Adoption: పిల్లల్ని దత్తత తీసుకున్నారా?

పిల్లలు పుట్టకపోవడం వల్లో, లేదంటే సమాజ స్పృహతోనో చిన్నారుల్ని దత్తత తీసుకోవడం సహజమే! ఇందులోనూ తమ ఆలోచనలకు అనుగుణంగా పసి పిల్లల్ని, కాస్త పెద్ద పిల్లల్ని ఎంచుకుంటుంటారు. అయితే ఈ పద్ధతి దంపతులకు పిల్లలు లేని లోటు, అటు వారికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చినప్పటికీ.. ఇద్దరి మధ్య అనుబంధం విషయంలో కాస్త గ్యాప్‌ ఉండడం కామన్‌.

Published : 02 Jul 2024 11:58 IST

పిల్లలు పుట్టకపోవడం వల్లో, లేదంటే సమాజ స్పృహతోనో చిన్నారుల్ని దత్తత తీసుకోవడం సహజమే! ఇందులోనూ తమ ఆలోచనలకు అనుగుణంగా పసి పిల్లల్ని, కాస్త పెద్ద పిల్లల్ని ఎంచుకుంటుంటారు. అయితే ఈ పద్ధతి దంపతులకు పిల్లలు లేని లోటు, అటు వారికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చినప్పటికీ.. ఇద్దరి మధ్య అనుబంధం విషయంలో కాస్త గ్యాప్‌ ఉండడం కామన్‌. మరి, దీన్ని తొలగించుకొని పెంచిన పిల్లల్నీ కడుపున పుట్టిన వారితో సమానంగా, ప్రేమగా చూసుకోవాలంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

టైమ్‌ సెట్‌ చేస్తున్నారా?

దత్తత తీసుకున్నది మరీ పసి పిల్లల్నైతే.. అప్పటికి వారికి ఊహ తెలియదు కాబట్టి మన పిల్లల్లాగే పెంచచ్చు. అదే కాస్త పెద్ద పిల్లలైతే మనతో మమేకమవడానికి కొన్నాళ్లు సమయం పట్టచ్చు. ఈ క్రమంలో తల్లిగా వారికంటూ రోజువారీ సమయపాలన సెట్‌ చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇన్నాళ్లూ వేరే చోట పెరగడం వల్ల ఇది కొరవడి ఉండచ్చు.. లేదంటే మీ సమయాలకు వారి గత టైమ్‌ టేబుల్‌ సెట్‌ కాకపోవచ్చు. అందుకే మీకు అనుగుణంగా, వారికి సౌకర్యవంతంగా ఉండేలా చక్కటి ప్రణాళిక రూపొందించే బాధ్యత తల్లిదండ్రులదే! నిద్ర లేవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా, చదువు-ఇతర పనుల కోసం, ఆహారం తీసుకునే సమయాలు.. ఇలా ప్రతి దినచర్యకు అందులో చోటివ్వాలి. ఇలా రూపొందించి, రోజూ వారితో పాటింపజేయడం వల్ల వాళ్ల విషయంలో మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో వాళ్లకు అర్థమవుతుంది. ఈ నమ్మకమే ఇద్దరినీ దగ్గర చేస్తుంది.

కల్పించుకోనివ్వండి!

ఏ అనుబంధానికైనా కమ్యూనికేషనే వారధి. ఒకరితో ఒకరు ఎంత ఎక్కువ సమయం గడిపితే బంధాలు అంత దృఢమవుతాయి. దత్తత తీసుకున్న పిల్లల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కాబట్టి మీరెంత బిజీగా ఉన్నా సరే.. వీలు కుదుర్చుకొని మరీ వారికంటూ కాస్త సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో వారి ఇష్టాయిష్టాలు, అభిరుచులు అడిగి తెలుసుకోండి. అలాగే ఇదివరకే స్కూలుకెళ్లే పిల్లలైతే పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో కనుక్కోండి. ఆ దిశగానే వారిని ప్రోత్సహించండి. అంతేకాదు.. మీ కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడో లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చర్చించుకుంటున్నప్పుడో వాళ్లు కల్పించుకుంటే వారించడం కాకుండా.. వాళ్ల మనసులోని భావాలు పంచుకోనివ్వాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి, మీ ఇంటి సంప్రదాయాల గురించి వారికి వివరించాలి. ఇలా ప్రతి విషయంలో వారిని ఎంతగా ఇన్వాల్వ్‌ చేస్తే అంత త్వరగా ఇంట్లో ఇమిడిపోతారు.

