మీ మానస పుత్రిక.. స్ఫూర్తిని రగిలించే మా ప్రియమైన పత్రిక!

ప్రతి నిత్యం సూర్యోదయానికంటే ముందే పలకరించే ప్రియ నేస్తం.. ‘ఈనాడు’. సమాచారం, విజ్ఞానం, వినోదం- ఈ మూడింటినీ గుదిగుచ్చి తనదైన ప్రత్యేక శైలిలో అయిదు దశాబ్దాలుగా పాఠకులతో అక్షరానుబంధాన్ని కొనసాగిస్తోంది ఈనాడు.

Published : 20 Jun 2024 14:24 IST

ప్రతి నిత్యం సూర్యోదయానికంటే ముందే పలకరించే ప్రియ నేస్తం.. ‘ఈనాడు’. సమాచారం, విజ్ఞానం, వినోదం- ఈ మూడింటినీ గుదిగుచ్చి తనదైన ప్రత్యేక శైలిలో అయిదు దశాబ్దాలుగా పాఠకులతో అక్షరానుబంధాన్ని కొనసాగిస్తోంది ఈనాడు.

ఇక వనితా లోకంతో ఈనాడుది అపురూప ఆత్మీయ అనుబంధం! మహిళల చైతన్యం.. అభ్యున్నతే లక్ష్యంగా.. మూడు దశాబ్దాల క్రితం ప్రత్యేకంగా అతివల కోసమే.. స్వర్గీయ రామోజీరావు మానస పుత్రికగా ఆవిర్భవించింది 'ఈనాడు వసుంధర'.

ఈ నేపథ్యంలో- ‘స్వర్గీయ రామోజీరావు గారి మానస పుత్రిక ‘ఈనాడు వసుంధర’తో మీకున్న ఆత్మీయ అనుబంధం.. అనునిత్యం ‘వసుంధర’ మీలో స్ఫూర్తి రగిలిస్తున్న వైనం గురించి పంచుకోండి..’ అంటూ ‘వసుంధర.నెట్’ నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికకు పలువురు మహిళా పాఠకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 

తనదైన దార్శనికతతో.. మూడు దశాబ్దాల క్రితమే మహిళల కోసం ప్రత్యేకంగా 'వసుంధర'ను ప్రారంభించి, మహిళా సాధికారతకు రామోజీరావు గారు చేసిన విశేష కృషిని పలువురు మహిళలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తమ అభిమాన పత్రికతో తమకున్న అనుబంధం, అది వారిలో స్ఫూర్తి కలిగిస్తున్న విధానం గురించి తమ విలువైన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తుది క్షణం వరకు అణువణువునా మహిళాభ్యుదయాన్ని కాంక్షించిన మహనీయుడు, ‘అక్షర యోధుడు’ రామోజీరావుకి.. సమస్త వనితా లోకం తరఫున ఘనమైన నివాళులర్పిస్తున్నారు..!

ఫ్యాషన్‌ పాఠాలు నేర్పింది! - స్వర్ణ, ముంబయి

నాకు ఊహ తెలిసినప్పట్నుంచి ‘వసుంధర’తో నా అనుబంధం కొనసాగుతోంది. చిన్నప్పుడు మా అమ్మ.. ఈ పేజీలో వచ్చే కుట్లు-అల్లికలు, నజరానా, వంటలు.. వంటివన్నీ రోజూ కట్‌ చేసి భద్రపరిచేది. వాటిని నేను ఖాళీ సమయంలో చదివేదాన్ని. ఉదయాన్నే పేపర్‌ రాగానే ‘వసుంధర’ పేజీ కోసం అమ్మ, నేను పోటీ పడేవాళ్లం. మాది పల్లెటూరే అయినా.. నాకు ఫ్యాషనబుల్‌గా తయారవడం నేర్పించింది వసుంధరే! ఎందుకంటే ఈ పేజీలో ‘ఫ్యాషన్‌-ఫ్యాషన్‌’ పేరుతో వచ్చే ఆర్టికల్స్‌ అన్నీ ఫాలో అయ్యేదాన్ని. నిపుణులు అందించే హెయిర్‌స్టైల్స్‌ కూడా ప్రయత్నించేదాన్ని. ఇవే కాదు.. మరెన్నో స్ఫూర్తిదాయక కథనాలతో మహిళల్లో ధైర్యం నూరిపోసేది ‘వసుంధర’. ఏటా క్రమం తప్పకుండా ‘వసుంధర’ నిర్వహించే ‘లిటిల్ కృష్ణ’ కంటెస్ట్‌కి నా పిల్లల ఫొటోలు కూడా పంపించేదాన్ని. వాటిని ‘వసుంధర.నెట్’లో ప్రచురించినప్పుడు ఎంతగానో మురిసిపోయా. ప్రస్తుతం మేం ముంబయిలో స్థిరపడ్డా.. రోజూ ఆన్‌లైన్‌లో ఈనాడు తప్పకుండా చదువుతా. ఈ పేజీని మహిళలకు మరెంతో ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ థ్యాంక్యూ వసుంధర.. థ్యాంక్యూ ఈనాడు.. థ్యాంక్యూ రామోజీరావు గారు!


