టొమాటోకు బదులుగా ఇవి..!

కూరల్లో రుచి, గ్రేవీ కోసం టొమాటో వాడడం మనకు అలవాటే! అయితే గత కొన్ని రోజులుగా దీని ధర ఆకాశాన్నంటుతుండడంతో చాలామందికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ క్రమంలోనే దీనికి ప్రత్యామ్నాయాల్ని వెతుక్కునే పనిలో పడ్డారు చాలామంది. మీరూ అంతేనా? అయితే ఇవి ప్రయత్నించండి..!

Published : 27 Jun 2024 12:20 IST

కూరల్లో రుచి, గ్రేవీ కోసం టొమాటో వాడడం మనకు అలవాటే! అయితే గత కొన్ని రోజులుగా దీని ధర ఆకాశాన్నంటుతుండడంతో చాలామందికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ క్రమంలోనే దీనికి ప్రత్యామ్నాయాల్ని వెతుక్కునే పనిలో పడ్డారు చాలామంది. మీరూ అంతేనా? అయితే ఇవి ప్రయత్నించండి..!

⚛ కొన్ని వంటకాల్లో పులుపుదనం కోసం టొమాటోల్ని వాడుతుంటారు. ఇలాంటప్పుడు కొద్దిగా చింతపండు లేదంటే దాని గుజ్జు వేసినా.. ఆ వంటకానికి పులుపుదనం రావడంతో పాటు రుచి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే కూర చిక్కదనం కూడా పెరుగుతుంది.

⚛ కూర చిక్కదనం కోసం టొమాటోకు ప్రత్యామ్నాయంగా ఉల్లిపాయల్ని కూడా ఉపయోగించచ్చు. ఈ క్రమంలో ఉల్లిపాయల్ని దోరగా వేయించి పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని కూరల్లో వాడుకోవచ్చు. అయితే అది కూడా తక్కువగా వాడితేనే కూర ఘాటుగా ఉండకుండా, దాని రుచి మారిపోకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఉసిరి పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌.. వంటివి కూడా కూరలకు రుచిని అందించడంతో పాటు.. పులుపుదనాన్నిస్తాయి. కాబట్టి కర్రీ వండేటప్పుడు వీటిలో ఏదో ఒక పొడిని చిటికెడు వేస్తే.. తింటున్నప్పుడు టొమాటో వాడలేదన్న ఫీలింగే రాదు.

⚛ పచ్చి మామిడి కాయల్ని కూడా టొమాటోకు బదులుగా కూరల్లో వాడుకోవచ్చు. అయితే అవి వేసవిలోనే లభిస్తాయి. అందుకే సంవత్సరం పొడవునా వాటి రుచిని ఆస్వాదించడానికి చాలామంది పచ్చిమామిడితో ఒరుగులు, చిప్స్‌, ఫ్లేక్స్‌.. వంటివి తయారుచేసుకొని నిల్వ చేసుకుంటారు. వీటినీ కూరల్లో వేసుకొని టొమాటో రుచిని భర్తీ చేయచ్చు.

⚛ కూరల్లో గ్రేవీ కోసం చాలామంది టొమాటోల్ని వాడుతుంటారు. అయితే ప్రస్తుతం దీనికి బదులు గుమ్మడి కాయ ప్యూరీ కూడా ఉపయోగించచ్చు. టొమాటోలాగే కాస్త తియ్యగా ఉండే ఇది కూరల రుచిని పెంచుతుందనడంలో సందేహమే లేదు. దీంతో పాటు ఉసిరి కాయ గుజ్జును కూడా వేసుకోవచ్చు.

⚛ కాస్త ముందు చూపున్న వారు టొమాటోలు తక్కువ ధరకు దొరికినప్పుడే కిలోల కొద్దీ కొనుగోలు చేసి ఒరుగులు, పొడి రూపంలో తయారుచేసుకొని నిల్వ చేసుకుంటారు. అలాగే ఉడికించిన టొమాటో గుజ్జులో సరిపడా ఉప్పు వేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుంటారు. టొమాటో ధర పెరిగినప్పుడు, అవి అందుబాటులో లేనప్పుడు కూరల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. టొమాటోలు మళ్లీ విరివిగా దొరికేటప్పుడు ఈ చిట్కా పాటించచ్చు.

⚛ అలాగే కొన్ని రకాల స్నాక్స్‌, సలాడ్స్‌లో టొమాటోకు బదులుగా.. కెచప్‌ని సైతం ఉపయోగించి.. దాని రుచిని ఆస్వాదించచ్చు.

⚛ ఇదేవిధంగా నచ్చిన వారు పుల్లటి పెరుగును కూడా టొమాటోలకు ప్రత్యామ్నాయంగా వాడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్