ఇలా వండితే.. ఆరోగ్యానికి ముప్పేనట!

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమే కాదు.. వాటిని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవడమూ ముఖ్యమే! అప్పుడే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ చాలామంది తెలిసో, తెలియకో, పదార్థాలకు అదనపు రుచిని అందించాలనో.. విభిన్న పాకశాస్త్ర పద్ధతుల్ని అనుసరిస్తుంటారు.

Published : 22 Jun 2024 12:32 IST

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమే కాదు.. వాటిని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవడమూ ముఖ్యమే! అప్పుడే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ చాలామంది తెలిసో, తెలియకో, పదార్థాలకు అదనపు రుచిని అందించాలనో.. విభిన్న పాకశాస్త్ర పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. అయితే వాటి వల్ల పదార్థాలు విషపూరితమై.. వివిధ రకాల అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి అలాంటి వంట పద్ధతుల్ని పాటించకపోవడమే మంచిదంటున్నారు. ఇంతకీ ఆహారాన్ని విషపూరితం చేసే ఆ కుకింగ్‌ పద్ధతులేవి? రండి.. తెలుసుకుందాం..!

ఇలా వండుతున్నారా?

డీప్‌ ఫ్రై - నూనెలో వేయించిన పదార్థాలంటే ఎంతో ఇష్టంగా తింటాం. అయితే ఈ క్రమంలో నూనె ఆక్సిడైజ్‌ చెంది.. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెడు కొవ్వులు. ఇలాంటి డీప్‌ ఫ్రైడ్‌ పదార్థాల్ని తరచూ తీసుకోవడం వల్ల.. శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోయి.. గుండె సంబంధిత సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు.

వేపుళ్లు - భోజనంలో ఏదో ఒక వేపుడు లేనిదే ముద్ద దిగదు చాలామందికి! అయితే ఆయా కాయగూరల్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫ్రై చేసే క్రమంలో అక్రిలమైడ్ అనే రసాయనం వెలువడుతుంది. ఇది భవిష్యత్తులో క్యాన్సర్‌ కారకంగా మారే ప్రమాదం ఉంటుందట! రోస్టింగ్‌, బేకింగ్‌ పద్ధతుల్లో తయారుచేసే పదార్థాలతోనూ ఈ ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

గ్రిల్లింగ్ - పదార్థాల్ని గ్రిల్‌ చేసుకొని తినడం ఆరోగ్యకరం అని చెబుతుంటారు నిపుణులు. అయితే అది కాయగూరలు, పండ్లు వంటి కొన్ని పదార్ధాలకు మాత్రమే వర్తిస్తుందంటున్నారు. అదే మాంసాహారాన్ని ఈ పద్ధతిలో ఉడికిస్తే.. హెటరో సైక్లిక్ అమైన్స్ అనే రసాయనాలు వెలువడతాయట! సహజసిద్ధంగానే కార్సినోజెనిక్‌ స్వభావాన్ని కలిగి ఉండే ఈ రసాయనాలు.. భవిష్యత్తులో క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయంటున్నారు నిపుణులు.

స్మోకింగ్ - మంట, పొగపై కొన్ని పదార్థాల్ని ఉడికిస్తుంటారు. ఈ క్రమంలో పొగ ఆయా పదార్థాలకు అదనపు రుచిని అందిస్తుందనేది ఈ కుకింగ్‌ పద్ధతి ముఖ్యోద్దేశం. అయితే ఇది ధూమపానం చేసినంత హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు వెలువడతాయని, వీటి వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందంటున్నారు.

మైక్రోవేవింగ్ - అవెన్‌లో కొన్ని పదార్థాల్ని వండుకోవడం, తిరిగి వేడి చేసుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ పద్ధతిలో విడుదలయ్యే రేడియేషన్‌ కారణంగా బ్రెయిన్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.

ఎయిర్‌ ఫ్రైయింగ్ - నూనె లేకుండా/తక్కువ నూనెతో పదార్థాల్ని వేయించుకోవడానికి ప్రస్తుతం చాలామంది ‘ఎయిర్‌ ఫ్రైయింగ్‌’ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాడ్జెట్స్‌ సైతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పద్ధతిలో ఉత్పత్తయ్యే వేడి గాలి.. ఆరోగ్యానికి హాని కలిగించే పలు రకాల రసాయనాల్ని ఉత్పత్తి చేయడంతో పాటు.. ఆయా పదార్థాలు సరిగ్గా ఉడక్కపోవచ్చంటున్నారు నిపుణులు. మిగతా పద్ధతులతో పోల్చితే ఇది కాస్త ఆరోగ్యకరమైనదే అయినా.. తరచూ ఈ పద్ధతిని పాటించకపోవడమే మంచిదంటున్నారు.

నాన్‌స్టిక్ - ప్రస్తుతం చాలామంది ఈ తరహా వంట పాత్రల్ని ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో ఉండే టెఫ్లాన్‌ కోటింగ్‌ అధిక ఉష్ణోగ్రత వల్ల కరిగి వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.


ఇవి ఆరోగ్యకరం!

అనారోగ్యాల్ని తెచ్చి పెట్టే ఇలాంటి అనారోగ్యకరమైన వంట పద్ధతులకు బదులు సంప్రదాయ పద్ధతుల్ని పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

ఆవిరిపై ఉడికించిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఈ క్రమంలో నూనె ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.. దీనికి తోడు ఈ ఆవిరి చెడు కొవ్వుల్ని తొలగిస్తుంది.

​​​​​​​నూనె, బటర్‌తో పని లేకుండా స్టాక్/బ్రాత్.. వంటి రుచికరమైన సూప్స్‌లో పదార్థాల్ని ఉడికించడమే ‘పోచింగ్‌ పద్ధతి’. ఇది కూడా ఆరోగ్యకరమైనదే అంటున్నారు నిపుణులు.

​​​​​​​అధిక ఉష్ణోగ్రతల వద్ద కాకుండా.. మనం వండుకునే పదార్థాల్ని స్టౌపై సిమ్‌లో పెట్టి ఉడికిస్తే మంచిదంటున్నారు నిపుణులు.

​​​​​​​వంట కోసం ఆలివ్‌, క్యానోలా.. వంటి నూనెల్ని వాడడం ఆరోగ్యకరం!

​​​​​​​తయారుచేసే వంటకాల్లో ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌, కృత్రిమ రంగుల్ని తగ్గిస్తే మరీ ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.

​​​​​​​అలాగే వంట కోసం ఎంచుకునే పాత్రలు కూడా స్టీలు, సెరామిక్‌, మట్టి.. వంటి మెటీరియల్స్‌తో తయారుచేసినవి ఎంచుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్