Exercises: అతి చేయొద్దు సుమీ!

వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా, దృఢంగా మారతామని తెలుసు. అయితే అతి దేనికైనా అనర్థమే. దీన్ని గుర్తించక కొందరు... మితిమీరి కసరత్తులు చేస్తుంటారు. అవసరానికంటే ఎక్కువగా శ్రమపడి పోతుంటారు. మరి ఆ విషయాన్ని ఎలా గుర్తించాలి అంటారా?

Updated : 02 Jul 2023 08:13 IST

వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా, దృఢంగా మారతామని తెలుసు. అయితే అతి దేనికైనా అనర్థమే. దీన్ని గుర్తించక కొందరు... మితిమీరి కసరత్తులు చేస్తుంటారు. అవసరానికంటే ఎక్కువగా శ్రమపడి పోతుంటారు. మరి ఆ విషయాన్ని ఎలా గుర్తించాలి అంటారా?

రోజూ గంటలు గంటలు వ్యాయామం చేసి...ఆ తర్వాత నిస్సత్తువతో మంచానికో, కుర్చీకో పరిమితం అవుతున్నారా? ఏ చిన్న పని చేయాలన్నా కండరాల నొప్పులూ... ఇతరత్రా నిరాసక్తతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ వ్యాయామ ప్రణాళికను సరిచూసుకోండి.

సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, నడక, పరుగు వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు చేస్తున్నప్పుడు.. ఆ కాసేపు ఆయాసంగా అనిపించినా వెంటనే ఉత్సాహం వచ్చేస్తుంది. చెమట పట్టిన శరీరం గాలిలో తేలిపోతున్నట్టు తేలిగ్గా అనిపిస్తుంది. అలాకాకుండా మీ శరీరం మీకు భారంగా అనిపిస్తోందా? అయితే మీరు అవసరానికి మించి శ్రమ పడుతున్నారనే అర్థం. ఇలాంటప్పుడు ముందు మరింత ఎక్కువ ప్రొటీన్‌ ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికీ సమస్య అదుపులోకి రాకపోతే.... మీ వ్యాయామ సమయాన్ని కుదించుకోవాల్సిందే.

సాధారణంగా వ్యాయామాల వల్ల ఉత్పత్తయ్యే ఎండార్ఫిన్స్‌ మనసుని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూస్తాయి. అలాకాకుండా అకారణంగా ఏదో ఆందోళనా, వ్యాకులతా, ఒత్తిడీ వంటి సమస్యలు కనిపిస్తే.. మీ వ్యాయామ  తీరుని సమీక్షించుకోండి.

మీ శరీరానికి సరిపోయే వ్యాయామం గాఢమైన నిద్రనిస్తుంది. కానీ అతి వ్యాయామం వల్ల కలత నిద్రే మిగులుతుంది. శరీరం నుంచి చెమట రూపంలో అతిగా గ్లూకోజ్‌ పోవడమూ కారణమే!

అకస్మాత్తుగా మూత్రం రంగు కాస్త ఎర్రగా మారినట్టు అనిపిస్తోందా? ఇందుకూ మీరు గంటల తరబడి చేసే కసరత్తులే కారణం కావొచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి డీహైడ్రేషన్‌ సమస్యకు దారి తీయొచ్చు. లేదంటే అంతర్గత రక్తస్రావాలూ జరగొచ్చు. ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదించడమే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్