కొట్టడమే మార్గమా?

చిన్నారులు చెప్పిన పని చేయకపోతే చాలు.. మనకు కోపం వచ్చేస్తుంది. దీంతో ఓ దెబ్బ వేస్తాం. అప్పుడు భయం కొద్దీ మాట వినేస్తారు. మనమూ శాంతిస్తాం. కానీ, దీనివల్ల పిల్లలు దూరమవుతారంటున్నారు నిపుణులు.

Published : 01 Jul 2024 02:11 IST

చిన్నారులు చెప్పిన పని చేయకపోతే చాలు.. మనకు కోపం వచ్చేస్తుంది. దీంతో ఓ దెబ్బ వేస్తాం. అప్పుడు భయం కొద్దీ మాట వినేస్తారు. మనమూ శాంతిస్తాం. కానీ, దీనివల్ల పిల్లలు దూరమవుతారంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

దెబ్బ కొట్టగానే పిల్లలను బాధించేది దాని తాలూకూ నొప్పికాదు. అమ్మానాన్నలు ప్రేమించరు అన్న భయమే. దీంతో నచ్చకపోయినా ఆ క్షణం మాట వింటారు. అది చూసి  దారికి వచ్చారని మనం అనుకుంటాం. ఇక, ఎప్పుడు కోపం కట్టలు తెంచుకున్నా దండనే దివ్యౌషధం అని భావిస్తాం. కానీ అది ఆ చిన్ని మనసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాంతో వాళ్లు తమ  ఇష్టాలను పక్కనపెట్టి, ఏ పని చేస్తున్నా అమ్మానాన్నలకు నచ్చుతుందా అని ఆలోచిస్తుంటారు. ఇలా చేస్తుంటే క్రమంగా వారిలోని సృజనాత్మకత దెబ్బతింటుంది. సున్నిత మనస్కులుగా తయారవుతారు... ఇది ఒక కోణం. కొందరైతే దెబ్బలు తినీ తినీ వాళ్లల్లో ద్వేషం నిండుతుంది. మనకు నచ్చనిదే చేసి, మన కోపంలో వారు ఆనందాన్ని వెతుక్కుంటారు లేదా మరింత మొండిగా తయారవుతారు. ఇంకొందరైతే వాళ్ల ఆలోచనలు, బాధ, సంతోషం... దేన్నీ తల్లిదండ్రులు  అర్థం చేసుకోరన్న భావనకి వచ్చేస్తారు. దాంతో క్రమంగా మనకు దూరమవుతారు. అలాగని వాళ్లేం చేసినా ఊరుకోవాలా... అంటారా? అక్కర్లేదు... సున్నితంగా మాట్లాడుతూనే సూటిగా చెప్పండి. వాళ్లలా చేయడం వల్ల ఇతరులు ఎలా ఇబ్బంది పడతారో వివరించండి. చాలాసార్లు ఎందుకు చేయకూడదు అనేది వాళ్లకి తెలియదు. మనమూ చెప్పే ప్రయత్నం చేయం. కాబట్టే వద్దన్నా చేస్తారు. చిన్న వయసు, అంతకన్నా సున్నితమైన మనసులు వాళ్లవి. మీరు కొట్టేది ఒక్క దెబ్బే కానీ, మనసుకి పెద్ద గాయమే చేస్తుంది. అందుకే, మనమే కోపాన్ని అదుపు చేసుకుని పరిస్థితికి అనుగుణంగా వారికి నచ్చజెప్పాలి. ప్రయత్నిస్తే మార్పు సాధ్యమే...!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్