మన మహిళా ఎంపీల.. ‘పార్లమెంట్ ఫ్యాషన్’ స్టైల్!

భారతీయత అంటే.. సంప్రదాయం, నిండుదనం! అందుకే హుందాతనం ఉట్టిపడేలా దుస్తులు ధరిస్తుంటారు భారతీయ వనితలు. తాజాగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కొందరు మహిళా ఎంపీలూ ఇందుకు మినహాయింపు కాదు.

Updated : 28 Jun 2024 21:34 IST

భారతీయత అంటే.. సంప్రదాయం, నిండుదనం! అందుకే హుందాతనం ఉట్టిపడేలా దుస్తులు ధరిస్తుంటారు భారతీయ వనితలు. తాజాగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కొందరు మహిళా ఎంపీలూ ఇందుకు మినహాయింపు కాదు. సినీ స్టార్లైనా, పొలిటికల్‌ ఇమేజ్‌ ఉన్నా, నవతరానికి ప్రతీకలైనా.. ఇలా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినా సంప్రదాయానికే విలువిస్తున్నారు. చీర, చుడీదార్‌.. వంటి నిండైన దుస్తుల్లో కనిపిస్తూ.. తమదైన డ్రస్సింగ్‌ స్టైల్‌ని చాటుకుంటున్నారు. మరి, తమదైన ప్రత్యేకమైన ఆహార్యంతో సందడి చేసే మన మహిళా ఎంపీల 'పార్లమెంట్ ఫ్యాషన్’ స్టైల్ గురించి తెలుసుకుందాం రండి..

‘తలైవి’ శారీ స్టైల్!

సింపుల్‌ డ్రస్సింగ్‌తోనే హుందాతనాన్ని ప్రదర్శించడంలో కంగనను మించిన వారు లేరని చెప్పచ్చు. ఇందుకు ఆమె పార్లమెంట్‌ డ్రస్సింగ్‌ స్టైలే ప్రత్యక్ష ఉదాహరణ! పబ్లిక్‌ ఈవెంట్లకు ఎక్కువగా చీరల్ని ఎంచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఎంపీ అయ్యాకా ఇదే ఫ్యాషన్‌ని ఫాలో అయిపోతోంది. అది కూడా పేస్టల్‌ రంగుల్లో రూపొందించిన షిఫాన్‌, కాటన్‌, లినెన్.. వంటి సింపుల్‌ శారీస్‌తో కట్టిపడేస్తోంది కంగన. ఇలా తన చీరలకు వి-నెక్‌, పఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ల్ని జత చేస్తూ సింప్లీ సూపర్బ్‌ అనిపిస్తోంది. పోనీ హెయిర్‌స్టైల్‌, తక్కువ మేకప్‌, మెడలో చిన్న ముత్యాల హారం.. ఇలా యాక్సెసరీస్‌నీ సింపుల్‌గానే ఎంచుకుంటోందీ సెలబ్రిటీ ఎంపీ. ఇలా తన ట్రెడిషనల్‌ లుక్‌కు.. గాగుల్స్‌, ఫ్యాషనబుల్‌ హ్యాండ్‌ బ్యాగ్‌తో హంగులద్దుతూ.. స్టైలిష్‌గానూ మెరిసిపోతోన్న తలైవి లుక్స్‌కు ఎంతోమంది ఫిదా అయిపోతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైంది కంగన.


కాటన్‌ చీరలతో కట్టిపడేస్తోంది!

