అమ్మయ్యాక.. అందంగా.. ఇలా!

అమ్మతనం మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ దశలో అటు శారీరకంగానే కాదు.. ఇటు సౌందర్యపరంగానూ పలు మార్పులు రావడం గమనించచ్చు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు-మచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్‌-స్ట్రెచ్‌ మార్క్స్, విపరీతంగా జుట్టు రాలిపోవడం.. ఇలా కొత్తగా తల్లైన వారు అందం పరంగా వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంటారు.

Published : 21 Jun 2024 15:59 IST

అమ్మతనం మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ దశలో అటు శారీరకంగానే కాదు.. ఇటు సౌందర్యపరంగానూ పలు మార్పులు రావడం గమనించచ్చు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు-మచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్‌-స్ట్రెచ్‌ మార్క్స్, విపరీతంగా జుట్టు రాలిపోవడం.. ఇలా కొత్తగా తల్లైన వారు అందం పరంగా వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. బిడ్డ పుట్టాక తల్లుల శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయులు ఒక్కసారిగా పడిపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. అలాగని ఈ సమస్యల్ని పరిష్కరించుకోలేమా అంటే.. అందుకు చిన్న చిన్న చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి...

ఎలాంటి సమస్యలొస్తాయంటే..?!

గర్భిణిగా ఉన్న సమయంలో హార్మోన్ల స్థాయుల్లో పెరుగుదల కారణంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. అదే డెలివరీ తర్వాత హార్మోన్ల స్థాయులు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం/తగ్గుదల వల్ల జుట్టు రాలడం అధికమవుతుంది. అయితే ఇది తాత్కాలికమే అని.. మహా అయితే 6-12 నెలల పాటు ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చంటున్నారు.

ప్రసవం తర్వాత హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, అలసట.. వంటివన్నీ ముఖంపై మొటిమలు రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా ఈ దశలో ప్రొజెస్టరాన్ హార్మోన్‌ స్థాయుల్లో వచ్చే మార్పుల వల్ల సెబేషియస్ గ్రంథులు ఎక్కువ నూనెల్ని విడుదల చేస్తాయి. తద్వారా ముఖంపై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఏర్పడుతుంటాయి.

ప్రసవం తర్వాత సౌందర్యపరంగా వచ్చే మరో సమస్య పిగ్మెంటేషన్‌/మెలస్మా. ఈ క్రమంలో చర్మంపై నల్లటి ప్యాచుల్లాంటి మచ్చలు ఏర్పడడం గమనించచ్చు.

ఇక బిడ్డ పుట్టాక నిద్రలేమి, హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, విపరీతమైన అలసట.. వంటివన్నీ కళ్లు ఉబ్బడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం.. వంటి సమస్యలకు దారితీస్తాయి.

గర్భం ధరించిన సమయంలో నెలలు నిండుతున్న కొద్దీ క్రమంగా బరువు పెరుగుతాం. ఇందులో భాగంగా రొమ్ములు, పొట్ట, పిరుదులు.. తదితర శరీర భాగాల్లో పెరుగుదల కనిపించడం సహజమే! ఈ క్రమంలో చర్మం సాగి స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడుతుంటాయి. అయితే డెలివరీ తర్వాత ఈ భాగాలన్నీ ఒక్కసారిగా తిరిగి సాధారణ స్థితికి రావడంతో అక్కడి చర్మం వదులుగా మారుతుంది. దాంతో చాలామంది మహిళలు ఆత్మన్యూనతకు గురవుతుంటారు.


ఈ చిట్కాలతో తిరిగి అందంగా.. !

అయితే ఈ సమస్యలన్నీ కొత్తగా తల్లైన మహిళల్లో సాధారణంగా తలెత్తేవేనని, అలాగని బాధపడిపోకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రసవానంతరం తిరిగి సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

చర్మం మెరిసిపోతుందిలా!

ప్రసవానంతరం ఎదురయ్యే మొటిమల సమస్యను దూరం చేసుకోవాలంటే రోజుకు రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇక ఇలాంటి వారు ఉపయోగించే ఫేస్‌ప్యాక్స్‌లో కలబంద, యూకలిప్టస్‌ ఆయిల్‌.. వంటి పదార్థాలను చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు.. బయటికి వెళ్లేటప్పుడు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం తప్పనిసరి.. అది కూడా ఆయిల్‌ రహితమైనదై ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

పిగ్మెంటేషన్ సమస్యను తొలగించుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యేకమైన మాయిశ్చరైజర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడితే సరి. అలాగే పసుపు-నిమ్మరసం, కలబంద గుజ్జు, బంగాళాదుంప, కమలాఫలం తొక్కల పొడి.. వంటివి మీరు వాడే ఫేస్‌ప్యాక్స్‌లో చేర్చుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది.

ఇక కంటి అలసటను, కళ్ల కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవడానికి సమయం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడం ఒక్కటే మార్గం. ఈ క్రమంలో పాపాయి పడుకున్నప్పుడే మీరూ నిద్రకు ఉపక్రమించేలా చూసుకోండి. అలాగే నిపుణుల సలహా మేరకు ఐ క్రీమ్‌ని కూడా వాడచ్చు.

స్ట్రెచ్‌మార్క్స్‌ రాకుండా గర్భం ధరించిన సమయం నుంచే మహిళలు జాగ్రత్తపడుతుంటారు. ఈ క్రమంలో నిపుణులు సూచించిన ఆయిల్స్‌, క్రీమ్స్‌.. వంటివి వాడుతుంటారు. అయితే ప్రసవానంతరం ఒకవేళ స్ట్రెచ్‌మార్క్స్‌ సమస్య తలెత్తినా ఇవే చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేం కానీ.. క్రీమ్స్‌/ఆయిల్స్‌తో పాటు చక్కటి పోషకాహారం, బ్రిస్క్‌ వాక్‌ - యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు.. ఈ మార్క్స్‌ని తొలగించడంలో కొంతవరకు సహాయపడచ్చని చెబుతున్నారు.

ఇక ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్‌తో వారానికోసారి చర్మాన్ని మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల కూడా ప్రసవానంతర సౌందర్యాన్ని తిరిగి పొందచ్చు. ఇలా చేయడం వల్ల పొలుసులుగా మారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.. మొటిమలు-మచ్చలు.. వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్