30 ఎముకలు విరిగి... 25 సర్జరీలు అయ్యాక..!

చదువులో ఆటపాటల్లో మహా చురుకు... వైద్యురాలు కావాలని కలలు కంది.. ఎంబీబీఎస్‌ సీటూ సంపాదించుకుంది. హాయిగా సాగిపోతోన్న ప్రయాణంలో అతి పెద్ద కుదుపు. ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు...

Published : 30 Jun 2024 02:19 IST

రేపు జాతీయ వైద్యుల దినోత్సవం

చదువులో ఆటపాటల్లో మహా చురుకు... వైద్యురాలు కావాలని కలలు కంది.. ఎంబీబీఎస్‌ సీటూ సంపాదించుకుంది. హాయిగా సాగిపోతోన్న ప్రయాణంలో అతి పెద్ద కుదుపు. ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు... ముప్పైకి పైగా విరిగిన ఎముకలు... వాటిని బాగు చేయడానికి 25 శస్త్ర చికిత్సలు... ఇంకొకరెవరైనా జీవితంపై ఆశల్ని వదిలేసుకునేవారే. కానీ, అహ్మదాబాద్‌కి చెందిన సాక్షి మహేశ్వరి సంకల్పం మాత్రం చెక్కు చెదరలేదు. బాధల్ని పంటిబిగువునే భరించింది. ఆర్థోపెడిక్‌ డాక్టర్‌గా స్థిరపడి లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.

ది 2016 డిసెంబర్‌ 30... కర్ణాటకలోని మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ రెండో ఏడాది చదువుతోన్న సాక్షి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రోజు. పరీక్షలైపోయాయన్న సంతోషంతో పార్టీ చేసుకుని తిరిగి వస్తోన్న ఆమె వాహనానికి యాక్సిడెంట్‌ అయ్యింది. కాళ్లూ, చేతులూ, వేళ్లూ, కీళ్లు.... ఇల్లా ఒంట్లో ముప్పైకి పైగా ఎముకలు విరిగిపోయాయి. తలకూ బలమైన గాయాలయ్యాయి. అందుకే, సర్జరీ చేసినా బతికే అవకాశం కేవలం పదిశాతమే అన్నారు వైద్యులు. ఇరవై రోజుల పాటు లోకం తెలియకుండా ఐసీయూలోనే ఉంది. ఆపై గదికి మార్చారు. అసలు తనకేం జరిగిందో ఆమెకే మాత్రం గుర్తు లేదు.  ఆరునెలలు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలన్నారు. కాస్త కోలుకున్నాక మరిన్ని సర్జరీలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఆశ వదులుకోకూడదనుకుంది...

‘ఒక దశలో నా పని ఇక అయిపోయిందని అనుకున్నా. కానీ, అదే తలుచుకుంటూ బాధపడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు కదా! అందుకే నా తలరాతను నేనే మార్చుకోవాలనుకున్నా. అందరూ చదువుకి కొంత విరామం ఇస్తే మేలన్నారు. కానీ నేను మాత్రం కాలేజీకి వెళ్లడమే సరైన మార్గం అనుకున్నా’ అని చెప్పుకొచ్చింది సాక్షి. నాలుగడుగులు కూడా వేయలేని స్థితిలో వాకర్‌తోనే కళాశాలకు వెళ్లేది. పట్టుమని గంట కూడా కూర్చోలేకపోయినా బాధని పంటిబిగువున భరిస్తూ పాఠాలు వినడం ఆరంభించింది. ఆ మధ్యలోనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్, న్యూరో... ఇలా పలు రకాల సర్జరీలూ చేయించుకుంటూ ఉండేది. కాలం గడిచింది. పరీక్షల సమయం వచ్చింది. కానీ, తనేమో కనీసం వేళ్లనూ కదపలేకపోతోంది. మూడు గంటల పాటు పరీక్ష హాలులో కూర్చోవడమూ సాక్షికీ కష్టమే. అయినా వెనక్కి తగ్గలేదు. నాలుగు దిండ్లను ఒత్తుగా పెట్టుకుని స్క్రైబర్‌ సాయంతో ఎగ్జామ్స్‌ రాసింది. డిస్టింక్షన్‌లో పాసై అందరితో ఔరా అనిపించింది. 

ఆర్థోపెడిక్‌ డాక్టరుగా... 

మూడో ఏడాదికొచ్చేసరికి నెమ్మదిగా అడుగులు వేయడం ఆరంభించింది సాక్షి. మెడిటేషన్, ఫిజియోథెరపీ క్లాసులకు హాజరవుతూనే క్రమంగా శక్తిని పుంజుకోవడం మొదలుపెట్టింది. అడుగులు వేగాన్ని పెంచుకోవడంతో పాటు మెటల్‌ ప్లేట్లూ, స్క్రూలు ఉన్న కాళ్లతోనే మారథాన్‌లకూ హాజరైంది. ‘ఇది గెలుపోటముల కోసం కాదు... నన్ను నేను ఉత్సాహపరుచుకోవడానికి మాత్రమే. నాకు మద్ధతుగా నా కుటుంబమూ మారథాన్‌లో పాల్గొంది’ అంటుంది సాక్షి. మణిపాల్‌లో ఎంబీబీఎస్‌ అయ్యాక అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ నుంచి ఎం.ఎస్‌. ఆర్థోపెడిక్‌ సర్జరీని అభ్యసించింది. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రిలో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. నిరుపేద రోగులకు శస్త్రచికిత్సలు ఆలస్యం కాకుండా ఉండేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తూ తన వంతు కృషి చేస్తోంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్