ఈ బ్యాగులు మన మంచికే!

టిక్‌... టిక్‌... టిక్‌... టైంబాంబ్‌! ఎక్కడో లేదు. మీ చేతుల్లోనే ఉంది! అదిరిపడినా... ఎలా అని ఆశ్చర్యపోయినా వాస్తవం అదే. అది మరేదో కాదు.. నిత్యావసరాల కోసం  మనం ఉపయోగించే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌.

Published : 03 Jul 2024 15:48 IST

(నేడు ఇంటర్నేషనల్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఫ్రీ డే సందర్భంగా) 

టిక్‌... టిక్‌... టిక్‌... టైంబాంబ్‌! ఎక్కడో లేదు. మీ చేతుల్లోనే ఉంది! అదిరిపడినా... ఎలా అని ఆశ్చర్యపోయినా వాస్తవం అదే. అది మరేదో కాదు.. నిత్యావసరాల కోసం  మనం ఉపయోగించే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌. ఎన్నో కాలుష్యాలకు కారణమవుతోన్న వీటికి ప్రత్యామ్నాయం ఆలోచించి పెడుతున్నారీ మహిళలు...

ది కలహారి ఎడారి. అక్కడ ఓ తెగ నివాసం ఉంటోంది. ఓ రోజు వాళ్లకి గాల్లో వెళ్తున్న విమానం నుంచి కోలా బాటిల్‌ ఒకటి కింద పడి దొరుకుతుంది. అక్కడున్న జంతువులు, ఎడారి చెట్ల మాదిరిగానే ఇది కూడా దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని జాగ్రత్తగా చూసుకుంటారు ఆ తెగ ప్రజలు. తర్వాత్తర్వాత ఆ సీసాతో వాళ్లలో కలహం రాజుకుంటుంది. అది భగవంతుడే ఇచ్చినా సరే తన జాతికి హాని చేసే ఆ సీసా వద్దనుకుని దూరంగా పారేసి వస్తాడు ఆ తెగ నాయకుడు. ‘గాడ్స్‌ మస్ట్‌ బి క్రేజీ’ అనే పాత ఇంగ్లిష్‌ సినిమా కథ ఇది. ప్లాస్టిక్‌తో వచ్చే సమస్యలన్నీ మనకి తెలిసినా మనం మాత్రం వాళ్లలా వదిలించుకోకుండా ఇంకా వాటిని పట్టుకుని వేలాడుతున్నాం. కానీ ఈ మహిళలు మాత్రం ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారు.

గుర్రపు డెక్కతో...

చెరువులు, కాలువల నిండా అల్లుకునే కలుపుమొక్క గుర్రపు డెక్క గురించీ, అది వ్యవసాయానికి చేసే నష్టం గురించి తెలియని వారుండరు. వాటితోనే అందమైన బ్యాగులు తయారు చేస్తున్నారు త్రిసూర్‌లోని కిడ్స్‌ (కొట్టాపురం ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) అనే సంస్థకు చెందిన 600 మంది మహిళలు. అలప్పుళ జిల్లాలోని నీలమ్‌పూర్‌ పంచాయతీకి చెందిన వీళ్లు ఎన్నో ఏళ్లుగా గుర్రపు డెక్కల సేకరణనే వృత్తిగా ఎంచుకున్నారు. వీటిని ఎండబెట్టి కిలో పది రూపాయలకు అమ్ముతున్నారు. మొగలి, తాటాకులనీ సేకరిస్తుంటారు. వీటిని తమిళనాడుకు చెందిన మహిళలు అందమైన బ్యాగులుగా మారుస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ ఈ బ్యాగులకు డిమాండ్‌ తగ్గలేదు. మరోపక్క గుర్రపుడెక్క తొలగింపుతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులనూ అడ్డుకుంటున్నారు. అలాగే ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లోనూ బ్యాక్‌టు బాస్కెట్, హైప్యాక్‌ వంటి సంస్థలు గుర్రపుడెక్కతోనే సంచులని తయారుచేస్తున్నాయి. ప్యాకింగ్‌లోనూ వీటిని వాడుతున్నారు. 

పసుపు బ్యాగు ఉద్యమం...

ఇప్పుడంటే ప్లాస్టిక్‌ సింగిల్‌ యూజ్‌ బ్యాగులు వాడుతున్నాం కానీ... గతంలో బయటకు వెళ్లేటప్పుడు చేతిలో ఒక సంచీ పెట్టుకుని వెళ్లేవాళ్లం. తమిళనాడులో అయితే తప్పనిసరిగా ఓ పసుపు సంచీ వెంటబెట్టుకుని వెళ్లేవారు. తిరిగి ఆ పద్ధతి వస్తే ప్లాస్టిక్‌ని తగ్గించుకోవచ్చని తమిళనాడులో ‘మీండుమ్‌ మంజాపై’ ఉద్యమం లేవనెత్తారు ఐఏఎస్‌ అధికారిణి సుప్రియాసాహు. బీచ్‌ల దగ్గర ప్రత్యేకంగా వీటికోసం కియోస్క్‌లనీ ఏర్పాటు చేశారు. కాయిన్‌ వేస్తే సంచి చేతికొస్తుంది.

వైరు బ్యాగులతో... 

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు లేని రోజుల్లో మనలో చాలామంది వైరు బుట్టలు అల్లేవారు. ఎక్కడికెళ్లినా అది చేతిలో ఉండేది. ఇప్పుడా వైరు బుట్టలే మళ్లీ ఫ్యాషన్‌ అయ్యాయి. తమిళనాడుకు చెందిన అత్తాకోడళ్లు సరస్వతీ, అబీలు స్థానిక మహిళలకు ఉపాధినిస్తూ... ఈ వైరు బుట్టల్ని సారస్‌ పేరుతో దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. బలంగా, ఎక్కువ కాలం మన్నే ఈ బుట్టలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

కరవు నేర్పిన పాఠంతో... 

చిత్తూరులోని చిన్న గ్రామం పాలగుట్టపల్లె. గతంలో ఆ ఊరు ఎక్కడుందో గూగుల్‌లో వెతికినా దొరికేది కాదు. అలాంటిది ఇప్పుడు పాలగుట్టపల్లె గురించి నలుగురికీ తెలిసిందంటే కారణం అక్కడ వస్త్రంతో చేసే సంచుల వల్లే. కొన్నేళ్ల క్రితం అక్కడ కరవు వల్ల వ్యవసాయంలో నష్టాలు పలకరించాయి. మరో దారిలేని అతివలు తమకు తెలిసిన కుట్టుపనినే ఉపాధిగా మార్చుకుని బ్యాగులు కుట్టడం ప్రారంభించారు. వాళ్లు కుట్టే టొటే, కాన్వాస్‌ బ్యాగులకి ఎంత పేరు వచ్చిందంటే ఆ ఊరి పేరుతోనే పాలగుట్టపల్లె బ్యాగులని పిలవడం మొదలుపెట్టారు. 

సస్టెయినబుల్‌ మెటీరియల్‌తో తయారుచేసిన ఈ బ్యాగులు బాగా మన్నుతాయి. కాయగూరల మార్కెట్‌కి వెళ్లినప్పుడు కొత్తిమీరకో కవరు, కాకరకాయలకో కవరు అని కాకుండా అన్నింటినీ విడివిడిగా వేసుకోవడానికి వీలుగా ఆరు కంపార్ట్‌మెంట్లున్న కాన్వాస్‌ బాగులు దొరుకుతున్నాయి. వీటిని వాడితే ప్లాస్టిక్‌ వాడకాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్