Puberty Tips: ఎదిగే అమ్మాయిలకు ఈ ఆహారం!

రజస్వల వయసుకి చేరువవుతోన్న అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు చోటుచేసుకోవడం సహజం. హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్లే ఇలా జరుగుతుంటుంది. నిజానికి ఈ మార్పులు టీనేజీ దశలోకి ప్రవేశించే అమ్మాయిలకు కాస్త అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలగజేస్తాయి.

Updated : 14 Oct 2023 12:26 IST

రజస్వల వయసుకి చేరువవుతోన్న అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు చోటుచేసుకోవడం సహజం. హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్లే ఇలా జరుగుతుంటుంది. నిజానికి ఈ మార్పులు టీనేజీ దశలోకి ప్రవేశించే అమ్మాయిలకు కాస్త అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలగజేస్తాయి. అయితే ఈ దశలో హార్మోన్లలో మార్పులొచ్చినా.. వాటి ప్రభావం వారిపై పడకుండా ఉండాలంటే.. వారి ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేయాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ముందు నుంచే కొన్ని పదార్థాల్ని వారికి అందించడం వల్ల.. పోషకాలన్నీ వారి శరీరానికి అంది.. ఈ దశనూ వారు సౌకర్యవంతంగా దాటేయగలరని చెబుతున్నారు. ఏంటా పదార్థాలు? తెలుసుకుందాం రండి..

హార్మోన్లను సమతులంగా ఉంచడంలో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రజస్వలకు చేరువవుతోన్న అమ్మాయిల్లో హార్మోన్ల ఆరోగ్యానికి ఐరన్‌ అధికంగా లభించే మునగాకు పొడి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. రోజూ టీస్పూన్‌ పొడిని వారు తినే వంటకాల్లో భాగం చేయడం లేదంటే ఉదయాన్నే ఓ గ్లాసు నీటిలో కలిపి ఇవ్వడం.. వంటివి చేస్తే మంచిది.

అవిసె గింజల్లో ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియంతో పాటు ‘సి’, ‘ఇ’, ‘కె’.. వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరించేవే! కాబట్టి టీనేజ్‌ అమ్మాయిలకు ఇది మంచి ఆహారం. వీటిని లడ్డూలు, పొడి, కూరల్లో భాగం చేయడం.. ఇలా వారికి నచ్చినట్లుగా అందించచ్చు.

రజస్వల ప్రారంభమైన తొలినాళ్లలో కొంతమంది అమ్మాయిలకు ఎక్కువ బ్లీడింగ్‌ అవుతుంటుంది. దీనివల్ల రక్తహీనత తలెత్తకుండా ముందు నుంచే జాగ్రత్తపడమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో అంజీర్‌ను వారి ఆహారంలో చేర్చడం మంచిది. ఈ పండు హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచడమే కాదు.. రక్తాన్నీ శుద్ధి చేస్తుంది. అయితే వేడి శరీరం ఉన్న అమ్మాయిలకు దీన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఇవ్వాలి. తద్వారా ఒంట్లో వేడి మరింత పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

టీనేజ్‌లోకి ప్రవేశించే అమ్మాయిల్లో ఎముకల ఎదుగుదల కూడా ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాల్ని వారికి అందించాలి. ఒకవేళ ఇవి ఇష్టపడకపోతే.. బాదం/కొబ్బరి/సోయా పాలు చక్కటి ప్రత్యామ్నాయం. అలాగే ఆకుకూరలు, బ్రకలీ కూడా వారికి మేలు చేస్తాయి.

శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల నీరసం, అలసట ఆవహిస్తుంది. వీటిని ఎదుర్కొని శారీరక శక్తి స్థాయుల్ని పెంచుకోవాలంటే బీన్స్‌, పప్పులు, చేపలు, నిమ్మజాతి పండ్లు, సెరల్స్‌.. వంటివి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

శరీరంలో కొన్ని రకాల హార్మోన్లలో మార్పుల కారణంగా కడుపుబ్బరం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఎదిగే అమ్మాయిల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఫైబర్‌ అధికంగా ఉండే బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, ఓట్స్‌, తాజా పండ్లు, కాయగూరలు, పప్పులు వారి మెనూలో చేర్చాలంటున్నారు.

శరీరంలో హార్మోన్లు, ఎంజైమ్‌ల స్థాయుల్ని క్రమబద్ధీకరించి.. కండరాల్ని దృఢం చేయడంలో ప్రొటీన్ల పాత్ర కీలకం. కాబట్టి రజస్వలకు దగ్గరయ్యే అమ్మాయిలు.. ప్రొటీన్లు ఎక్కువగా లభించే చేపలు, మాంసం, పప్పులు, గింజలు, కోడిగుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ఇవీ ముఖ్యమే!

రజస్వలకు చేరువవుతోన్న అమ్మాయిల్లో హార్మోన్ల ఆరోగ్యానికి ఆహారంతో పాటు కొన్ని నియమాల్ని పాటింపజేసేలా చూడడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు.

రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లూ సమతులంగా ఉంటాయి.. మానసిక సమస్యలూ దరిచేరవు.. బరువు కూడా అదుపులో ఉండి భవిష్యత్తులో పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

ఈ వయసులో పిల్లలు జంక్‌ ఫుడ్‌, శీతల పానీయాలకు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. కానీ వీటి వల్ల కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు వీటికి దూరంగా ఉండేలా చూడడం ముఖ్యం.

టీనేజ్‌ అమ్మాయిల నిద్ర సమయాల్ని కూడా పరిశీలించాలి. రోజుకు ఏడెనిమిది గంటలు వారు ప్రశాంతంగా పడుకునేలా చూడాలి. దీనివల్ల కూడా హార్మోన్ల ఆరోగ్యం బాగుంటుంది.

అలాగే రజస్వల సమయంలో శారీరక మార్పులతో వారు ఆందోళన పడకుండా ఉండాలంటే.. తల్లులు ముందు నుంచే ఆయా మార్పుల గురించి వారికి వివరించాలి. దీనివల్ల వారిలో కంగారు ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్