కాటన్‌ చీరలు నిండుదనాన్ని అందించడమే కాదు.. హుందాగానూ కనిపించేలా చేస్తాయి. అందుకే పార్లమెంట్‌ సెషన్స్‌ కోసం తానూ కాటన్‌ చీరల్ని ఎంచుకుంటున్నానంటోంది నటి, హూగ్లీ ఎంపీ రచనా బెనర్జీ. మామూలుగానే చీరకట్టును ఇష్టపడే ఆమె.. ‘రచనా క్రియేషన్స్‌’ పేరుతో ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌నీ నడుపుతోంది. ఈ వేదికగా విభిన్న రకాల చీరల్ని రూపొందిస్తోందీ బ్యూటీ. ఇక పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే క్రమంలో తాను ధరించిన కాటన్‌ చీరలు ఆమె అందాన్ని మరింతగా పెంచుతున్నాయని చెప్పచ్చు. ఈ క్రమంలో ఎక్కువగా చెక్స్‌, జామెట్రిక్‌ ప్రింట్స్‌, లినెన్‌, పోచంపల్లి, ఇకత్‌.. తదితర చీరల్ని ఎంచుకుంటోందీ చక్కనమ్మ. ఇక వీటికి లాంగ్‌ స్లీవ్స్‌, త్రీబైఫోర్‌ స్లీవ్స్‌, హై-నెక్‌, కాలర్‌ నెక్‌.. తదితర డిజైనర్‌ బ్లౌజుల్ని జత చేస్తూ హుందాగా కనిపించేస్తుంది రచన. అంతేకాదు.. సింపుల్‌ హ్యాండ్‌బ్యాగ్‌, బాబ్డ్‌ హెయిర్‌స్టైల్‌, గాగుల్స్‌తో స్టైలిష్‌గానూ మెరిసిపోతుందీ బ్యూటీ. ఇలా అటు సంప్రదాయాన్ని, ఇటు స్టైల్‌ని.. రెండింటినీ రంగరించి మరీ తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని ప్రదర్శిస్తోందీ బెంగాలీ బ్యూటీ.


సాదాసీదాగా ఉండడమే నాకిష్టం!

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి అయినా ఇసుమంతైనా గర్వం లేకుండా సాదాసీదాగా వ్యవహరిస్తుంటారు డింపుల్‌ యాదవ్‌. తన ఆహార్యంలోనూ ఇదే తీరును ప్రదర్శిస్తుంటారామె. ఇందుకు ఆమె ధరించే దుస్తులే నిదర్శనం! మెయిన్పురి ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన తరుణంలోనూ ఇదే సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకుంటున్నారామె. బ్లూ, గ్రే, వైట్‌, బ్లాక్‌, రెడ్‌ కలర్‌ శారీస్‌లోనే ఎక్కువగా దర్శనమిచ్చే డింపుల్‌.. త్రీబైఫోర్త్‌, హై-నెక్‌ బ్లౌజుల్ని ఎంచుకుంటారు. నుదుటన బొట్టు, సింపుల్‌ హెయిర్‌స్టైల్స్‌తో కట్టిపడేసే ఈ మిసెస్‌ అఖిలేష్‌.. పష్మీనా శాలువాతో తన లుక్‌ని పూర్తి చేస్తారు. ఒక చేతిలో హ్యాండ్‌బ్యాగ్‌, మరో చేతిలో ఫోన్, ఐడీ కార్డుతో తనదైన స్టైల్‌లో లోక్‌సభలోకి అడుగుపెడతారామె.


మహువా.. ది ఫ్యాషన్‌ క్వీన్!

తన పవర్‌ఫుల్‌ స్పీచ్‌లతోనే కాదు.. అందమైన డ్రస్సింగ్‌తోనూ మాయ చేస్తుంటారు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా. ఎక్కువగా చేనేత చీరలకే ఓటేసే ఆమె.. తాను ఎంచుకునే ఒక్కో చీర కథనూ సోషల్‌ మీడియాలో పోస్టుల రూపంలో షేర్‌ చేస్తుంటారు. ఇలా ఆయా చేనేత కళాకారుల్ని, వారి పనితనాన్నీ ప్రోత్సహిస్తుంటారామె. ప్లెయిన్‌, ఫ్లోరల్‌ డిజైన్స్‌, స్ట్రైప్స్‌, జామెట్రిక్‌ ప్రింట్స్‌తో కూడిన కాటన్‌, లినెన్‌, సిల్క్‌, పోచంపల్లి, ఇకత్‌.. వంటి చీరల్లో ఎక్కువగా దర్శనమిస్తుంటారామె. వీటికి ఫుల్‌ స్లీవ్స్‌, హైనెక్‌, కాలర్‌ నెక్ బ్లౌజుల్ని జతచేస్తూ.. హుందాగా, నిండుదనంతో కనిపించేస్తుంటారు మహువా. నుదుటన బిందీ, ఎక్కువగా వదులైన హెయిర్‌స్టైల్‌లోనే కనిపించే ఈ బ్యూటిఫుల్‌ ఎంపీ లుక్‌.. గాగుల్స్‌ లేకుండా పూర్తి కాదనే చెప్పాలి. ఇలా తన అటైర్‌కు తగినట్లుగా మేకప్‌తో తన లుక్‌ని మరింత హైలైట్‌ చేస్తారామె. ఫ్యాషన్ పైనా పట్టున్న మహువా.. గతంలో పలు పత్రికల కవర్‌ పేజీల పైనా మెరిశారు.


