సాగు పరికరాలు... బతుకునిచ్చాయి!

చదువుకుందామంటే కుదర్లేదు. తోడుంటాడనుకున్న భర్త తాగుబోతయ్యాడు. ఎలాగోలా ఇంటిని నెట్టుకొస్తుంటే ఆయన కాస్తా దూరమయ్యాడు. అలాంటప్పుడు ఇంకెవరైౖనా అయితే కుంగిపోతారు. కానీ రమ్య... వ్యాపారవేత్తగా మారి, ఎందరికో స్ఫూర్తిగా మారింది.

Published : 27 Jun 2024 04:43 IST

చదువుకుందామంటే కుదర్లేదు. తోడుంటాడనుకున్న భర్త తాగుబోతయ్యాడు. ఎలాగోలా ఇంటిని నెట్టుకొస్తుంటే ఆయన కాస్తా దూరమయ్యాడు. అలాంటప్పుడు ఇంకెవరైౖనా అయితే కుంగిపోతారు. కానీ రమ్య... వ్యాపారవేత్తగా మారి, ఎందరికో స్ఫూర్తిగా మారింది.

కేరళలోని పన్నియూర్‌ అనే గ్రామం రెమ్యది. సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం. పైగా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. అయినా ఎలాగోలా ఇంటర్‌ దాకా నెట్టుకొచ్చింది రమ్య. డిగ్రీలోనూ చేరింది. కానీ ఇంట్లోవాళ్లు చదువు చాలని చెప్పి, పెళ్లి చేశారు. భర్త తాగుబోతని కొద్దిరోజుల్లోనే తెలిసింది. అయినా తట్టుకుంది. ఇద్దరు పిల్లలు, ఖర్చులకూ భర్త డబ్బులు ఇవ్వడం మానేశాడు. కడుపున పుట్టినవాళ్లు ఆకలి అని ఏడుస్తోంటే చూడలేక స్థానికంగా ప్లాస్టిక్‌ను వేరు చేసే సంస్థలో చేరింది. కడుపు నిండుతోంది అనుకుంటే భర్తకి క్యాన్సర్‌ అని తేలింది. చికిత్సకు వచ్చే రాబడి సరిపోకపోగా కొత్తగా అప్పులయ్యాయి. అంత చేసినా భర్త దక్కలేదు. కూలీ పనితో ఇల్లే గడపాలా... అప్పులే తీర్చాలా అని అర్థం కాలేదామెకు. కానీ పిల్లల కోసం ధైర్యం కూడగట్టుకుంది. అప్పుడే ‘కుటుంబశ్రీ’ తరఫున ఊళ్లో ‘బిజినెస్‌ కన్సల్టెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌’ నిర్వహించారు. అది ఆమె ఆలోచనను మార్చింది. పని కోసం వెతకడం కాదు, తనే సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచన కల్పించింది.

స్వయం సహాయక సంఘం నుంచి రుణం తీసుకుని ‘ఫార్మర్స్‌ ఎట్‌ లాగిన్‌’ ప్రారంభించింది రమ్య. ఇదో వ్యవసాయ పనిముట్లను తయారు చేసే సంస్థ. ఆ ఊళ్లో కమ్మరి వృత్తి చేపట్టిన తొలి అమ్మాయి తను. అందుకే తొలిరోజుల్లో ఊళ్లో వాళ్ల నుంచి చాలా వ్యతిరేకత మొదలైంది. ఇది అమ్మాయిలు చేసే పని కాదన్నారు. అన్నీ తట్టుకొని నిలబడిందామె. ‘నాన్న, తాతలు కమ్మరి వృత్తి చేసేవారు. సొంతంగా ఏం చేయాలన్నప్పుడు నాకు తట్టిన పని అదే. అందుకే దాన్ని ఎంచుకున్నా. సంప్రదాయ పరికరాలే! రైతుల ఇబ్బందులు తెలుసు కాబట్టి, వారికి అనుగుణంగా వాటిని తీర్చిదిద్దా. నాగళ్లు, సాగు పరికరాలు, కలుపు తీసేవి, విత్తన పరికరాలు వంటివెన్నో తయారు చేసి... పక్కఊళ్లకు అమ్మా. అందరికీ నచ్చడంతో ఊళ్లోని వాళ్లూ తీసుకోవడం మొదలుపెట్టారు. పిల్లలకు పెట్టడానికి రూ.10 లేని స్థితి నుంచి చిన్నదైనా సొంతంగా వ్యాపారం చేసుకునే స్థాయికి వచ్చా. ఇప్పుడు పిల్లల భవిష్యత్తుపై బెంగలేదు. తక్కువ ఖర్చులో ఆధునిక వ్యవసాయ పనిముట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నా’ అంటోన్న 27 ఏళ్ల రమ్యా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్