ఈ డైట్‌తో.. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా..!

విపరీతమైన బద్ధకం, అలసత్వం.. వీటివల్ల మనకు తెలియకుండానే శరీరం నీరసించిపోతుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండడానికి బదులు నిస్సారంగా గడిపేయాల్సి వస్తుంది. అంతేకాదు.. బద్ధకం లేనిపోని అనారోగ్యాలను కూడా....

Published : 16 Jun 2023 15:47 IST

విపరీతమైన బద్ధకం, అలసత్వం.. వీటివల్ల మనకు తెలియకుండానే శరీరం నీరసించిపోతుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండడానికి బదులు నిస్సారంగా గడిపేయాల్సి వస్తుంది. అంతేకాదు.. బద్ధకం లేనిపోని అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో- రోజంతా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఓ ప్రత్యేకమైన డైట్, ఎక్సర్‌సైజ్ ప్లాన్ అవసరమని సూచిస్తున్నారు. మరి అదెలా ఉండాలో చూద్దాం రండి..

రోజును ఇలా ప్రారంభించేద్దాం!

ఆరోగ్యకరంగా రోజును ప్రారంభిస్తేనే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలం.. ఇంటి పనులు చురుగ్గా చేసుకోగలం.. ఇందుకోసం నిద్ర లేచాక మనం తీసుకునే తొలి ఆహారం శరీరానికి శక్తినిచ్చేదై ఉండాలి. ముఖ్యంగా..

మలబద్ధకంతో బాధపడే వారు తొలి ఆహారంగా ఒక అరటిపండును తీసుకోవడం మంచిది.

ఇక మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారు రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదంపప్పులు తీసుకోవాల్సి ఉంటుంది.

పీఎంఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలున్న వారు రాత్రంతా నీటిలో నానబెట్టిన కిస్‌మిస్‌లను తీసుకోవాలి.

అల్పాహారంలో ఇవి!

అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తుంది.. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఫలితంగా రోజంతా యాక్టివ్‌గా ఉండచ్చు. ఇందుకోసం..

పోహా, ఉప్మా, ఇడ్లీ, దోసె, పరాఠా, కోడిగుడ్లు, పావ్‌భాజీ.. వంటివి తీసుకోవాలి.

వారానికోసారి వడ, పూరీ.. తినచ్చు.

ఇది మామిడిపండ్ల సీజన్ కాబట్టి ఓ గ్లాసు మ్యాంగో మిల్క్‌షేక్‌ చేసుకొని తాగితే మరీ మంచిది.

ఆ కోరికను అదుపు చేసుకోవాలంటే..!

శరీరం డీహైడ్రేషన్‌కు గురవడం వల్ల చక్కెర తీసుకోవాలన్న కోరిక పెరుగుతుంది. మరీ ముఖ్యంగా లంచ్‌ తర్వాత ఈ క్రేవింగ్స్‌ ఎక్కువవుతాయి. అలాగని అన్నం తిన్నాక ఏది పడితే అది తీసుకోవడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈ కోరికను కట్టడి చేయాలంటే భోజనానికి ముందు (మిడ్‌ మార్నింగ్‌ స్నాక్‌) నిమ్మరసం, ఉసిరి రసం, కోకం షర్బత్.. వంటివి తీసుకోవచ్చు.. అది కాదంటే ఏదైనా పండు తినచ్చు. ఈ జ్యూసుల్లో విటమిన్‌ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఐరన్‌ను గ్రహించే శక్తినిస్తుంది. తద్వారా హెమోగ్లోబిన్‌ స్థాయులూ తగ్గకుండా కాపాడుకోవచ్చు.


‘లంచ్‌’లో ఏముండాలంటే..!

మధ్యాహ్న భోజనంలో భాగంగా..

పప్పన్నం/రోటీ-సబ్జీ (కాయగూరలన్నింటినీ కలిపి చేసే కూర), ఏదైనా చట్నీ. బి-12, డి విటమిన్‌ లోపమున్న వారికి ఇది మంచి ఆహారం. అలాగే ఇవి తింటే భోజనం తర్వాత ఆయాసం దరిచేరదు.

