Andhra Pradesh: ఏఐ యుగ సారథిగా ఆంధ్రప్రదేశ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 1990 నుంచి 2000 దశకం తొలినాళ్ల వరకు సాంకేతిక వికాసం సాధించింది. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీతోపాటు  మౌలిక వసతుల నిర్మాణం, సానుకూల వ్యాపార వాతావరణం, ఇంజినీరింగ్‌ కళాశాలల వల్ల యువతకు అందిన ఐటీ నైపుణ్యాలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మేటిగా నిలిపాయి.

Updated : 02 Jul 2024 08:18 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 1990 నుంచి 2000 దశకం తొలినాళ్ల వరకు సాంకేతిక వికాసం సాధించింది. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీతోపాటు  మౌలిక వసతుల నిర్మాణం, సానుకూల వ్యాపార వాతావరణం, ఇంజినీరింగ్‌ కళాశాలల వల్ల యువతకు అందిన ఐటీ నైపుణ్యాలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మేటిగా నిలిపాయి. రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి నిరాశాజనకంగా మారింది. కృత్రిమ మేధ(ఏఐ)ను అందిపుచ్చుకొంటే ఏపీ ప్రగతికి ఆకాశమే హద్దు అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ పరిశోధనతో పాటు అందుకు అవసరమైన వసతులు, నైపుణ్యాభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు సమకూర్చాలి. ముఖ్యంగా ‘ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్య (4పీ) వ్యూహం’ కృత్రిమ మేధా రంగంలో అంకురాల సృష్టి, విస్తరణకు ఎంతగానో తోడ్పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు సమాచారాన్ని, పెట్టుబడులను, ప్రజలూ విద్యావేత్తలను సమర్థంగా అనుసంధానించడమే 4పీ వ్యూహం! స్థానికంగా ఏఐ సిబ్బందిని తయారుచేసుకుని సమస్యల పరిష్కారానికి కృత్రిమ మేధను వినియోగించడం ఇందులో కీలకం. ఏఐ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ వ్యూహం దోహదపడుతుంది. జపాన్‌ గ్రీన్‌ హౌస్‌లలో తెగుళ్ల ముప్పును ముందే పసిగట్టి హెచ్చరిస్తున్న ఏఐ ఉత్పత్తి- ప్లాన్‌టెక్ట్‌ 4పీ వ్యూహానికి మంచి ఉదాహరణ. ఇప్పుడీ ఉత్పత్తి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. జపాన్‌ సర్కారు అందించిన నిధులు... ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ప్రైవేటు రంగం ప్లాన్‌టెక్ట్‌ ఏఐ ఉత్పత్తికి రూపకల్పన చేసింది. అది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

రాజధాని అభివృద్ధికి బాటలు

అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ) అనేది వివిధ సాఫ్ట్‌వేర్లు ఒకదానితో ఒకటి సంప్రదించుకోవడానికి, విధులను సమాచారాన్ని పంచుకోవడానికి తోడ్పడే నిబంధనావళి. ఏఐ రంగంలో ఏపీఐల రూపకల్పనకు తగిన సమాచారాన్ని అందిస్తే సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించవచ్చు. ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని, వివాహ సేవల సంస్థలు నమ్మదగినవా కాదా అనేది తెలుసుకోవడానికి... ఇలా ఏ సమాచారం కోసమైనా ఏపీఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసుకోవచ్చు. ఏపీఐ కాల్స్‌ వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. బహిరంగ సమాచారాన్ని ఆర్థిక వనరుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థుల గ్రహణశక్తిని బట్టి వ్యక్తిగత బోధన కార్యక్రమాలను అందించడానికి కృత్రిమ మేధ ఉపకరిస్తుంది. ఇది విద్యాసంస్థలకు సహాయకారిగా ఉంటుంది. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా నివారించడానికి, నిపుణ మానవ వనరుల సృష్టికి ఏఐ వెసులుబాటు కల్పిస్తుంది.
ప్రభుత్వ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి ఏఐ తోడ్పడుతుంది. ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అధిక ఉత్పాదకతను సాధించడానికి కృత్రిమ మేధ దారిచూపగలదు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి ఏఐ పునాది వేయగలదు. ఏఐని నియోగించి ఈ నగరంలో రోడ్డు రవాణాను సమర్థంగా నియంత్రించవచ్చు. రియల్‌ టైమ్‌ డేటా విశ్లేషణతో ప్రజా రవాణా వ్యవస్థను నడపవచ్చు. వ్యర్థాల సేకరణ, శుద్ధి కార్యక్రమాలకు, పర్యావరణ రక్షణకు ఏఐ తోడ్పడుతుంది. పౌరుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారాలు చూపడం, కాగిత రహిత పాలన వంటివి ఏఐ వల్ల సులభతరమవుతాయి. కృత్రిమ మేధ ఆధారిత పట్టణాభివృద్ధికి అమరావతి నిదర్శనంగా నిలవగలదు. ఏఐ ద్వారా టెలీ మెడిసిన్‌ సేవలను మారుమూల ప్రాంతాలకు అందించవచ్చు. రోగుల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే వీలుంటుంది.

ఉపాధికి ఊతం

మన ఉద్యోగులు, కార్మికులకు ఏఐ నైపుణ్యాలను అలవరచడం ద్వారా వారి ఉత్పాదకతను గణనీయంగా పెంచే వీలుంది. దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి రాష్ట్రానికి అనేకమంది పర్యటకులు, నిపుణులు, వ్యాపారులు వస్తుంటారు. క్యాబ్‌ డ్రైవర్లు ఏఐ అప్లికేషన్లను ఉపయోగించి అటువంటి వ్యక్తులతో వారి భాషల్లోనే సంభాషించే అవకాశముంది. ఇది పర్యటకానికి, ఇతర రంగాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మనం ఊహించని సరికొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలెన్నో అందివస్తాయి. కాబట్టి ఏఐ వినియోగమనేది ఐచ్ఛికం కాదు, అత్యవసరం. కృత్రిమ మేధ వల్ల కొన్ని రకాల ఉపాధులు దెబ్బతింటాయన్నది నిజమే. ముఖ్యంగా కాల్‌ సెంటర్లు, బీపీఓ, సాధారణ ప్రోగ్రామింగ్‌ పనులను ఏఐ ఆక్రమిస్తుంది. అందుకని సిబ్బందికి ఏఐ నైపుణ్యాలను అలవరిస్తే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్‌ ఇందుకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చాలి. విద్యార్థులతోపాటు ఇప్పటికే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఏఐ నైపుణ్యాలను అందించాలి. ఏఐ ప్రయోగాలు, ఇంక్యుబేషన్, అభ్యాసం, అప్లికేషన్ల ఎగుమతుల ద్వారా ఏపీ ఈ రంగంలో నాయక స్థానానికి ఎదగాలి. ఆంధ్రులు ఏఐ రంగంలో వ్యవస్థాపకులుగా, నవీకరణ సాధకులుగా రాణించాలి.

ప్రతాప్‌ శివకిషోర్‌ కొమ్మి, ఐపీఎస్‌
(అడిషనల్‌ ఎస్పీ, చింతపల్లి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.