అందానికి... మనసు మంత్రం!

ముఖం మీద మొటిమలొస్తే వెతికి వెతికి క్రీములు కొంటాం. తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. హార్మోనుల్లో అసమతుల్యత, కాలుష్యం, క్రీములు పడకపోవడమే ఇందుకు కారణం అనుకుంటాం.

Updated : 03 Jul 2024 13:23 IST

ముఖం మీద మొటిమలొస్తే వెతికి వెతికి క్రీములు కొంటాం. తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. హార్మోనుల్లో అసమతుల్యత, కాలుష్యం, క్రీములు పడకపోవడమే ఇందుకు కారణం అనుకుంటాం. ఒత్తిడి సైతం అందానికి హాని చేయగలదని తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదూ! మాళవిక జైన్‌కీ అలాగే అనిపించింది. దాని గురించి తెలుసుకోవడమే కాదు... దేశంలో తొలి సైకోడెర్మటాలజీ సంస్థనీ ప్రారంభించింది.

మాళవిక లిటిగేషన్‌ లాయర్‌. ఈమెది దిల్లీ. లాక్‌డౌన్‌లో అందరిలాగే ఆమె కూడా ఇంటికే పరిమితమైంది. ఆ సమయంలో తన కజిన్‌కి ముఖమంతా మొటిమలు. ఇంటి చిట్కాలు, క్రీములు ఎన్ని ప్రయత్నించినా పనిచేయలేదు. డెర్మటాలజిస్ట్‌లను కలిసినా లాభం లేకపోయింది. అప్పుడు ఎవరో ‘ఒత్తిడి, ఆందోళన బాగా పెరిగినట్టున్నాయి’ అన్నారట. మొదట ఆశ్చర్యపోయినా ఆ అమ్మాయి నిపుణులను సంప్రదించింది. ఓవైపు చికిత్స తీసుకుంటూనే ఒత్తిడి తగ్గించుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. ఆశ్చర్యంగా మొటిమలు తగ్గుముఖం పట్టాయి. మానసిక సమస్యలు చర్మంపై ప్రభావం చూపడం మాళవికకి ఆసక్తిని కలిగించింది. అందుకే దానిపై పరిశోధన చేసింది. మానసిక సమస్యలు యాక్నేనే కాదు సొరియాసిస్, ఎగ్జిమా, రోజాసియా వంటి అనేక చర్మ సమస్యలకూ దారి తీస్తాయని తెలుసుకుంది. నిపుణుల ద్వారా ‘సైకోడెర్మటాలజీ’ గురించి తెలుసుకుని దానిపై అవగాహన తెచ్చుకుంది. పట్టు సాధించాక లాయర్‌ వృత్తిని పక్కనపెట్టి 2023లో ‘సెరెకో’ ప్రారంభించింది.

సెరెకో... దేశంలోనే తొలి సైకోడెర్మటాలజీ సంస్థ. అంటే ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తూనే చర్మానికి మేలు చేసే సంస్థ. దీనికోసం దేశవిదేశాల్లోని నిపుణులను సంప్రదించింది మాళవిక. సహజ పదార్థాలను ఉపయోగించి స్క్రబ్స్, బాడీ ఆయిల్స్, టోనర్లు, క్రీములు, సన్‌స్క్రీన్‌ వగైరా రూపొందించింది. గమ్మీస్‌ తరహాలో కామింగ్‌ క్యాండీలనూ తీసుకొచ్చింది. వీటిలోని పరిమళాలు మనసును తేలికపరిస్తే... తయారీకి వాడిన పదార్థాలు చర్మాన్ని సంరక్షిస్తాయన్నమాట. తన ఉత్పత్తులకు పేటెంట్‌ హక్కుల కోసమూ దరఖాస్తు చేసుకుంది మాళవిక. ఈ ప్రొడక్ట్స్‌ని సొంత వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్‌ వేదికల్లోనూ అమ్ముతోంది. ఇప్పటివరకూ యాభైవేలకు పైగా ఉత్పత్తులను అమ్మిందట. ‘లాయర్‌గా చేస్తున్నా వ్యాపారంపైకి మనసు మళ్లేది. దీంతో చాలా సంస్థలకు మెంటార్‌గానూ పనిచేశా. సైకోడెర్మటాలజీ నా దారిని మళ్లించింది. కొవిడ్‌ తరవాత మానసిక ఆరోగ్యంపై అందరిలోనూ ముఖ్యంగా జెన్‌-జీ తరాలకు అవగాహన ఎంతగా పెరిగిందో తెలుసుగా! అదే మమ్మల్ని ఈ తరాలకు త్వరగా చేరువ చేసింది. సైడ్‌ఎఫెక్ట్స్‌లేని సహజ పదార్థాలను ఉపయోగించడమూ మాకు కలిసొచ్చింది’ అంటోంది మాళవిక. త్వరలో అరోమా థెరపీ క్లినిక్‌లనీ ప్రారంభించబోతోందీమె. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్