జీవితం విలువ తెలియజేసింది! - శిరీష గంట, హైదరాబాద్

రామోజీరావు గారి లాగానే అందరికీ ఉపయోగపడేలా, స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది ‘వసుంధర’..! ఈ పత్రికతో మా అనుబంధం చాలా సుదీర్ఘమైనదే అని చెప్పచ్చు. ‘ఈనాడు’కి, రామోజీ ఫిల్మ్ సిటీకి, మా కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. నాకు ఏడేళ్లున్నప్పుడు.. అంటే 1997లో మా నాన్న ఫిలింసిటీలో పనిచేసేవారు. ఆ సమయంలో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుండి ఫిలింసిటీ కుటుంబంలో మేమూ భాగమయ్యాం. మా నాన్న ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు మా అమ్మ కూడా ఇక్కడే చిన్న ఉద్యోగంలో చేరింది.. 2008లో నాన్న ఉద్యోగం చేస్తూనే మూత్రపిండాల సమస్యతో చనిపోయారు. అప్పటి నుండి ఇంటి బాధ్యత అమ్మదే అయింది. చెల్లి పెళ్లి, ఆ తర్వాతి బాధ్యతలన్నీ అమ్మే చూసుకుంది. ప్రస్తుతం అమ్మ రొమ్ము క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడింది.. ఇలా ఎంతో కష్టకాలంలో ఉన్న మాకు ఫిలింసిటీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేస్తూనే ఉంది. మాలాంటి కుటుంబాలెన్నో రామోజీరావు గారి మానవత్వానికి ప్రత్యక్ష నిదర్శనం!

ఇక 'వసుంధర'తో మాకున్న ఓ అనుభవం మీతో పంచుకోవాలి.. 17 ఏళ్ల క్రితం మాకు తెలిసిన ఒక ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడింది. ఆమె భర్తని ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఇలా అడిగాను.. 'అంకుల్.. మీరు ఇంత త్వరగా ఈ వ్యాధిని ఎలా గుర్తించారు'?అని. దానికి సమాధానంగా ఆయన.. 'ఈనాడు వసుంధర'లో క్యాన్సర్, దాని లక్షణాలు.. చికిత్స విధానం.. ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి.. ఇలాంటి విషయాలు ప్రచారించారు. మీ ఆంటీ చదివి, నాతో చదివించింది.. కొన్ని రోజుల తరువాత అవే లక్షణాలు ఆవిడలో కనిపించాయి. వెంటనే పరీక్షలు చేయించాం.. వ్యాధి నిర్ధారణ అయింది. ప్రాథమిక దశలో ఉంది.. అని డాక్టర్ చెప్పారు..’ అని నాతో ఆయన అనుభవాలను పంచుకున్నారు. ఆవిడ అలా క్యాన్సర్ నుంచి బయటపడింది.

అంతేకాకుండా.. ‘వసుంధర’లో ప్రచురించే కథనాలు వ్యక్తిగతంగా కూడా నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపాయి.. నాకు 10వ తరగతి అయిపోగానే 16 ఏళ్లకే పెళ్లి చేసి పంపించారు.. ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు నా జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ‘వసుంధర’ కథనాలు నాలో ఎనలేని స్ఫూర్తిని నింపాయి.. ఈ క్రమంలోనే పెళ్లైన ౫ ఏళ్లకి డిగ్రీ పూర్తి చేసి, నర్సరీ టీచర్‌గా నా జీవితాన్ని తిరిగి ప్రారంభించా. ఇప్పుడు పదో తరగతి సోషల్ టీచర్‌గా మంచి జీతం అందుకునే స్థాయికి చేరుకున్నా. రామోజీరావు గారి మానవత్వం, దార్శనికత; ‘ఈనాడు వసుంధర’ అందించిన స్ఫూర్తి వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.


