శరన్నవరాత్రుల్లో ఉపవాసం.. ఇలా!

నవరాత్రుల వంటి ప్రత్యేక పర్వదినాల్లో చాలామంది ఉపవాసానికి ఉపక్రమిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. నిజానికి ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు.

Published : 15 Oct 2023 12:40 IST

నవరాత్రుల వంటి ప్రత్యేక పర్వదినాల్లో చాలామంది ఉపవాసానికి ఉపక్రమిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. నిజానికి ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు. నిర్ణీత వ్యవధుల్లో సాత్వికాహారం తీసుకుంటూ అటు శరీరానికి శక్తిని అందిస్తూనే, ఇటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని కొలిచే అతివలు ఆరోగ్యానికి లోటు లేకుండా, ఉత్సాహం తగ్గకుండా ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

రోజును ఇలా ప్రారంభించండి!

కొంతమందైతే రోజంతా నోట్లో పచ్చి మంచినీళ్లైనా పోయకుండా ఉపవాసం చేస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ముందుగా మనం లేవగానే మన శరీరంలోని మలినాలను బయటికి పంపించాలి.. అప్పుడే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. అలాగే జీవక్రియలూ చురుగ్గా మారతాయి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పటికీ ఉదయం లేవగానే నిమ్మరసం కలిపిన గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఆపై ఏదైనా హెర్బల్‌ టీ (పుదీనా ఆకులు, అల్లం, తులసి ఆకులు, మిరియాలు, లవంగాలు, సోంపు, జీలకర్ర.. వంటి పదార్థాలతో తయారుచేసుకోవచ్చు) తీసుకోవాలి. ఇక దీని తర్వాత నానబెట్టిన నట్స్‌, గింజలు లేదంటే ఏదైనా పండు తినచ్చు.

శారీరక శక్తి కోసం..!

ఉపవాసం పేరుతో రోజంతా తినకుండా ఉంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పడిపోతాయి. కాబట్టి ఉపవాసం ఉన్నా పూర్తిగా కడుపు మాడ్చుకోవడం అస్సలు కరక్ట్ కాదు. నిర్ణీత వ్యవధుల్లో పండ్లు తీసుకోవాలి. ఇక మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎలాగూ ఉపవాసం కదా.. అన్నం తినడం లేదు కదా అని స్వీట్లు, డీప్‌ ఫ్రై చేసిన స్నాక్స్‌.. అస్సలు తీసుకోవద్దు.

వాటికి ప్రత్యామ్నాయంగా..!

ఉపవాసం సమయంలో చాలామంది మహిళలు అన్నానికి బదులుగా గోధుమ పిండి, బియ్యప్పిండితో చపాతీలు, ఇతర పిండి వంటలు చేసుకొని తీసుకుంటుంటారు. కానీ ఈ సమయంలో వీటికి బదులుగా రాజ్‌గిరా, బక్‌వీట్‌, వాటర్‌ చెస్ట్‌ నట్స్‌.. వంటి పదార్థాలతో తయారుచేసిన పిండి (ఇవన్నీ సూపర్‌ మార్కెట్స్‌లో దొరుకుతాయి)ని ఉపయోగించాలి. తద్వారా ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. ఇతర పదార్థాల పైకి మనసు మళ్లదు..!

మంచి కొవ్వులే మేలు!

ఇక ఉపవాసం సమయంలో చాలామంది పాలు, మజ్జిగ.. వంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కొవ్వులు అధికంగా ఉండేవి కాకుండా.. కొవ్వు తొలగించినవి లేదంటే తక్కువ కొవ్వులున్న పాలు, మజ్జిగ.. వంటివి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే మంచి కొవ్వులు పుష్కలంగా లభించే (ఉదాహరణకు.. అవకాడో, అవిసె గింజలు, నట్స్‌..) పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది.. వాటిలోని పీచు పదార్థం ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది.. అలాగే జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపకరిస్తుంది.

నీటి స్థాయులు తగ్గకుండా!

శరీరంలో నీటి శాతం తగ్గిపోయినా నీరసించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపవాసం సమయంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండాలంటే నీళ్లు తాగడం, మధ్యమధ్యలో మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, నిమ్మరసం-తేనె కలిపిన నీళ్లు తీసుకోవడం మంచిది. వీటితో పాటు కీరా, టొమాటో.. వంటి కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా కాపాడుకోవచ్చు. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడంతో పాటు ఇతర అవయవాల పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.

వీరికి ఉపవాసం వద్దు...

వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భం ధరించిన మహిళలు ఈ పండగ సమయంలో ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఉపవాసం వల్ల సరైన సమయానికి ఆహారం అందక.. వారికి రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయే అవకాశం ఉంది. తద్వారా లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఉపవాసం జోలికి పోకుండా కడుపునిండా పోషకాహారం తీసుకోవడంతో పాటు నిపుణులు చెప్పినట్లుగా ఆరోగ్యవంతమైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ దసరా శరన్నవరాత్రుల్ని ఆనందంగా, ఉత్సాహంగా గడపచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్