అవే నాకు నిండుదనాన్నిస్తాయి!

ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌ కూతురిగానే కాదు.. తనదైన రాజకీయ చతురతతో పాలిటిక్స్‌లో రాణిస్తున్నారు సుప్రియా సూలే. బారామతి ఎంపీ అయిన ఆమె.. సందర్భమేదైనా భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుకే ప్రాధాన్యమిస్తుంటారు. పట్టు, సిల్క్‌, కాటన్‌ చీరల్ని ఎక్కువగా ఇష్టపడే ఆమె.. పార్లమెంట్‌ సమావేశాలకూ ఇదే సింపుల్ డ్రస్సింగ్‌ స్టైల్‌తో కట్టిపడేస్తుంటారు. ఎక్కువగా డబుల్‌ కలర్‌ శారీస్‌ని కట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు సుప్రియ. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతానే ఇందుకు సాక్ష్యం! ఇక వీటికి జతగా హైనెక్‌, ఫుల్‌ స్లీవ్స్‌ బ్లౌజుల్ని.. అందులోనూ కాంట్రాస్ట్ కలర్స్‌ని మ్యాచ్‌ చేస్తుంటారామె. పోనీ హెయిర్‌స్టైల్‌తో కనిపించే సుప్రియ.. నుదుటన బొట్టు, మెడలో నల్లపూసలు.. ఇవే తనకు నిండుదనాన్ని అందిస్తాయని చెబుతారు. అయితే అరుదుగా చుడీదార్స్‌లోనూ దర్శనమిస్తుంటారీ మహిళా ఎంపీ.


‘డ్రీమ్‌గర్ల్‌’.. ఫ్యాషన్‌ మ్యాజిక్!

నటనతోనే కాదు.. రాజకీయ చతురతతోనూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు డ్రీమ్‌గర్ల్‌ హేమామాలిని. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులోనే ఎక్కువగా మెరిసిపోయే ఈ అలనాటి అందాల తార.. లోక్‌సభలోనూ ఇదే చీరకట్టుతో దర్శనమిస్తుంటారు. మథుర నియోజకవర్గ ఎంపీ అయిన ఆమె.. పట్టు, ఫ్యాన్సీ సిల్క్‌ చీరల్నే ఎక్కువగా ఎంచుకుంటుంటారు. వీటికి పఫ్‌ స్లీవ్స్‌ ఉన్న బ్లౌజుల్ని జత చేస్తుంటారు. అప్పుడప్పుడూ చీరకు మ్యాచింగ్‌గా డిజైనర్‌ బ్లౌజుల్నీ ధరిస్తుంటారు హేమ. ఇక చీరకు తగినట్లుగా విభిన్న హెయిర్‌స్టైల్స్‌ వేసుకోవడానికి ఇష్టపడే ఈ బ్యూటిఫుల్‌ ఎంపీ.. పాపిట్లో సింధూరం, నుదుటన బొట్టు, మెడలో నల్లపూసలు మాత్రం అస్సలు మిస్సవరు. బంగారం, డైమండ్‌ జ్యుయలరీనీ కొన్ని అవుట్‌ఫిట్స్ పైకి మ్యాచ్‌ చేస్తూ మరింత ట్రెడిషనల్‌గా మెరిసిపోతుంటారీ బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌. అందుకే చాలామంది మహిళలు హేమను ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ పిలుచుకుంటారు. ఇక చాలా అరుదుగా చుడీదార్స్‌ కూడా ధరిస్తుంటారీ బాలీవుడ్‌ క్వీన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్