వాళ్ల ప్రస్తావన వద్దు!

దత్తత తీసుకున్న పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా.. ఒక్కోసారి ఇతర ఒత్తిళ్ల రీత్యానో, లేదంటే వాళ్లు మారట్లేదనో ఓపిక నశించి వారిపై కోపగించుకునే వారూ లేకపోలేదు. ఈ క్రమంలో వాళ్ల గత చరిత్ర, కన్న తల్లిదండ్రుల గురించి నోరు జారినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇది ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాళ్ల గత చరిత్ర గురించి వాళ్లకు తెలియచ్చు.. తెలియకపోవచ్చు. మరికొంతమంది పిల్లల విషయంలో గతంలో చేదు జ్ఞాపకాలుండచ్చు. వీటి గురించి ప్రస్తావించడం వల్ల వాళ్లు మరింత బాధపడే ఆస్కారం ఉంటుంది. పైగా మీ ప్రవర్తన వారిలో అభద్రతా భావానికి, ఆత్మన్యూనతకు దారితీయచ్చు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేయడానికి బదులు మరింత దూరం చేస్తుంది. కాబట్టి ఈ చిన్నారులతో ఎంత సున్నితంగా మెలిగితే అంత మంచిది.

ఎక్కడికెళ్లినా మీతో పాటే..!

దత్తత తీసుకోవడం వరకు ఎలా ఉన్నా.. వారిని నలుగురిలోకి తీసుకెళ్లడానికి కొందరు పేరెంట్స్‌ వెనకడుగు వేస్తుంటారు. ఇతరులు ఏమనుకుంటారోనని భయపడుతుంటారు. నిజానికి దత్తత తీసుకోవడం అనేది చాలామంచి విషయం, అది సామాజిక స్పృహను ప్రతిబింబిస్తుంది అంటున్నారు నిపుణులు. పైగా ఇలా మీతో పాటు షాపింగ్స్‌, పార్టీలు, బంధువుల ఫంక్షన్లకు వారిని తీసుకెళ్లడం వల్ల మీ కుటుంబం, బంధుగణం వారికి పరిచయమవుతుంది. దీనివల్ల వారి మనసులో ఒక రకమైన భరోసా ఏర్పడుతుంది. ఇదే మీకు వారిని దగ్గర చేస్తుంది.

వారితో సమానంగా..!

పిల్లలు పుట్టాక మరో చిన్నారిని దత్తత తీసుకోవడం లేదంటే దత్తత తీసుకున్నాక మరో బిడ్డకు తల్లవడం.. ఈ రెండు సందర్భాల్లో కొంతమంది పేరెంట్స్‌కు కొన్నాళ్లు గడిచాక దత్తత తీసుకున్న చిన్నారులపై ప్రేమ తగ్గిపోతుంటుంది. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పాటు కుటుంబంలోనూ ప్రశాంతత లేకుండా పోతుంది.. కాబట్టి ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే మీ పిల్లలతో సమానంగా వారినీ ప్రేమించాలి.. మీ కన్న పిల్లలకు, పెంచుతున్న పిల్లలకు మధ్య అనుబంధం రెట్టింపు చేసే బాధ్యత కూడా మీదే అని గుర్తుపెట్టుకోండి! అలాగే వారికి కొనిచ్చే వస్తువులు, ఇతర సౌకర్యాల విషయంలోనూ సమ న్యాయం చేయాలి.. ఏ లోటూ లేకుండా ఇద్దరినీ సమానంగా చూసుకోగలిగితే అటు వాళ్లకూ మీపై ప్రేమ పెరుగుతుంది.. ఇటు మీకూ వారితో అనుబంధం బలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్