ఇబ్బందే... అయినా సమాధానం చెప్పాలి

సుగుణ ఎనిమిదేళ్ల కూతురు స్నిగ్థ ఓరోజు ‘అమ్మా నేనెక్కడి నుంచి వచ్చాను, నీ పొట్టలో ఎందుకున్నా’నంటూ అడిగింది. ఊహించని ఈ ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంకాలేదామెకు. ఈ సందర్భం దాదాపు ప్రతి తల్లికీ ఎదురవుతుంది.

Updated : 02 Jul 2024 06:53 IST

సుగుణ ఎనిమిదేళ్ల కూతురు స్నిగ్థ ఓరోజు ‘అమ్మా నేనెక్కడి నుంచి వచ్చాను, నీ పొట్టలో ఎందుకున్నా’నంటూ అడిగింది. ఊహించని ఈ ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంకాలేదామెకు. ఈ సందర్భం దాదాపు ప్రతి తల్లికీ ఎదురవుతుంది. ఇబ్బందిగా ఉన్నా వారి వయసుకు తగ్గ సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు నిపుణులు.

పిల్లలకు తమకెదురయ్యే ప్రతీదీ కొత్తగా, వింతగా కనిపిస్తుంది. సందేహాలెన్నో వస్తుంటాయి. వారడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం తెలిస్తేనే తృప్తి పడతారు. లేదంటే ఆ ప్రశ్నకు మరో ప్రశ్న వారి మెదడులో చేరి అయోమయానికి గురవుతారు. అందుకే ఎప్పటికప్పుడు వారి సందేహాలను తీర్చాల్సిందే. అవి వారి పాఠ్యాంశాలు, కథలు, వాటిలోని పాత్రలు, అంతరిక్షం, ఆహారం, ఆటలువంటివి మాత్రమే అయితే ఇబ్బంది లేదు. మరికొంత ముందుకెళ్లి వారి పుట్టుక గురించి, గర్భధారణ వంటివి ప్రశ్నిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఆ వయసులో వారికి అవసరంలేనివి అడుగుతున్నారనిపించి కోప్పడి వాళ్ల నోరు మూయించొచ్చు. అయితే ఆ సందేహం వారి మనసు నుంచి దూరం కాదు. అది పెరిగి పెద్దదవుతుంది.

ఎలా చెప్పాలంటే...

ఏడెనిమిదేళ్లలోపు చిన్నారులకైతే ఏదైనా కథ రూపంలో సమాధానమివ్వాలి. మరొకసారి మరింత సమాచారం చెబుతానని అక్కడితో సంభాషణను పూర్తిచేయొచ్చు. ఎనిమిదేళ్లు దాటిన ఆడపిల్లలకు సమాధానం తప్పనిసరి. కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతారు. విసుక్కోకుండా మృదువుగా వారికి కావాల్సినంత మేరకు సమాచారాన్నివ్వొచ్చు. అమ్మ గర్భంలో బిడ్డ ఎదుగుదల గురించి వివరించాలి. మరింత అవగాహన తెచ్చుకొనే వయసైతే ప్రసవం గురించీ వివరించొచ్చు.

చనిపోవడమంటే చెప్పాలి...

అమ్మమ్మ, నాయనమ్మ, జేజమ్మ ఎందుకు చనిపోయారని, వారెక్కడికి వెళ్లారని కొందరు పిల్లలకు సందేహాలొస్తుంటాయి. పదేళ్లవారికైతే జీవితంలో చివరగా వచ్చే మృత్యువు గురించి మృదువుగా వివరించాలి. అంతకన్నా చిన్నపిల్లలను దేవుడి దగ్గరకెళ్లారని చెప్పి మరిపించొచ్చు. అలానే, అన్నయ్యకన్నా నేనెందుకు భిన్నంగా ఉన్నాననే సందేహం ఆడపిల్లలకొస్తుంది. ప్రతి ఒక్కరి శరీరానికి ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఆడపిల్లల్లో ఆయా వయసుకు తగినట్లు శారీరకపరమైన మార్పులెలా వస్తాయో అవగాహన కలిగించాలి. పరిశుభ్రత ప్రాముఖ్యతనూ చెప్పి పాటించేలా చేయాలి. ఇవన్నీ పిల్లల్లో శారీరకంగా ఆరోగ్యాన్నే కాకుండా మానసిక పరిపక్వతనూ పెంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్