‘ఫుడ్‌’ కోమాలోకి వెళ్తున్నామా..!

మధ్యాహ్న భోజనం చేసి వస్తామా... ఏదో అలసట, అసౌకర్యం. కాసేపు అలా ఉండీ ఉండగానే నిద్రమత్తూ ఆవహించేస్తుంది. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? అయితే, మీరు ‘‘ఫుడ్‌ కోమా’’లోకి వెళ్తున్నట్లే. ఇందుకు కారణమేంటో తెలుసా?

Published : 24 Jun 2024 02:02 IST

మధ్యాహ్న భోజనం చేసి వస్తామా... ఏదో అలసట, అసౌకర్యం. కాసేపు అలా ఉండీ ఉండగానే నిద్రమత్తూ ఆవహించేస్తుంది. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? అయితే, మీరు ‘‘ఫుడ్‌ కోమా’’లోకి వెళ్తున్నట్లే. ఇందుకు కారణమేంటో తెలుసా?

సాధారణంగా మనం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మళ్లీ రాత్రికి చపాతీ లేదా రైస్‌ లాంటివి తింటుంటాం కదా! అందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లాంటివి అధికంగా ఉండడమే ఈ ఫుడ్‌కోమా కండిషన్‌కి కారణమట. ఆ సమయంలో మన శరీరమేమో తిన్న ఆహారాన్ని జీర్ణంచేసే పనిలో పడుతుంది. తద్వారా రక్తప్రవాహం జీర్ణవ్యవస్థవైపు మళ్లి... మెదడుకేమో రక్తప్రసరణ తగ్గుతుందట. అంతేకాదు, తిన్న వెంటనే బ్లడ్‌ షుగర్‌ స్థాయులను మేనేజ్‌ చేయడానికి శరీరం ఇన్సులిన్‌ను విడుదలచేస్తుంది కదా! ఈ ఇన్సులిన్‌ మెదడులో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది సెరటోనిన్, మెలటోనిన్‌ అనే హార్మోనులను ఎక్కువ మోతాదులో విడుదల చేసి, మనకు నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే, ఇంకొంచెం తిందాం అనిపించినప్పుడే ఆపేయడం మంచిది. దాంతోపాటు సమతులాహారం తీసుకోవడం మరీ ముఖ్యం. అప్పుడే మనం మెలకువతోనూ, యాక్టివ్‌గానూ ఉండగలుగుతాం.

తిన్నతర్వాతే ఎందుకు?

ప్రధానంగా ఈ పరిస్థితి తిన్నతర్వాత, అందులోనూ మధ్యాహ్న సమయంలో ఎక్కువగా వస్తుంటుంది. అందుకు కారణం... మన సంప్రదాయ ఆహారంలో ప్రధానంగా ఉండేది కార్బోహైడ్రేట్లే కాబట్టి. దీన్ని తగ్గించుకోవడానికి నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే...

  • కొంచెం కొంచెం ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. దాని వల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్‌ స్థాయులు పెరగకుండా ఉంటాయి.
  • ఏదో ఒకటి వేళకు కొంచెం తింటే సరిపోతుందిగా... అన్న ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు పోషకాహారం తీసుకోరు. అలాకాకుండా ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులూ, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లూ లాంటి అన్ని పోషకాలూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే అవి శరీరంలో గ్లూకోజు స్థాయులను స్థిరంగా ఉంచుతాయి. దాంతోపాటు ఎక్కువసేపు శక్తి కోల్పోకుండా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు అందించడమూ అవసరమే.  
  • కొంతమంది అమ్మాయిలు సమయం లేదంటూ తిన్న వెంటనే పనిలో పడిపోతారు. కానీ లంచ్‌ తర్వాత కాస్తదూరం నడిస్తే ఆ బద్ధకం దూరమవుతుందట.
  • ఫుడ్‌కోమా నుంచి తప్పించుకోవాలంటే సాధారణ రొటీన్‌ను పాటించడంతోపాటు భోజనానికీ, భోజనానికీ మధ్యలో గ్యాప్‌ ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే.

ఇవీ చూసుకోండి....

  • అసలే అమ్మాయిలు చాక్లెట్స్, కేక్స్‌ లాంటివి ఇష్టపడుతుంటారు. కానీ, వాటివల్ల చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయట. అందుకే సింపుల్‌ షుగర్స్, పిండిపదార్థాలు అధికంగా ఉండే వైట్‌ బ్రెడ్, పేస్ట్రీస్‌ లాంటివి ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారో గమనించుకోండి.  
  • కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటున్నారేమో పరిశీలించుకోండి. తక్కువ మొత్తం ఎక్కువసార్లు తినండి. ఎందుకంటే, అప్పుడప్పుడూ ఈ సమస్య కనిపిస్తే పర్వాలేదు కానీ, తరచూ వేధిస్తోంటే దీర్ఘకాలంలో అధికబరువు, టైప్‌2 డయాబెటిస్, హృద్రోగాలూ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్