశా. ఈ స్ఫూర్తితోనే ‘షి బిల్డ్స్‌ రోబోస్‌’ సంస్థను స్థాపించా. ఈ వేదికగా ఎంతోమంది చిన్నారుల్ని స్టెమ్‌లో ప్రోత్సహిస్తున్నా..’ అనే క్రిస్టీనా.. ఆత్మవిశ్వాసమే తన గెలుపు సూత్రంగా అభివర్ణిస్తోంది. తన విద్యార్థుల్లోనూ ఇదే స్ఫూర్తిని నింపుతున్నానంటోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్