ఫుట్‌బాల్‌ ఆటలో తొలి అనలిస్ట్‌గా... అంజిత!

చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది ఫుట్‌బాల్‌ మ్యాచ్‌. ఆఖరి నిమిషంలో ప్రత్యర్థిని బోల్తాకొట్టించి గోల్‌ చేసి ఓ జట్టు విజేతగా నిలిచింది.  దాని వెనుక క్రీడాకారుల నైపుణ్యంతో పాటు ప్రత్యర్థి జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషించి ఆటను మలుపుతిప్పే ప్రణాళికలు  చెప్పిన  ఘనత ఎం.అంజితదే.

Published : 04 Jul 2024 03:23 IST

చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది ఫుట్‌బాల్‌ మ్యాచ్‌. ఆఖరి నిమిషంలో ప్రత్యర్థిని బోల్తాకొట్టించి గోల్‌ చేసి ఓ జట్టు విజేతగా నిలిచింది.  దాని వెనుక క్రీడాకారుల నైపుణ్యంతో పాటు ప్రత్యర్థి జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషించి ఆటను మలుపుతిప్పే ప్రణాళికలు  చెప్పిన  ఘనత ఎం.అంజితదే. క్రీడాకారిణి స్థాయి నుంచి దేశంలోనే తొలి మహిళా ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ వీడియో విశ్లేషకురాలిగా ఎదిగింది.

ఫుట్‌బాల్‌ ఆడటం అంటేనే ఓ అద్భుతమని చెప్పే అంజితకు ఆమె రక్తంలోనే ఈ క్రీడ ఉందనిపిస్తుంది. ఈమె తండ్రి మణి జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. పోటీలకు వెళ్లేటప్పుడు అంజితను వెంట తీసుకెళ్లేవాడు. అలా అంజితకు బాల్యంలోనే ఈ క్రీడను పరిచయం చేశాడు. నాన్నలాగే తనూ  పెద్ద క్రీడాకారిణి కావాలని కలలు కనేది. ఎనిమిదో తరగతిలో స్కూల్‌ ఫుట్‌బాల్‌ జట్టులో చేరింది. క్రమంగా స్కూల్‌ తరఫున జూనియర్, ఆపై సీనియర్‌ క్రీడాకారిణిగా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేది. ‘ఫుట్‌బాల్‌లో అమ్మానాన్నలే నా మొదటి గురువులు. వాళ్ల ప్రోత్సాహమెంతో ఉంది. స్కూల్‌లోనే కాకుండా సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో బీకాం చదివేటప్పుడు కూడా ఆటను వదల్లేదు నేను. కాలికట్‌ యూనివర్సిటీ తరఫున మ్యాచ్‌లకు వెళ్లేదాన్ని. ఈ అనుభవం నా కెరియర్‌ను మలుపు తిప్పాయి. కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీ మహిళల జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నా. కోచ్‌ షరీఫ్‌ఖాన్‌ నా నైపుణ్యాలను మరింత మెరుగుపరిచారు. ఉన్నతస్థాయి క్రీడాకారిణి అవుతావంటూ ప్రోత్సహించారు. ఆయన అందించిన చేయూత మరవలేనిద’ని చెప్పే అంజిత, కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీ మహిళా జట్టు తరఫున పలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది.

ఆసక్తితో...

మైదానంలో జట్టుతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడటమే కాకుండా, ఈ రంగంలో వేరే అవకాశాల గురించీ ఆసక్తి చూపించేది అంజిత. ముఖ్యంగా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్‌ అనాలిసిస్‌పైనా అవగాహన తెచ్చుకుంది. ‘కేరళ బ్లాస్టర్స్‌ రిజర్వ్‌ జట్టుతో కలిసి ఆడుతున్నప్పుడు మాకందరికీ విశ్లేషకుడిగా ఆనంద్‌ వర్ధన్‌ ఉండేవారు. ప్రత్యర్థుల తీరును ఆయన విశ్లేషించే తీరు నాకు ఆశ్చర్యం కలిగించేది. ఆడటం కన్నా, ప్రత్యర్థి జట్టు బలాలు, బలహీనతలను తెలుసుకుంటూ కొత్త ప్రణాళికలు వేయడం... ఆకట్టుకోవడంతో అనాలిసిస్‌ వైపు వెళ్లాలనుకున్నా. ఇందుకోసం ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ స్కౌట్స్‌ అసోసియేషన్‌ (పీఎఫ్‌ఎస్‌ఏ) నుంచి సంబంధిత కోర్సు పూర్తిచేశా. ఆట నుంచి విరమణ పొంది పూర్తిగా ఇప్పుడు స్పోర్ట్స్‌ అనలిస్ట్‌నయ్యా’ అంటున్న అంజిత ఇండియాలోనే తొలి మహిళా ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ వీడియో విశ్లేషకురాలిగా నిలిచింది. గోకులం కేరళ మహిళా జట్టుతో కలిసి పనిచేస్తూ విశ్లేషకురాలిగా జట్టుకు సూచనలిస్తోంది. అంకితభావంతో ఫుట్‌బాల్‌ రంగానికి సహకరిస్తున్న ఈమెకు కోచ్‌గానూ రాణించాలనే లక్ష్యం ఉంది. మరెందరో మహిళలను మైదానంలోకి నడిపించాలనే ఆసక్తీ...ఉంది. ఈ క్రీడలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, తనలాంటివారికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్న అంజితకు ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్