భాగస్వామికి ఆ భరోసా ఇవ్వండి.. చాలు!

దాంపత్య బంధాన్ని దృఢం చేసే అంశాలు బోలెడుంటాయి. అందులో ఒకరికొకరు సురక్షితమైన భావన కల్పించుకోవడం కూడా ఒకటి. అంటే.. ఒకరి సాంగత్యంలో మరొకరున్నప్పుడు.. ప్రపంచమంతా ఎదురుతిరిగినా.. తనపై ఈగ కూడా వాలనివ్వనంతగా భాగస్వామి తనను భద్రంగా చూసుకుంటాడన్న భరోసా!

Published : 24 Jun 2024 12:00 IST

దాంపత్య బంధాన్ని దృఢం చేసే అంశాలు బోలెడుంటాయి. అందులో ఒకరికొకరు సురక్షితమైన భావన కల్పించుకోవడం కూడా ఒకటి. అంటే.. ఒకరి సాంగత్యంలో మరొకరున్నప్పుడు.. ప్రపంచమంతా ఎదురుతిరిగినా.. తనపై ఈగ కూడా వాలనివ్వనంతగా భాగస్వామి తనను భద్రంగా చూసుకుంటాడన్న భరోసా! అయితే ఆలుమగలిద్దరికీ ఏళ్లు గడిచే కొద్దీ ఈ భావన దానంతటదే అలవడుతుందనుకుంటారు చాలామంది. కానీ దీనికి అనుభవం కంటే భాగస్వామి ఆప్యాయత, ప్రేమ ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఈ రోజుల్లో చాలా జంటలు ప్రేమ కంటే స్టేటస్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో స్వార్థం, అహంకారం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం.. వంటివి ఇద్దరి మనసుల్లో పెరిగిపోతున్నాయి. ‘నేను గొప్పంటే.. నేను గొప్ప’ అనే భావన ఏర్పడుతుంది. నిజానికి ఇలాంటి పోటీ అనుబంధాన్ని దెబ్బతీయడమే కాదు.. వైవాహిక బంధంలో అభద్రతకూ దారి తీస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఈ ప్రతికూల భావనను మనసులో నుంచి తొలగించి.. ఇద్దరూ సానుకూలంగా, ‘తనతో ఉంటే నేను సురక్షితం’ అనే భావన కలిగేలా చేయాలంటే దంపతులిద్దరూ కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

భద్రతను పెంచుతాయివి!

⚛ దంపతులిద్దరి మనసులు కలిసినా.. వారి ఆలోచనలు, అభిరుచులు ఒకేలా ఉండాలని లేదు. అలాగని వారి అభిప్రాయం మీకు నచ్చకపోతే వ్యతిరేకించడమూ సరికాదు. కాదు, కూడదని పట్టుబడితే లేనిపోని గొడవలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే అప్పుడప్పుడూ భాగస్వామి మనసు తెలుసుకొని మసలుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వారి నిర్ణయాలను గౌరవించడం, పొరపాట్లుంటే సరిదిద్దడం వల్ల.. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. తద్వారా వారితో ఉంటే సురక్షితమైన భావన కూడా కలుగుతుంది.

⚛ అనుబంధంలో ప్రశంసలదీ కీలక పాత్రే! ఓరోజు వంట బాగా చేయచ్చు.. మరో రోజు చక్కగా ముస్తాబవ్వచ్చు.. ఇంకో రోజు ఏదైనా మంచి పని చేయచ్చు.. వీటిని ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా.. భాగస్వామి శెభాష్‌ అంటే చాలనుకుంటారు చాలామంది. అందుకే వాళ్లు ఎదురుచూసే దాకా మీ ఫీలింగ్‌ని మీలోనే దాచుకోకుండా.. సందర్భానుసారం ఓ కాంప్లిమెంట్‌ ఇచ్చేయండి. వాళ్లూ సంతృప్తి పడతారు.. ఇద్దరి మధ్య బంధమూ దృఢమవుతుంది.

⚛ దంపతులిద్దరిలో ఒకరిపై మరొకరికి సురక్షితమైన భావన కలగాలంటే.. ముందు ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడాలి. ఈ క్రమంలో ప్రతి విషయంలోనూ ఇద్దరూ పారదర్శకంగా ఉండాలి. అది చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా, సరదా సంగతైనా, రొమాంటిక్‌ కోరికైనా దాపరికం లేకుండా పంచుకోవాలి.

⚛ శృంగారం అనుబంధాన్నే కాదు.. దంపతుల మధ్య సురక్షితమైన భావాన్నీ పెంచుతుంది. అయితే చాలామంది పలు కారణాల రీత్యా దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరిగి.. వారి మనసుల్లో ఒక రకమైన అభద్రత ఏర్పడుతుంది. దీన్ని దరిచేరనివ్వకుండా జాగ్రత్తపడాలంటే.. ఇద్దరూ సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం, కొన్ని సందర్భాల్లో పరస్పరం సర్దుకుపోవడం.. వంటివీ ముఖ్యమంటున్నారు నిపుణులు.

⚛ భాగస్వామితో ఎన్నో విషయాలు పంచుకోవాలనుకుంటారు చాలామంది. కానీ అవతలి వాళ్లు ఇందుకు ఆసక్తి చూపకపోవడం, వారిది సమస్యే కాదంటూ చిన్నబుచ్చడం, వినకపోయినా విన్నట్లు నటించడం.. ఇవన్నీ భాగస్వామికి మీపై ఉన్న నమ్మకాన్ని, ప్రేమను దూరం చేసేవే! కాబట్టి అనుబంధంలో ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పడం ఎంత ముఖ్యమో.. అవతలి వారు చెప్పేది వినడం, తగిన సలహాలివ్వడమూ అంతే ముఖ్యం.

⚛ చేసే పనికి భాగస్వామి మద్దతు, ప్రోత్సాహం కోరుకుంటారు చాలామంది. కానీ కొంతమంది ప్రోత్సహించడం అటుంచితే.. నిరాశపరుస్తుంటారు. అనుబంధంలో అభద్రతకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే ఒకరి లక్ష్యాలు, ఆశయాల్ని సాధించే క్రమంలో మరొకరు ప్రోత్సహించడం, సహాయపడడం.. చేస్తే ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.. ‘నా వెంట ఒకరున్నార’న్న భరోసా వారికి ఏర్పడుతుంది.

⚛ వైవాహిక బంధమంటే భార్యాభర్తలిద్దరే కాదు.. ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం! కాబట్టి దంపతులిద్దరూ తమ పుట్టింటి వారిని ఎంత ప్రేమగా చూసుకుంటారో.. అత్తింటి వారికీ సమానమైన గౌరవమర్యాదలివ్వాలి. అలాగే వాళ్లూ ఈ జంటకు ప్రేమాభిమానాల్ని అందించాలి. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలున్న కుటుంబాల్లో ఒకరిపై ఒకరికి సురక్షితమైన భావన, భరోసా.. రెండూ ఏర్పడతాయంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్