Renu Desai: మీకు కుటుంబాల్లేవా? ఇకనైనా వీటిని ఆపండి!

ఏళ్లు గడుస్తున్నా, తరాలు మారుతున్నా.. ఈ సమాజంలో మహిళలంటే చిన్నచూపు ఇప్పటికీ తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా నిందలూ వారే భరించాల్సి వస్తుంది. మహిళలపై ఇలాంటి విమర్శలకు ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మారింది.

Published : 26 Jun 2024 22:00 IST

(Photos: Instagram)

ఏళ్లు గడుస్తున్నా, తరాలు మారుతున్నా.. ఈ సమాజంలో మహిళలంటే చిన్నచూపు ఇప్పటికీ తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా నిందలూ వారే భరించాల్సి వస్తుంది. మహిళలపై ఇలాంటి విమర్శలకు ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మారింది. ఇక సెలబ్రిటీల విషయంలో ఇలాంటి విమర్శలు, ట్రోల్స్‌కు లెక్కే లేదు. ఇటీవలే తనపై వచ్చిన ఇలాంటి విమర్శలు, మీమ్స్‌కు తనదైన రీతిలో జవాబిచ్చింది నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌. తనకెదురైన ప్రతి సవాలునూ ధైర్యంగా ఎదుర్కొనే సానుకూల దృక్పథమున్న ఆమె.. ఆధునిక యుగంలో ఉన్నా ఆడవారిని చిన్నచూపు చూసే ధోరణి చాలామంది మార్చుకోవట్లేదంటూ విచారం వ్యక్తం చేసింది.

విడాకుల అనంతరం నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు దూరంగా ఉంటూనే.. ఒంటరి తల్లిగా తన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది రేణూ దేశాయ్‌. బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆమె.. ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పోస్టులు, ఫొటోలు, వీడియోల రూపంలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విమర్శల్నీ ఎదుర్కొంటుందామె. అయితే వీటికీ తనదైన రీతిలో చెక్‌ పెడుతుంటుంది రేణు. అలాంటి రెండు సంఘటనలు ఆమెకు ఇటీవలే ఎదురయ్యాయి.

అసలేం జరిగిందంటే..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. ఇటీవలే తన ప్రమాణ స్వీకారం ముగిశాక.. తన సతీమణి అనా లెజినొవా, పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో కలిసి సరదాగా ఓ ఫొటో దిగారు. దాన్ని జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరలైంది. దీనికి ‘క్యూట్‌ ఫొటో’ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు నెగెటివ్‌గా స్పందించారు. ఆ ఫొటోను ఉపయోగించి రేణూ దేశాయ్‌ను అవమానపరిచేలా కొందరు మీమ్స్‌ రూపొందించారు. దీంతో వారిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు సమాజానికే అత్యంత భయంకరమంటూ.. ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

మీకూ ఓ కుటుంబం ఉందిగా..!

‘ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్ట్ చేస్తానని మీమ్స్‌, జోక్స్‌ పేల్చే భయంకరమైన వ్యక్తులారా.. మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ అకౌంట్లను సులభంగా యాక్సెస్‌ చేసి, విచక్షణా రహితంగా ప్రవర్తించే వ్యక్తుల తీరును చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధను అనుభవించింది. ఆమె కన్నీళ్లు.. కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ (పవన్‌-అనా పిల్లలు) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వందసార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను..’ అంటూ ఎమోషనల్‌గా స్పందించింది రేణు.

ఇకనైనా మారండి!

ఇప్పుడే కాదు.. ఇటీవలే పవన్‌ కల్యాణ్‌ ఏపీ ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా ప్రమాణం చేసినప్పుడూ రేణూదేశాయ్‌ని విమర్శిస్తూ కొందరు పోస్టులు పెట్టారు. పవన్‌ కల్యాణ్‌ నుంచి విడిపోవడం తన దురదృష్టమంటూ కామెంట్లు చేశారు. దీనికీ తనదైన రీతిలో స్పందిస్తూ.. నెటిజన్ల నోళ్లు మూయించింది రేణు. అవే స్క్రీన్‌షాట్లను ఇన్‌స్టాలో పంచుకుంటూ..

‘నేను దురదృష్టవంతురాలిని అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. అసలు నేను ఎలా దురదృష్టవంతురాలినో, ఏ విషయంలో దురదృష్టవంతురాలినో మీరే చెప్పాలి. దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది. నా భర్త వేరే పెళ్లి చేసుకుంటే, కొంతమంది వ్యక్తులు ఏళ్లుగా అలా కామెంట్‌ చేయడం భరించలేకపోతున్నా. ఆ మాటలు వినీ వినీ విసుగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు? నా జీవితంలో ఇప్పటివరకూ నాకు దక్కిన ప్రతి విషయానికీ నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నా. నాకు లేని వాటి గురించి నేనెప్పుడూ బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ, పురుషులు దురదృష్టవంతులు కాదని ఈ సమాజం తెలుసుకుంటే చాలు. మనం 2024లో ఉన్నాం. ఒకరి అదృష్టాన్ని విడాకులతో ముడిపెట్టడం ఇకనైనా ఆపండి. ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని మనిషిగా చూడడం నేర్చుకోండి. వారి కృషి, ప్రతిభ ఆధారంగా గుర్తింపునివ్వండి. గతాన్ని తవ్వుకుంటూ చేసే ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి..’ అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది రేణూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్