Alia Bhatt: నా బిడ్డ కోసం రోజూ ఇలా చేస్తున్నా.. మరి మీరు?!

పుస్తక పఠనం.. చాలామంది పిల్లలు దీనిపై ఆసక్తి చూపరు. పైగా ఈ టెక్నాలజీ యుగంలో పెద్దవాళ్లే ఇంటర్నెట్‌కు బానిసైపోతున్నారు. అలాంటిది పిల్లల గురించి వేరే చెప్పాలా? అయితే అరచేతిలో అంతర్జాలమున్నా.. పుస్తకాలు చదివే ఆసక్తిని పసి వయసు నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలున్నాయంటోంది బాలీవుడ్‌ అందాల తార ఆలియా భట్‌.

Published : 01 Jul 2024 15:38 IST

(Photos: Instagram)

పుస్తక పఠనం.. చాలామంది పిల్లలు దీనిపై ఆసక్తి చూపరు. పైగా ఈ టెక్నాలజీ యుగంలో పెద్దవాళ్లే ఇంటర్నెట్‌కు బానిసైపోతున్నారు. అలాంటిది పిల్లల గురించి వేరే చెప్పాలా? అయితే అరచేతిలో అంతర్జాలమున్నా.. పుస్తకాలు చదివే ఆసక్తిని పసి వయసు నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలున్నాయంటోంది బాలీవుడ్‌ అందాల తార ఆలియా భట్‌. అందుకే తన కూతురు రాహాకు రోజూ రాత్రి నిద్ర పోయే ముందు పిల్లల పుస్తకాలు చదివి వినిపిస్తుంటుంది. ఆ పుస్తకాల్లోని కథల్నీ చెబుతుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే తన చిన్నారిని ఒళ్లో పడుకోబెట్టుకొని పుస్తకం చదువుతూ కథ చెబుతోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుందీ అందాల అమ్మ. దీంతో ఈ ఫొటో వైరలవడమే కాదు.. తమ పిల్లలతో పుస్తకాలు చదివించే దిశగా ఎంతోమంది తల్లుల్లోనూ స్ఫూర్తి నింపింది.

పిల్లల కోసం పుస్తకం రాశా!

నటిగా, వ్యాపారవేత్తగానే కాదు.. రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకుంటోంది ఆలియా. తల్లీ పిల్లల కోసం ‘Ed-a-mamma’ పేరుతో మెటర్నిటీ, కిడ్స్‌ వేర్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ని నడుపుతోన్న ఈ చక్కనమ్మ.. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా ‘Ed finds a Home’ పేరుతో పిల్లల కథల పుస్తకాన్ని రాసింది. ఇదే పుస్తకాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ..
‘నా కొత్త సాహసయాత్ర మొదలైంది.. Ed-a-mamma వేదికగా నేను తీసుకొచ్చిన తొలి పుస్తకమిది. ఇంకా పిల్లల కోసం ఇలాంటి పుస్తకాలెన్నో రానున్నాయి. నా చిన్నతనంలో నేను చాలా కథలు విన్నా.. ఎప్పటికైనా నాలోని పసి మనసును బయటికి తీసి.. పిల్లల పుస్తకాలుగా మలచాలనుకున్నా. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది..’ అంటూ మురిసిపోయిందీ బాలీవుడ్‌ మామ్.

పగటి కలలు కనేదాన్ని!

ఇలా తోటి పిల్లల కోసం పుస్తకాలు రాయడమే కాదు.. తన కూతురు రాహాకు రోజూ రాత్రి పడుకునే ముందు పుస్తకాలు చదివి వినిపించడం, కథలు చెప్పడం చేస్తానంటోంది ఆలియా. తన చిన్నారికి కథ చెబుతోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘చిన్నతనంలో నేను కథలు వినడానికి ఇష్టపడేదాన్ని. కానీ పుస్తకాలు చదవడమంటే కష్టంగా ఫీలయ్యేదాన్ని. మా అమ్మ నాతో బలవంతంగా పుస్తకాలు చదివించేది. అయినా అయిష్టంతోనే చదివేదాన్ని. కానీ మా అక్క షాహీన్‌ నాకు పూర్తి భిన్నం. తనకు పుస్తకాల పురుగు అని బిరుదు ఇవ్వచ్చు. ఇక నేనెప్పుడూ పగటి కలలు కంటుండేదాన్ని. ఊహల్లోనే గడుపుతుండేదాన్ని. కానీ పుస్తక పఠనం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో పెద్దయ్యే క్రమంలో తెలుసుకున్నా. అందుకే నేను చేసిన ఈ పొరపాటు నా కూతురు చేయకూడదనే తనకు పసి వయసు నుంచే కథలు చదివి వినిపిస్తున్నా. ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు రాహాకు పిల్లల కథల పుస్తకాలు చదివి వినిపిస్తుంటా. అవి వింటూ తను హాయిగా నిద్రలోకి జారుకుంటుంది..’ అని చెబుతోంది ఆలియా.