ఆ కథనాలే నాకు స్ఫూర్తి! - సత్యకళ, ఖతార్

‘ఈనాడు వసుంధర’ చదవడం నాకు ఎంతో ఇష్టం. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళల కథలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వీటిని చదివి పలు సందర్భాల్లో స్ఫూర్తిని, ఓదార్పును పొందాను. సంక్రాంతికి వచ్చే రంగవల్లికలు, వంటలు కట్ చేసుకుని ఇప్పటికీ పదిలంగా దాచుకుంటాను. సౌందర్య చిట్కాలు, ఆరోగ్య సూచనలు చాలా బాగుంటాయి. ప్రస్తుతం ఖతార్‌లో ఉండడం వల్ల ఆన్‌లైన్‌లోనే పేపర్‌ చదివి ఆనందిస్తున్నా. అలాగే ‘ఆదివారం అనుబంధం’లో వచ్చే కథలు తప్పకుండా చదువుతాను. మాకు స్ఫూర్తినిచ్చే ఎన్నో కథనాలను అందించిన స్వర్గీయ రామోజీరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సుమాంజలి!


ఏ ఒక్కటీ వదలను! - ఉమ

‘ఈనాడు’ అందించే ‘వసుంధర’ ఎడిషన్‌ చదవనిదే నా రోజు పూర్తి కాదు. నా చిన్నప్పుడు దీన్ని మా అమ్మ నాకు పరిచయం చేసింది. ఆర్టికల్స్‌, చిట్కాలు.. వంటివన్నీ కట్‌ చేసుకొని దాచుకునేది. ‘వసుంధర’లో వచ్చే ప్రతి అంశం స్ఫూర్తి నింపేదే. అందుకే ఏదీ వదలకుండా చదువుతా. ‘సూపర్‌ విమెన్‌’, ‘బ్యూటీ-ఫ్యాషన్‌’, ‘స్వీట్‌ హోమ్‌’, ‘ఆరోగ్యమస్తు’.. వంటి శీర్షికలు మరీ ఇష్టం. ప్రముఖ మహిళల ఇంటర్వ్యూలు, మహిళల విజయ గాథలు నాలో ఎనలేని ప్రేరణ కలిగించాయి. మహిళాభివృద్ధే ధ్యేయంగా ‘వసుంధర’ పేజీని తీర్చిదిద్దినందుకు రామోజీరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు! మీరు ఎప్పుడూ ఇలా మా మధ్యే ఉంటారు సర్..!


నాకు ఇదో వ్యాపకం! - అనిత

చిన్నతనం నుంచి ‘వసుంధర’తో నా అనుబంధం కొనసాగుతోంది. ‘వసుంధర’ నుంచి నేను నేర్చుకున్న అంశాలెన్నో! మహిళలకు సంబంధించిన సకల విషయాలూ ఈ పేజీ మనకు అందిస్తోంది. వంటల చిట్కాలు, ఆధునిక ఆహార్యం, డ్రస్సింగ్‌ గురించి తెలియజేసే ‘ఫ్యాషన్‌-ఫ్యాషన్‌’ శీర్షిక.. ఇలా ప్రతి అంశం నేను ‘వసుంధర’ నుంచే నేర్చుకున్నా. నేను ఎంత బిజీగా ఉన్నా ‘వసుంధర’ పేపర్‌ తప్పకుండా చదువుతా. నాకు ఇదో వ్యాపకం! ఇన్ని స్ఫూర్తిదాయక విషయాలు ప్రచురిస్తున్నందుకు ‘ఈనాడు-వసుంధర’కు ధన్యవాదాలు!


'ముత్యాల ముగ్గుల్లో’ నా పాత్రా ఉంది! -  సూర్య ప్రభ

ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత, మానవతామూర్తికి.. మహిళామణులందరి తరఫున నమస్సుమాంజలి! రామోజీరావు గారి మానస పుత్రిక 'వసుంధర' గురించి ఏమని చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే! రోజూ ఉదయమే 'ఈనాడు' రాగానే మా అబ్బాయి మెయిన్ ఎడిషన్ తను తీసుకొని, 'మమ్మీ.. నీ పేజ్ ఇదిగో..' అంటూ 'వసుంధర' పేజీని నాకు ఇస్తే.. అపురూపంగా 'వసుంధర'ను అందుకొని ఒక్క పదాన్ని కూడా వదలకుండా చదివేసి; స్ఫూర్తిదాయకమైన విషయాలను ఎవరికి అవసరమో వాళ్లకు చెబుతుంటాను. 'ముత్యాల ముగ్గుల్లో నా పాత్రా ఉంది' అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను!

మరింతమంది మహిళల మనోగతం గురించి తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్