మొటిమలను తగ్గించే నూనె!

అమ్మాయిల సౌందర్య పోషణలో పసుపుది ఎంత కీలక పాత్రో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు సౌందర్య పోషణలో భాగంగా పలు ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది.

Published : 25 Jun 2024 22:07 IST

అమ్మాయిల సౌందర్య పోషణలో పసుపుది ఎంత కీలక పాత్రో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు సౌందర్య పోషణలో భాగంగా పలు ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో పసుపు మొక్క నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలేంటి? దానిని ఎలా ఉపయోగించాలి? తదితర వివరాలన్నీ మనమూ తెలుసుకుందాం రండి..

పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ ఎలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ప్యారసైటిక్ గుణాలెన్నో ఉన్నాయి. ఫలితంగా దీనివల్ల సౌందర్యపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.

చర్మం తాజాదనం కోసం..

కొన్నిసార్లు చర్మం కమిలిపోయి, నిర్జీవంగా తయారవుతుంది. ఇటువంటప్పుడు చర్మం తిరిగి తాజాగా కనిపించడానికి ఈ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా ఉపకరిస్తుంది. దీని కోసం ఒకటిన్నర చెంచా ఆలివ్ ఆయిల్‌లో పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ ఒక్క చుక్క వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకొనే ముందు చేయడం వల్ల అలసిన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

మొటిమలు, మచ్చలు తగ్గడానికి..

పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి మొటిమలను తగ్గుముఖం పట్టేలా చేయడమే కాకుండా వాటి వల్ల ఏర్పడిన మచ్చలను కూడా రూపుమాపుతాయి. ఫలితంగా మచ్చల్లేని ప్రకాశవంతమైన మోముని సొంతం చేసుకోవచ్చు.

వృద్ధాప్య ఛాయలు కనబడకుండా..

ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవు. దీని కోసం నాలుగు చెంచాల బాదం నూనెలో నాలుగు చుక్కల పసుపు ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో ముఖంపై సన్నని గీతలు, ముడతలు ఉన్నచోట మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎక్కువైన నూనెని తుడిచేసుకోవాలి. ఈ చిట్కాను కూడా రాత్రి పడుకొనే ముందు రోజూ పాటించడం ద్వారా వృద్ధాప్య ఛాయలు కనుమరుగవుతాయి.

అలాగే పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌ను విడిగానే కాదు.. ఫేషియల్ మాస్కుల తయారీలోనూ వినియోగించవచ్చు. తద్వారా ఆయా ప్యాక్స్‌కు సంబంధించి మరింత మెరుగైన ఫలితాలు పొందచ్చు.

ఈ జాగ్రత్తలు..

ఈ నూనెను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ నూనెను నేరుగా చర్మం లేదా కురులపై ఉపయోగించకూడదు. కొబ్బరినూనె, బాదం నూనె, జొజోబా ఆయిల్.. వంటి నూనెలతో కలిపి మాత్రమే వినియోగించాలి. అలాగే దీనిని వీలైనంత తక్కువ మోతాదులోనే వినియోగించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నూనెను ఉపయోగించిన తర్వాత చర్మం చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. ఫలితంగా సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలను అంతగా తట్టుకోలేదు. కాబట్టి దీనిని ఉపయోగించిన తర్వాత ఎండలోకి వెళ్లకుండా ఉండడం మంచిది. తప్పనిసరైతే చర్మాన్ని స్కార్ఫ్ లేదా మెత్తని కాటన్ వస్త్రంతో కవర్ చేసుకోవాలి.

అలాగే వాడే ముందు సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ ఆయిల్‌ను ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ముందుగా ఈ నూనెను వేరే నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని 20 నిమిషాలు వేచి చూడాలి. ఎలాంటి సమస్యలు లేకపోతేనే దీనిని ఉపయోగించాలి అని సూచిస్తున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్