వంటలతో... కోట్ల ఫాలోయర్లు!

పట్టుమని పది నిమిషాల్లో సంప్రదాయ వంటల్నీ, క్షణాల్లో స్ట్రీట్‌ చాట్స్‌నీ వండి వడ్డించేయగలదు. అతి తక్కువ దినుసులతో ఈమె చేసే వంటకాలకు కోట్లమంది ఫిదా అవుతున్నారు.

Published : 24 Jun 2024 02:02 IST

పట్టుమని పది నిమిషాల్లో సంప్రదాయ వంటల్నీ, క్షణాల్లో స్ట్రీట్‌ చాట్స్‌నీ వండి వడ్డించేయగలదు. అతి తక్కువ దినుసులతో ఈమె చేసే వంటకాలకు కోట్లమంది ఫిదా అవుతున్నారు. అందుకే ఈ ఏడాది బెస్ట్‌ క్రియేటర్‌గా ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డునీ అందుకుంది. తాజాగా ఫోర్బ్స్‌ పట్టికలోనూ స్థానం సంపాదించింది 41 ఏళ్ల కబితాసింగ్‌.

ఉత్తర, దక్షిణాది వంటకాలన్నీ సులువుగా చేయడం అమ్మ నుంచి నేర్చుకున్నాను అని చెప్పే కబితాసింగ్‌ది పుణె. చిన్నప్పటి నుంచి వంటపై ఆసక్తి. తల్లికి వంటగదిలో సాయాన్నీ అందించేది. ఆ తర్వాత చదువు, ఉద్యోగంతో బిజీ అయ్యింది. 2009లో పెళ్లై భర్తతో లండన్‌ వెళ్లడంతో కబితాసింగ్‌కు ఉద్యోగంలో విరామం దొరికింది. ‘కొత్త వంటకాలను నేర్చుకోవడం మొదలుపెట్టా. అయిదేళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం. మా అబ్బాయి స్కూల్‌కెళ్లిన తర్వాత నాకు మళ్లీ సమయం దొరికింది. తిరిగి ఉద్యోగానికి వెళదామంటే బాబు సంరక్షణ చూసుకోవాలి. దాంతో నా చిన్నప్పటి అభిరుచికి పెద్దపీట వేసి వంట వీడియోలు చేయాలనుకున్నా. 2014లో ‘కబితాస్‌కిచెన్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. వంట పరిచయం లేనివాళ్లకు కూడా అర్థమయ్యేలా వంట చేసి చూపించడంతోపాటు, వాళ్లడిగే సందేహాలూ తీర్చేదాన్ని. ఆ తర్వాత వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్, సలహాలు తీసుకుంటూనే, వాళ్లు కోరిన వంటకాలు చేసి చూపించేదాన్ని. సీజన్‌కు తగిన, పండగలకు సంబంధించిన వాటినీ వీడియోల్లో జత చేస్తుంటా. అలాగే ట్రెండింగ్‌లో ఉన్నవాటితోపాటు కొన్ని ప్రత్యేక వంటకాలు చేసి వారానికి మూడు వీడియోలు పోస్ట్‌ చేసేలా ప్రణాళిక వేసుకున్నా. అలా మా వంటింట్లోనే మొదట ఫోన్‌ కెమెరాలో నేను తీసిన వీడియోలకు అభిమానులు పెరిగా’రని గుర్తు చేసుకుంటుందీమె.

స్థానాన్ని దక్కించుకుని...

కబితాసింగ్‌ తన వంటకాలతోపాటు సబ్జీ, చికెన్, పావ్‌బాజీ మసాలాలను తయారుచేసి ప్రచారమూ చేస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా మార్కెట్‌లో మంచి స్పందన వచ్చింది. అంతేకాదు, వంటింట్లో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంట చిట్కాలు, ప్రతి పదార్థాన్ని వృథా కాకుండా నిల్వ చేయడమెలాగో కూడా చెబుతోందీమె. మొదట్లో వ్యాపారవేత్తగా ఉన్నా క్రమేపీ నయా ఆలోచనలతో కంటెంట్‌ క్రియేటర్‌గా మారిన కబితాసింగ్‌ ఈ ఏడాది ఫుడ్‌ క్యాటగిరిలో ‘బెస్ట్‌ క్రియేటర్‌’ అవార్డును ప్రధాని మోదీ చేతులమీదుగా అందుకుంది. తాజాగా ఫోర్బ్స్‌ క్రియేటర్స్‌ పట్టికలో స్థానాన్నీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె వంట వీడియోలకు యూట్యూబ్‌లో 1.39 కోట్లమంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాలో కోటి మంది ఫాలోయర్లున్నారు. ‘మనసుకు నచ్చింది చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ఏ రంగంలోనైనా విజయం దరిచేరుతుంది. అంతేకాదు, అది మరికొందరికి మనల్ని స్ఫూర్తిగా నిలబెడుతుం’దని చెబుతుందీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్