గిటార్‌తో ‘మాయ’ చేస్తూ..!

ప్రతి ఏటా జరిగే ‘అమెరికా గాట్‌ ట్యాలెంట్‌’ రియాల్టీ షో కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. ఇందులో ఎందరో కళాకారులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొంతమంది ఏకంగా న్యాయనిర్ణేతలనే ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవలే అలాంటి సంఘటన చోటు చేసుకుంది.

Published : 03 Jul 2024 12:15 IST

(Photos: Instagram)

ప్రతి ఏటా జరిగే ‘అమెరికా గాట్‌ ట్యాలెంట్‌’ రియాల్టీ షో కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. ఇందులో ఎందరో కళాకారులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొంతమంది ఏకంగా న్యాయనిర్ణేతలనే ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవలే అలాంటి సంఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 11 ఏళ్ల మాయా నీలకంఠన్‌ తన గిటార్ ప్రదర్శనతో జడ్జీలను సైతం ఆశ్యర్యపరిచింది. దాంతో ఆ ప్రదర్శనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను పంచుకుంటూ మాయను ‘రాక్‌ దేవత’గా కొనియాడారు. ఈ క్రమంలో మాయ ప్రదర్శనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

సంప్రదాయ దుస్తుల్లో..

ఏటా జరిగే ‘అమెరికా గాట్‌ ట్యాలెంట్‌’ రియాల్టీ షోలో వివిధ కళాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన గిటారిస్ట్‌ మాయా నీలకంఠన్‌ తన మొదటి ప్రయత్నంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ అమ్మాయి ‘పపా రోచ్’ పాపులర్‌ ఆల్బమ్‌ ‘లాస్ట్‌ రిసార్ట్‌’కు కర్ణాటక సంగీతాన్ని జోడించి అబ్బురపరిచింది. భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ గాగ్రా ధరించి, నుదుటన గుండ్రటి బొట్టు పెట్టుకుని ప్రదర్శన ఇచ్చింది. తన ప్రదర్శనకు జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారు. ఓ జడ్జి ఏకంగా ‘నువ్వు నిజంగా 10 ఏళ్ల అమ్మాయివేనా?’ అని అడిగారు. మరో జడ్జి ‘వావ్‌’ అంటూ ఆశ్చర్యపోయారు. ఇంకో జడ్జి ‘నువ్వు పదేళ్లకే రాక్‌ దేవతగా మారావు’ అంటూ కొనియాడారు. ఈ క్రమంలోనే మాయ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలు పోస్ట్‌ చేసే మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా ఈ వీడియోను తన ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోని లక్షల మంది వీక్షిస్తున్నారు.

తండ్రిని చూస్తూ..!

మాయ తండ్రికి గిటార్‌ వాయించడం అంటే మక్కువ. అలా ఇంట్లో వివిధ పాటలకు గిటార్‌ వాయిస్తుండేవారు. దాంతో మాయకు సైతం మ్యూజిక్‌పై ఇష్టం పెరిగింది. ఐదేళ్ల వయసులోనే బొమ్మ గిటార్ ప్లే చేస్తూ ఆనందించేదట. ఆమె ఇష్టాన్ని గమనించిన తండ్రి నెమ్మదిగా వివిధ పాటలకు గిటార్‌ వాయించడం నేర్పించారు. ఆ తర్వాత యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ తనే సొంతంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. గత రెండున్నరేళ్ల నుంచి గిటార్‌ ప్రసన్న దగ్గర కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటోంది. అంతేకాకుండా పలువురు నిపుణుల దగ్గర రాక్‌ మ్యూజిక్‌ని నేర్చుకుంది. ఈ క్రమంలోనే తన తాజా ప్రదర్శన వెనక ఉన్న వ్యక్తులను స్మరించుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

ఆ గిటార్‌తోనే..!

నేను మొదటగా ఆడమ్‌ జోన్స్ (టూల్‌ గిటారిస్ట్‌)కు థాంక్స్‌ చెప్పాలి. నా ఆసక్తిని గుర్తించడమే కాకుండా ఈ ప్రపంచానికి నన్ను గిటారిస్ట్‌గా పరిచయం చేశారు. రెండున్నరేళ్ల నుంచి నాకు తోడుగా ఉన్నారు. అలా ఓసారి తన స్వహస్తాలతో నా పేరును గిటార్‌పై రాసి బహుమతిగా ఇచ్చారు. ఆ గిటార్‌తోనే ప్రస్తుత ప్రదర్శన ఇచ్చా. ఆ తర్వాత నా గురువు ‘గిటార్‌ ప్రసన్న’కు కృతజ్ఞత చెప్పాలి. ఆయన కర్ణాటక సంగీతంలో ఎన్నో మెలకువలు నేర్పించారు. ప్రతి క్షణం నాకు అండగా ఉన్నారు. గురువు గారు లేకుంటే ఈ ప్రదర్శన సాధ్యమయ్యేది కాదు. నేను థ్యాంక్స్‌ చెప్పాల్సిన మరొక వ్యక్తి గ్యారీ హోల్ట్. స్లేయర్ గిటారిస్ట్ అయిన గ్యారీ నన్ను బలంగా నమ్మారు. నా ప్రదర్శన చూడడానికి తన భార్యతో పాటు వచ్చారు. అయితే షో సమయంలో నా గిటార్‌ టోన్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. అప్పుడు ఆయనే టెక్నీషియన్‌గా మారి నా సమస్యను పరిష్కరించారు.

వాళ్లు నా వెనకే..!

నా విజయంలో కీలక పాత్ర పోషించిన మరొక వ్యక్తి జెస్సికా (నటి, గాయని, గిటారిస్ట్‌). ఆమె నాకు పెద్దక్క. ఇది నా మొదటి స్టేజ్‌ ప్రదర్శన కావడంతో నన్ను మానసికంగా సిద్ధం చేసింది. అలాగే స్టేజ్‌పై పై ఎలా ఉండాలో కొన్ని మెలకువలు నేర్పించింది. తనతో మాట్లాడిన తర్వాత నాలో నమ్మకం పెరిగింది. ఏజీటీ బృందం కూడా నాకు అండగా నిలబడింది. ఇక చివరగా చెప్పాల్సింది నా కుటుంబం గురించి. ఇక్కడ వారి గురించి ప్రస్తావించడానికి కూడా వారిని ఒప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే వారు ఎప్పుడూ నా వెనక ఉండడానికే ప్రయత్నిస్తారు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి ప్రోత్సాహం లేకపోతే నా ఇష్టాన్ని కొనసాగించలేకపోయేదాన్ని. నా తల్లిదండ్రుల వల్లే పలువురు నిపుణులను కలవగలిగాను. ఈ క్రమంలో ఎన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాను. వీళ్లే కాకుండా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది.

తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మాయకు కర్ణాటక సంగీతాన్ని రాక్‌ మ్యూజిక్‌తో కలిపి సొంత మ్యూజిక్‌ చేయాలని కోరిక ఉందని చెబుతుంది. అందులో భాగంగానే తన తాజా ప్రదర్శనలో కొంతమేరకు మిక్స్‌ చేసి విజయం సాధించింది. మరి మన మాయ ఇక ముందూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం..!




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్