‘లాభాల పుట్ట’ గొడుగులు

ప్రభుత్వ ఉద్యోగం కల. ఎంత ఎదురుచూసినా నోటిఫికేషన్లే రాలేదు. ఈలోగా చదివిన చదువుకు సార్థకత ఉండాలని భావించిన ఆమె పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది. ఉపాధి పొందడమే కాదు... మరికొందరికీ మార్గదర్శకం అవుతోంది కొమ్మన్నబోయిన యామిని.

Published : 01 Jul 2024 04:08 IST

ప్రభుత్వ ఉద్యోగం కల. ఎంత ఎదురుచూసినా నోటిఫికేషన్లే రాలేదు. ఈలోగా చదివిన చదువుకు సార్థకత ఉండాలని భావించిన ఆమె పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది. ఉపాధి పొందడమే కాదు... మరికొందరికీ మార్గదర్శకం అవుతోంది కొమ్మన్నబోయిన యామిని. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...

సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మా స్వస్థలం. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తయ్యాక పోటీపరీక్షలకు సన్నద్ధత ప్రారంభించా. ప్రభుత్వ ఉద్యోగం నా కలైనా ఏదైనా సొంతంగా చేయాలనీ ఉండేది. ఎలాగూ ప్రకటనలు ఆలస్యమవుతున్నాయి కదా అని దానిపై దృష్టిపెట్టా. దానికి మావారు డాక్టర్‌ ప్రేమ్‌చంద్‌ కూడా ప్రోత్సహించారు. చేసేది ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్న నన్ను పుట్టగొడుగుల పెంపకం ఆకర్షించింది. అందుకు కారణమూ లేకపోలేదు. చదువుకునేప్పుడు ప్రాక్టికల్స్‌ సమయంలో వీటి ఆరోగ్య ప్రయోజనాలు నన్ను ఆకర్షించాయి. నేర్చుకున్న దానికి సార్థకత ఉంటుందని ఏడాదిక్రితం రూ.5వేలతో వీటి సాగు మొదలుపెట్టా. తొలిరోజుల్లో పుట్టగొడుగులు పెరగడానికి ఏర్పాటు చేసిన బెడ్లు పదే పదే పాడయ్యాయి. దీంతో నష్టమొచ్చింది. ప్రతి దశనీ నోట్‌ చేసుకుంటూ లోపాలను సరిదిద్దుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించా. అప్పుడు విజయం పలకరించింది.

కానీ మేమున్నది అద్దె ఇంట్లో. బెడ్లకు నీరు పడుతుంటే గోడలు తడుస్తాయని యజమాని కోప్పడేవారు. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే సాగు కొనసాగించా. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో చుట్టుపక్కలవాళ్లే కేజీ రూ.400 వరకూ పెట్టి తీసుకునేవారు. అదిచ్చిన ఆత్మవిశ్వాసంతో తొర్రూరులో సొంతింటికి చేరుకున్నాం. ఈసారి రూ.50వేల పెట్టుబడితో మూడు గదుల్లో పెంపకం ప్రారంభించా. 250 వరకు బెడ్లు ఏర్పాటు చేశా. విత్తనాలను బెంగళూరు ఐఐహెచ్‌ఆర్‌ నుంచి తీసుకొచ్చా. రేగడి మట్టి, కొబ్బరిపొట్టు, వరి గడ్డి, సున్నం వినియోగించి పాలిథిన్‌ కవర్లలో పుట్టగొడుగులను పెంచుతున్నా. తగిన జాగ్రత్తలు తీసుకుంటే 45 రోజుల్లో పంట చేతికొస్తుంది. అయితే తొలి 21 రోజులు చీకటి గదిలో ఉంచి, మిగిలిన రోజుల్లో గాలి, వెలుతురు అందేలా చూసుకోవాలి. చుట్టుపక్కలవాళ్లే కాదు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానూ ఆర్డర్లు వస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, వరంగల్‌ వంటి పట్టణాలకూ పంపుతున్నా. నెలకు రూ.20వేల వరకూ ఆదాయం వస్తోంది. ముదిరిన వాటిని ఎండబెట్టి, ‘డ్రైమష్రూమ్స్‌’ చేస్తున్నా. వీటికి మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ. ఏడాదిలోనే ఇంత ముందుకెళతామని ఊహించలేదు. నన్ను చూసి చాలామంది మహిళలు వారికీ పుట్టగొడుగుల సాగు నేర్పమని అడుగుతున్నారు. దీనిపై మరింత పట్టు తెచ్చుకోవడానికి బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నా. అది పూర్తయ్యాక శిక్షణనీ ప్రారంభిస్తా. వ్యాపారాన్ని ఇంకా విస్తరించి... మరింతమందికి ఉపాధి ఇవ్వాలనుకుంటున్నా.

బొల్లం శేఖర్, మహబూబాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్