పీసీఓఎస్ ఉన్నా పిల్లలు పుట్టాలంటే..!

సంతానలేమి సమస్యల్లో పీసీఓఎస్‌ ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఏడుగురిలో ఒకరు దీని బారిన పడుతున్నారని, సుమారు 50 శాతం మంది తమకు పీసీఓఎస్‌ ఉందన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

Published : 22 Nov 2023 11:53 IST

సంతానలేమి సమస్యల్లో పీసీఓఎస్‌ ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఏడుగురిలో ఒకరు దీని బారిన పడుతున్నారని, సుమారు 50 శాతం మంది తమకు పీసీఓఎస్‌ ఉందన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మరి, పీసీఓఎస్‌ వస్తే పిల్లలు పుట్టరా? అంటే.. ఆ భయం అక్కర్లేదంటున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక సమస్యే అయినా దీన్ని అదుపులో ఉంచుకొని జీవన విధానంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేసుకుంటే.. ఈ సమస్య ఉన్నప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

బరువు తగ్గాల్సిందే!

పీసీఓఎస్‌ కారణంగా మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుంది. తద్వారా గర్భం ధరించే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతాయి. కాబట్టి ముందుగా బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీ బీఎంఐ ఎంత ఉందో చెక్‌ చేసుకోవాలి. సాధారణం కంటే ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ముందుగా బరువు తగ్గాకే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ఇటు మీ ఆరోగ్యం, అటు కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడచ్చంటున్నారు. ఇలా మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు వ్యాయామాలను మీ రొటీన్‌లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు కనీసం అరగంటైనా ఇందుకు సమయం కేటాయించాలి. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని ఓసారి వైద్యుల వద్ద చెక్‌ చేయించుకొని ఏయే వ్యాయామాలు చేయచ్చన్న విషయంలో వారి సలహా తీసుకుంటే మరీ మంచిది.

ఆ సమయం తెలుసుకొని..!

నెలనెలా వచ్చే నెలసరి పదే పదే క్రమం తప్పుతోందంటే అందుకు పీసీఓఎస్‌ కూడా ఓ కారణమై ఉండచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ అదే నిర్ధారణ అయితే మాత్రం నెలసరి సక్రమంగా వచ్చేలా చేసుకోవడం తప్పనిసరి.. లేదంటే గర్భధారణ కష్టమవుతుంది. అయితే పీసీఓఎస్‌ కారణంగా పెరిగిన బరువు తగ్గే క్రమంలోనూ ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య తగ్గడంతో పాటు, ఇది అండోత్పత్తి సరైన సమయంలో జరగడానికి సైతం దోహదం చేస్తుంది. తద్వారా ఆ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే అండోత్పత్తి సమయం తెలుసుకోవడానికి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో క్యాలిక్యులేటర్స్‌, యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. లేదంటే ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చు.

ఇన్సులిన్‌ అదుపులో ఇలా..!

పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో సాధారణ వ్యక్తుల కంటే ఇన్సులిన్‌ స్థాయులు అధికంగా ఉంటాయి. ఇందుకు కారణం ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులే! తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మధుమేహానికి దారితీసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి పీసీఓస్‌ ఉన్న వారు గర్భం ధరించడానికి ముందు తమ శరీరంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా లభించే గుడ్లు, బాదంపప్పులు, ఓట్స్‌, పాలు, పాల పదార్థాలు, చికెన్‌.. వంటివి రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, వైట్‌ బ్రెడ్‌.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలా ఆహార నియమాలతో పాటు నిపుణుల సలహా మేరకు చేసే కొన్ని వ్యాయామాలు సైతం మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

‘డి’ లోపం లేకుండా!

పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో దాదాపు 41 శాతం మందిలో విటమిన్‌ ‘డి’ లోపం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇది సంతానలేమికి దారితీస్తుంది. కాబట్టి మన శరీరంలో ఈ విటమిన్‌ స్థాయులు తగినంతగా ఉండాలి. ఇందుకోసం రోజూ కాసేపు నీరెండలో నిల్చోవడం; మాంసం, గుడ్లు, చేపలు.. వంటి విటమిన్‌ ‘డి’ అధికంగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది. ఇలా తగినంత విటమిన్‌ ‘డి’ శరీరానికి అందడం వల్ల అది అండం ఆరోగ్యంగా ఎదగడంలో, అభివృద్ధి చెందడంలో సహకరిస్తుందట! ఒకవేళ మీ శరీరంలో విటమిన్‌ ‘డి’ స్థాయులు మరీ తక్కువగా ఉన్నట్లయితే మాత్రం వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడడం తప్పనిసరి.

ఇలా వీటన్నింటితో పాటు ఒత్తిడికి గురికాకుండా యోగా, ధ్యానం చేయడం; జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌.. వంటి అనారోగ్యపూరిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల కూడా పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవచ్చు.. తద్వారా గర్భం ధరించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వచ్చు. అమ్మతనాన్ని ఆస్వాదించచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్