Warangal: వరద నుంచి వరంగల్‌కు విముక్తి కల్పిస్తాం

వరద ముంపు సమస్య నుంచి వరంగల్‌ నగరానికి విముక్తి కలిగేలా అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూశాఖ, వరంగల్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Published : 05 Jul 2024 03:42 IST

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి 

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో దానకిశోర్, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, బండా ప్రకాశ్, కడియం శ్రీహరి, సుధారాణి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: వరద ముంపు సమస్య నుంచి వరంగల్‌ నగరానికి విముక్తి కలిగేలా అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూశాఖ, వరంగల్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరదనీరు సాఫీగా వెళ్లేలా నాలాల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌)ను బలోపేతం చేయాలన్నారు. నాలాలను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నవారిని తక్షణమే మరో ప్రాంతానికి తరలించాలని సూచించారు. వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. గురువారం సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో కలిసి వరంగల్‌ నగర అభివృద్ధిపై పొంగులేటి సమీక్ష నిర్వహించారు. 

నగర అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్‌ ప్లాన్‌

‘వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 2050 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలి. ఫార్మా సిటీ, ఐటీ అండ్‌ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు, ఎకో టూరిజం, విద్యాసంస్థలు, స్టేడియం, ఎయిర్‌పోర్టు, లాజిస్టిక్స్‌ పార్కు, ఖమ్మం-వరంగల్‌ రహదారిలో, కరీంనగర్‌-వరంగల్‌ రహదారిలో డంపింగ్‌ యార్డులు వంటివి ