వందల ఏళ్ల కథలో ‘మలుపు’ ఇది...

సకినాలు, మురుకులు అని రకరకాల పేర్లతో బియ్యం పిండితో చేసే ఈ చిరుతిండి మనందరికీ సుపరిచితమే. అయితే, ఈ మురుకుల తయారీనే కేరళలోని మన్నాడియార్‌ కమ్యూనిటీలోని ఐదు వందల కుటుంబాలకు ఆదాయ మార్గమైంది. తరతరాల నుంచీ వస్తోన్న ఈ వారసత్వ నైపుణ్య సంపదే... అక్కడి మహిళలను తిరుగులేని శ్రామికశక్తిగా మార్చింది.

Published : 01 Jul 2024 04:25 IST

సకినాలు, మురుకులు అని రకరకాల పేర్లతో బియ్యం పిండితో చేసే ఈ చిరుతిండి మనందరికీ సుపరిచితమే. అయితే, ఈ మురుకుల తయారీనే కేరళలోని మన్నాడియార్‌ కమ్యూనిటీలోని ఐదు వందల కుటుంబాలకు ఆదాయ మార్గమైంది. తరతరాల నుంచీ వస్తోన్న ఈ వారసత్వ నైపుణ్య సంపదే... అక్కడి మహిళలను తిరుగులేని శ్రామికశక్తిగా మార్చింది.

ఛాయ్‌తో పాటు సకినాలు... తెలంగాణ వాసుల ఫేవరిట్‌ కాంబినేషన్‌. పండగ ఏదైనా సరే... చక్కిడాలు మాత్రం కామన్‌గా ఉండాల్సిందే అంటారు ఆంధ్రా జనం. అంతగా మనం వాటి రుచికి అలవాటు పడ్డాం. అయితే, కేరళలోని పాలక్కాడ్‌లో చేసే ‘కాయీ మురుక్కు’లు మాత్రం ఒకింత ప్రత్యేకమే. ఎందుకంటే, చేత్తోనే మురుకులను ప్రత్యేకమైన మెలికల ఆకృతిలోకి మార్చే కళ వారి సొంతం. అంతేకాదు, అందులో వాడే పిండి, దాని నిష్పత్తులను బట్టి రకరకాలుగా వీటిని తయారుచేస్తుంటారు. కాయీ అంటే చేయి అని, మురుక్కు అంటే మెలికలు అనీ అర్థం. నిజానికి ఈ ‘మురుక్కు’ అనేది తమిళపదం. ఒకప్పుడు తమిళనాడు నుంచి ఇక్కడకు వలస వచ్చిన మన్నాడియార్‌ కమ్యూనిటీ వాళ్లకు పాలక్కాడ్‌ రాజు భూములను ఇచ్చాడట. ప్రస్తుతం వారిలో ఎక్కువమంది వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. అయితే, మహిళలు మాత్రం 300 ఏళ్లుగా మురుకులు తయారు చేస్తున్నారు.

బియ్యం, మినప్పిండి, జీలకర్ర, ఉప్పు, నువ్వులు, నెయ్యి, కారం వంటి పదార్థాలతో వీటిని చేస్తారు. ఒక్కొక్కరు రోజుకు సరాసరిగా 400 నుంచి 500 మురుకుల వరకూ తయారు చేస్తారట. ఇవి సుమారు 40రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు... మంగళంకున్ను, చెర్పులస్సేరి, కొల్లెంగోడ్, కరిప్పోడ్, కొడువాయూర్‌ వంటి చోట్లకూ తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఈ మహిళా శ్రామికశక్తే అక్కడి కుటుంబాల ఆదాయాన్ని మరింత పెంచిందట. ‘‘రోజుకి 200 మురుకులు చేసేసరికి వెన్నునొప్పి, కండరాల నొప్పులూ వస్తుంటాయి. కానీ, ఇది మా కుటుంబ వ్యాపారం. ఇదే మా ప్రథమ ఆదాయ మార్గం కూడా. మరి దీన్ని మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు?’’ అంటారు మన్నాడియార్‌ కమ్యూనిటీకి చెందిన మహిళలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్