ముఖాన్ని మెరిపించే ఫేషియల్!

ముఖాన్ని అందంగా మెరిపించడానికి వివిధ రకాల ఫేషియల్స్‌ను ప్రయత్నించడం తెలిసిందే. ఈ క్రమంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫేషియల్స్‌లో ఆక్సిజన్ ఫేషియల్ కూడా ఒకటి..!

Published : 16 Sep 2023 12:25 IST

ముఖాన్ని అందంగా మెరిపించడానికి వివిధ రకాల ఫేషియల్స్‌ను ప్రయత్నించడం తెలిసిందే. ఈ క్రమంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫేషియల్స్‌లో ఆక్సిజన్ ఫేషియల్ కూడా ఒకటి..! తక్కువ సమయంలో మోమును మెరిపించుకోవడానికి ఉపయోగపడే ఈ విధానం ద్వారా చర్మానికి చేకూరే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు.

అసలేంటీ ఫేషియల్..?

అతి తక్కువ సమయంలోనే చర్మానికి మెరుపును అందించడానికి తోడ్పడే వివిధ రకాల ఫేషియల్స్‌లో ఆక్సిజన్ ఫేషియల్ కూడా ఒకటి. ఇందులో భాగంగా గాఢత ఎక్కువగా ఉండే ఆక్సిజన్ పరమాణువులను ముఖం, మెడ వంటి బయటకు కనిపించే భాగాలపై స్ప్రే చేస్తారు. విటమిన్లు, ఖనిజాలు, అత్యవసర పోషకాలు, వివిధ మొక్కల సారం.. వంటి వాటితో కూడిన ఈ స్ప్రే చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు ముఖం ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు.. చర్మంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను అందించి లోపలి నుంచి మెరుపును అందిస్తుంది అంటున్నారు నిపుణులు.

ప్రయోజనాలెన్నో..!

ఎలాగైతే స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు ఆరోగ్యాన్ని అందిస్తుందో.. అలాగే ఆక్సిజన్ ఫేషియల్ కూడా చర్మ ఆరోగ్యాన్ని పెంచి మోముకు అందాన్ని చేకూర్చుతుంది. లైట్, సీరం, మసాజ్.. ఇలా మూడంచెల విధానం ద్వారా చేసే ఈ సౌందర్య చికిత్స వల్ల ఇంకా చాలా ఉపయోగాలే ఉన్నాయట.

చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కొలాజెన్ పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందించి వయసు పైబడిన ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది. అయితే ఇలా అందాన్ని పెంపొందించుకోవాలంటే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి సక్రమంగా జరగాలి. అందుకు ఆక్సిజన్ ఫేషియల్ ఎంతగానో దోహదం చేస్తుంది.

ఆక్సిజన్ ఫేషియల్ చర్మంపై పేరుకున్న జిడ్డు, మలినాలు, మృతకణాలు వంటివి తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఇది మూసుకుపోయిన చర్మరంధ్రాలను తెరిచి చర్మఛాయను రెట్టింపు చేస్తుంది. అలాగే ఈ పద్ధతి చెంపలకు సహజసిద్ధమైన బ్లష్‌లా కూడా పనిచేస్తుంది.

కాలుష్యం, వాతావరణ మార్పులు.. వంటి వాటి వల్ల చర్మం తేమను కోల్పోవడం సహజమే. ఫలితంగా వివిధ రకాల సౌందర్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. మరి, అలా జరగకుండా చర్మం తిరిగి తేమను సంతరించుకోవాలంటే అది ఆక్సిజన్ ఫేషియల్‌తోనే సాధ్యపడుతుంది. ఇది చర్మం లోపలి పొరలకు తేమను అందించడంతో పాటు చర్మపు పీహెచ్ స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. తద్వారా ఎలాంటి సౌందర్యపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.

చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సౌందర్యపరమైన సమస్యల్లో మొటిమలు ప్రధానమైనవి. మరి, ఈ సమస్య నుంచి బయటపడేందుకు కూడా ఆక్సిజన్ ఫేషియల్ ఒక చక్కటి మార్గం.

ఎలాంటి చర్మ సమస్యనైనా త్వరగా నయం చేసే గుణం ఈ ఫేషియల్‌కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆక్సిజన్ ఫేషియల్‌లో ఉపయోగించే సీరంలో విటమిన్లు, హైఅల్యురోనిక్ ఆమ్లాలు, పోషకాల వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ ఛాయను రెట్టింపు చేయడానికి తోడ్పడతాయి.

అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ- కొంతమందిలో అలర్జీ, చర్మం ఎర్రబడడం, ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం.. వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉండచ్చట. అందువల్ల ఈ ఫేషియల్‌ని చేయించుకునే ముందు స్కిన్ స్పెషలిస్ట్ / సౌందర్య నిపుణుల సలహాను తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పేరు పొందిన క్లినిక్స్‌లో, నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఫేషియల్‌ని చేయించుకోవాలి.

ఫేషియల్ తర్వాత ఈ జాగ్రత్తలు..

సాధారణంగా ఫేస్‌ప్యాక్‌, ఫేషియల్‌ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే సరైన సౌందర్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే ఆక్సిజన్‌ ఫేషియల్‌ చేయించుకున్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఆక్సిజన్‌ ఫేషియల్‌ చేయించుకున్న తర్వాత చర్మానికి ఎండ తగలకూడదు. కాబట్టి, బయటకు వెళ్లినప్పుడు చర్మాన్ని వస్త్రంతో కవర్‌ చేసుకోవాలి. కుదరకపోతే సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవచ్చు. అలాగే చర్మంపై డస్ట్‌ పడకుండా జాగ్రత్త పడాలి.

ఈ ఫేషియల్‌ తర్వాత కనీసం 6 నుంచి 7 గంటల వరకు రోజువారీ స్కిన్‌ కేర్‌కు దూరంగా ఉండాలి. ఒక రోజు వరకు చర్మానికి బ్లీచ్‌ ఉపయోగించకూడదు.

కొన్ని సందర్భాల్లో జుట్టు ముఖానికి తగులుతుంది. దీనివల్ల కూడా ఫేషియల్‌ ప్రయోజనాలు దక్కవు. కాబట్టి, జుట్టు ముఖానికి తగలకుండా ముడి వేసుకోవాలి. అలాగే కొన్ని గంటల వరకు ఎలాంటి మేకప్‌ వేసుకోకూడదు.

పడుకునేటప్పుడు శాటిన్‌ పిల్లో కవర్లను ఉపయోగించడం మంచిది. ఇవి మృదువుగా ఉండడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు పలు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక కొన్ని రోజుల వరకు కెమికల్‌ పీల్‌ ఉపయోగించకపోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్