పుస్తక పఠనం.. వారి భవితకు పెట్టుబడి!

ఆలియా చేస్తోన్న ఈ పని తన చిన్నారికి భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇలా పిల్లలకు పసి వయసు నుంచే పుస్తకాలు చదివి వినిపించడం, కథలు చెప్పడం ఒక రకంగా వారి భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే అంటున్నారు.

⚛ పుస్తక పఠనం పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది వారి విజ్ఞానాన్ని మరింతగా పెంచుతుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో తమ చుట్టూ జరుగుతోన్న విషయాల్ని పరిశీలించడానికి, నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

⚛ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం, కథలు చెప్పడం వల్ల.. ఆయా పదాల్ని పలికే విధానం వారు నేర్చుకోగలుగుతారట! అలాగే కొత్త పదాలు, వాటి అర్థాలు సులభంగా నేర్చుకునేందుకు, కొత్త విషయాల్ని గ్రహించేందుకు ఇదో అద్భుతమైన టూల్‌లా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

⚛ పసి వయసులో పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇలా కథలు చెప్పడం వల్ల తల్లీపిల్లల మధ్య అనుబంధం కూడా దృఢమవుతుందంటున్నారు నిపుణులు. ఇది పిల్లల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించి.. సురక్షితమైన భావనను కలిగిస్తుందట!

⚛ క్రమశిక్షణ అలవడాలన్నా, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలన్నా పిల్లలకు ఇలా కథలు, పుస్తకాలు చదివి వినిపించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

⚛ పిల్లల్లో ఊహాశక్తిని పెంచడానికీ పుస్తక పఠనం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఇదే భవిష్యత్తులో వారు క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రేరేపిస్తుందట!

⚛ ఇలా పెద్దలు కథలు చెప్పడం, పిల్లలు పుస్తకాల్లో కథల తాలూకు బొమ్మలు చూడడం వల్ల.. చిన్నారుల్లో భాషాపరమైన సమస్యలూ తొలగిపోతాయని, అలాగే కమ్యూనికేషన్‌ కూడా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఇది పరోక్షంగా వారిలో సామాజిక నైపుణ్యాల్నీ మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

⚛ ఇలాంటి కథల ద్వారా పిల్లలు మంచేదో, చెడేదో తెలుసుకోగలుగుతారు. తద్వారా వారిలో నైతికత అలవడుతుంది. అలాగే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

⚛ ఇలా చిన్నతనం నుంచి పుస్తకాలు/కథలు చదివి వినిపించడం వల్ల పిల్లలకూ పెరిగే క్రమంలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది వారికి వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా మేలు చేస్తుందంటున్నారు.

⚛ పుస్తక పఠనం వల్ల భావోద్వేగాల్ని అదుపు చేసుకునే గుణం కూడా చిన్నారులకు అలవడుతుందట! తద్వారా ఎలాంటి పరిస్థితికి ఎలా స్పందించాలో తెలుసుకోగలుగుతారు. అలాగే సమస్యలొచ్చినా స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు కూడా!

⚛ ఇతిహాసాలు, చారిత్రక కథలు.. వంటి పుస్తకాల్ని చిన్నారులకు చదివి వినిపించడం వల్ల.. నాటి కాలానికి సంబంధించిన విషయాలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పైనా పిల్లలు పట్టు పెంచుకోగలుగుతారంటున్నారు నిపుణులు.

ఇలా ఈ ప్రయోజనాలన్నీ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే! కాబట్టి ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా.. కాస్త తీరిక చేసుకొని పడుకునే ముందు ఓ అరగంట పిల్లలతో గడపండి. వారికి కథలు చెప్పండి.. పుస్తకాలు చదివి వినిపించండి.. తద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన వారవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్