75 గ్రామాల్లో... చిరు విప్లవం

చేయి చేయి కలిపితే చేతకానిది ఏముంటుంది? వీళ్లదీ అదేమాట. ఐదువేలమంది మహిళలు... కాయగూరలు పండించి నగరాలకు ఎగుమతి చేశారు. ఫర్నిచర్‌ తయారుచేసి పట్టణాలకు పంపించారు. తాజాగా చిరుధాన్యాలని సామాన్యులకు చేరువచేస్తూ ఆరోగ్యానికి పట్టం కడుతున్నారు.

Published : 23 Jun 2024 02:18 IST

చేయి చేయి కలిపితే చేతకానిది ఏముంటుంది? వీళ్లదీ అదేమాట. ఐదువేలమంది మహిళలు... కాయగూరలు పండించి నగరాలకు ఎగుమతి చేశారు. ఫర్నిచర్‌ తయారుచేసి పట్టణాలకు పంపించారు. తాజాగా చిరుధాన్యాలని సామాన్యులకు చేరువచేస్తూ ఆరోగ్యానికి పట్టం కడుతున్నారు. జనగామ జిల్లాలోని కాకతీయ మహిళా సహకార సంఘం ఏం చేసినా అది తోటివారికి స్ఫూర్తినిస్తూనే ఉంది... 

కొవిడ్‌ తరవాత స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రాంతంలోని పల్లెల్లో ఒక కార్పొరేట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఆశ్చర్యంగా... ఒక్క తాటికొండ గ్రామంలోనే 600మంది బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థులున్నట్టు ఆ సర్వేలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న కాకతీయ మహిళా సహకార సంఘం సభ్యులు... అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చికిత్సతోపాటు చిరుధాన్యాలతో చేసిన ఆహారం చక్కని పరిష్కారం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా... చిరుధాన్యాలతో స్వీట్లతో సహా అన్నిరకాల వంటలూ చేసుకోవచ్చని ముందుగా తమ సంఘ సభ్యులకే అవగాహన కల్పించారు. ఆ తరవాత నుంచీ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ వంటిచోట్ల సేంద్రియ పద్ధతుల్లో పండించిన జొన్నలు, రాగులు, సజ్జలను నెలకోసారి లారీల్లో ఘన్‌పూర్‌కు తెప్పించుకుంటున్నారు. సొంతంగా గిర్నీలు, మరమిల్లులు ఏర్పాటు చేసుకుని, చిరుధాన్యాలని మర పట్టిస్తున్నారు. గ్రామాల్లో చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసి బయటకన్నా పది రూపాయలు తక్కువకే పిండి, రవ్వ అమ్ముతున్నారు. ప్రస్తుతం వీరు 75 గ్రామాల్లో ప్రతి నెలా జొన్న, రాగి, సజ్జ పిండి, రవ్వలతోపాటు గోధుమలను విక్రయిస్తూ ఆరోగ్యానికి పట్టం కడుతున్నారు. ఇంతకీ వీళ్ల ప్రయాణం ఎలా ప్రారంభమైందంటే... 22 ఏళ్ల క్రితం గ్రామీణ మహిళల శక్తిని ప్రపంచానికి చాటేందుకు వెంకటస్వామి స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో 12 మంది సభ్యులతో కాకతీయ మహిళా మాక్స్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. వీరంతా నెలకు రూ. పది నుంచి రూ. 50 వరకు పొదుపు చేస్తూ ఆర్థికంగా బలపడ్డారు. క్రమంగా వీళ్ల పొదుపు కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాఅలా ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతూ 75 ఊళ్లలో 5200 మంది సభ్యులు ఈ సంఘంలో చేరారు. పొదుపు సొమ్ముతో మొదట వీళ్లు ఒక సూపర్‌మార్కెట్ని ప్రారంభించారు. ఆ తరవాత వ్యాపారంలో చురుగ్గా ఉండేందుకు కంప్యూటర్‌ శిక్షణ తీసుకున్నారు. 2018లో... సేంద్రియ కూరగాయలు పండించి హైదరాబాద్‌కు పెద్ద మొత్తంలో ఎగుమతి చేసేవారు. సంఘంలోని ఒంటరి మహిళలు వడ్రంగం పనిలో శిక్షణ తీసుకున్నారు. గుమ్మాలు, కిటికీలు, డైనింగ్‌ టేబుళ్లు, కంప్యూటర్‌ టేబుళ్లు చేసి ఉపాధి పొందుతున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ సంఘం.. ప్రస్తుతం చిరుధాన్యాల ఉత్పత్తులతోనూ దూసుకెళ్తోంది. 

గుండు పాండురంగశర్మ, వరంగల్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్