అందానికి.. కలబంద ప్యాక్స్‌!

సౌందర్య సంరక్షణకు మార్కెట్లో ఎన్ని ప్రత్యామ్నాయాలున్నా ఇంట్లో సహజసిద్ధంగా లభించే ఉత్పత్తులు/పదార్థాలే మంచివి. కలబంద కూడా అందులో ఒకటి. జిడ్డుగా, పొడిగా, సున్నితంగా.. ఇలా అన్ని రకాల చర్మతత్వాల వారికీ ఇది మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Published : 08 Dec 2023 12:20 IST

సౌందర్య సంరక్షణకు మార్కెట్లో ఎన్ని ప్రత్యామ్నాయాలున్నా ఇంట్లో సహజసిద్ధంగా లభించే ఉత్పత్తులు/పదార్థాలే మంచివి. కలబంద కూడా అందులో ఒకటి. జిడ్డుగా, పొడిగా, సున్నితంగా.. ఇలా అన్ని రకాల చర్మతత్వాల వారికీ ఇది మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కలబంద చర్మానికి ఎలా ప్రయోజనకరమో తెలుసుకుందాం రండి..

ముఖం కాంతికి..

చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు, కొంచెం రోజ్‌వాటర్, చెంచా తేనె.. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును కూడా జతచేసి మరోసారి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.

జిడ్డుగా ఉందా?

జిడ్డు చర్మతత్వం ఉన్న వారిని మొటిమల సమస్య వేధిస్తుంది. ఇలాంటి వారు కలబంద ఆకుని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. దానికి కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆ మచ్చలు మాయం!

గాయాల వల్ల చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టడంలోనూ కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. ఇందుకోసం కలబంద గుజ్జులో కాస్త రోజ్‌వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొడి చర్మమైతే..

పొడి చర్మతత్వం ఉన్న వారి చర్మం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇందుకు కారణం చర్మంలో ఉండే తేమ శాతం తగ్గిపోవడమే! మరి తేమ శాతాన్ని పెంచుకోవాలంటే కొద్దిగా కలబంద గుజ్జులో కాస్త ఆలివ్ ఆయిల్‌ని వేసి మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

ట్యాన్‌కు విరుగుడు!

చర్మంపై ఎండ పడి ట్యాన్ రావడం సర్వసాధారణం. ఈ క్రమంలో కాస్త కలబంద గుజ్జు తీసుకొని అందులో టీస్పూన్‌ చొప్పున నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రదేశంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ మాత్రమే కాదు.. మొటిమలు కూడా తగ్గిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్