పీసీఓఎస్‌ ఉన్న వారు సీతాఫలం తినచ్చా?

సీతాఫలం.. ఈ మధుర ఫలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. సీతాఫలంలో ఉండే ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి.

Published : 09 Dec 2023 12:13 IST

సీతాఫలం.. ఈ మధుర ఫలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. సీతాఫలంలో ఉండే ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. అయితే దీనికి సంబంధించి కొంతమందిలో కొన్ని అపోహలు-సందేహాలు నెలకొన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు సీతాఫలం తినకూడదు!

ఇది ఓ రకంగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పండులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. ఇక ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆకలేయకుండా, చిరుతిండ్ల జోలికి పోకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా క్రమంగా బరువు తగ్గచ్చు. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు.. వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

గుండె జబ్బులున్న వారికి ఈ పండు మంచిది కాదు..

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి మెగ్నీషియం నిండి ఉన్న సీతాఫలం ఆ సమస్యను నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే ఇతర ఖనిజాలు, విటమిన్‌ ‘సి’ రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

పీసీఓఎస్‌ ఉన్న వారు ఈ పండ్లు తినకూడదు..

పీసీఓఎస్‌ ఉన్న వారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్‌ స్వింగ్స్‌, చికాకు.. వంటివి సర్వసాధారణం. అయితే వీటన్నింటికీ ఐరన్ విరుగుడుగా పనిచేస్తుంది. సీతాఫలంలో అది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి పీసీఓఎస్‌ ఉన్న వారూ ఈ పండు తీసుకోవడం మంచిది. అలాగే ఇది సంతాన సాఫల్యతను సైతం పెంచుతుంది. ఈ పండులోని ఫైబర్‌ - గర్భిణుల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు - వికారం, వాంతులు.. వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

అయితే సీతాఫలం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది కదా అని ఎక్కువగా తినడం కూడా శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. అలాగే వివిధ రకాల అనారోగ్యాలున్న వారు ఈ పండు మోతాదు విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవడం మరీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్