వేడి ఆవిర్లు, కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్‌ సమస్యలున్న వారు.. రోటీ, స్వీట్‌ బనానా మిల్క్ (అరటిపండు, చక్కెర, పాలతో చేసే ప్రత్యేకమైన స్వీట్‌) తీసుకోవచ్చు.

టీ, కాఫీలకు బదులుగా..!

సాయంత్రం కాగానే చాలామంది శారీరక శక్తిని కోల్పోయి నీరసించి పోతారు. ఇది మానసిక ఆరోగ్యం పైనా ప్రభావం చూపుతుంది. ఇలాంటప్పుడు ఉత్తేజం కోసం కాఫీ, టీలకు బదులు అత్యవసర కొవ్వులు, ఖనిజాలు అధికంగా లభించే పదార్థాలను స్నాక్స్‌గా తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఎండుకొబ్బరి-బెల్లం, జీడిపప్పులు-బెల్లం.. కాంబినేషన్స్‌ తీసుకోవచ్చు.

గోధుమపిండితో చేసే బిస్కట్లు, మరమరాలు, మిక్చర్, చెగోడీలు.. వంటివి ట్రై చేయచ్చు.

‘డిన్నర్‌’ త్వరగా చేసేయాలి!

రాత్రి భోజనం ఎంత సులభంగా జీర్ణమయ్యేదైతే అంత మంచిది. ఈ క్రమంలో అత్యవసరమైన, అత్యవసరం కాని అమైనో ఆమ్లాలు, ఫైబర్‌.. వంటి పోషకాలు కలగలిసిన పప్పులు తీసుకుంటే పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో కిచిడీ/అన్నం-పప్పు/ఫ్రైడ్‌ రైస్‌.. వీటితో పాటు ఉడికించిన ఒక గుడ్డు లేదంటే పనీర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక డిన్నర్‌ మరీ ఆలస్యంగా కాకుండా త్వరగా చేసేయాలి.

పడుకునే ముందు..!

రాత్రి పూట పడుకోవడానికి ముందు పసుపు పాలు తీసుకోవడం చాలా మంచిది. ఇది సుఖ నిద్రకు ప్రేరేపిస్తుంది.. రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది.

నిద్రలేమి, అరుగుదల సమస్యలతో బాధపడే వారు ఈ పాలలో జాజికాయ పొడిని కలుపుకోవాల్సి ఉంటుంది.

కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, ఎముకలు/కండరాలు బలహీనంగా ఉన్న వారు ఈ పాలలో అల్లం పొడిని కలుపుకోవాలి.

ఇక చర్మ, జుట్టు ఆరోగ్యం కోసం పసుపు పాలలో ఒకట్రెండు చిటికెల కుంకుమ పువ్వు వేసుకొని తాగితే ఫలితం ఉంటుంది.

అరగంట వ్యాయామం!

రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండడానికి కేవలం ఆహారం తీసుకుంటే సరిపోదు.. వ్యాయామాలూ చేయాల్సిందే! ఇందుకోసం రోజూ అరగంట సమయం కేటాయించాలి.

రోజూ ఐదు సూర్య నమస్కారాలను సాధన చేయడం మంచిది. వీటిని అన్ని వయసుల వారూ చేయచ్చు.

బలహీనంగా ఉన్న వారు బలం కోసం స్క్వాట్స్‌, లాంజెస్‌ ప్రాక్టీస్‌ చేయాలి.

యోగా సాధన చేయాలి. ఇది కూడా అన్ని వయసుల వారికీ మంచి ఎక్సర్‌సైజ్.


ఇవి కూడా!

పగటిపూట కునుకు తీసే వారు అరగంటకు మించకుండా చూసుకోండి.

అదే పనిగా మొబైల్‌తో గడపడం మానుకోండి.. నిర్ణీత వ్యవధుల్లో కనీసం అరగంట పాటైనా దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.. ఈ సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు.

ఒక చోట కూర్చొని భోజనం చేయడం మంచిది. ఈ క్రమంలో నెమ్మదిగా నములుతూ తినడం వల్ల దాని రుచిని ఆస్వాదించచ్చు.. వాటిలోని పోషకాలూ శరీరానికి అందుతాయి.

ఇలా రోజూ ఒక క్రమ పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తే ఇటు శారీరకంగా, అటు మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్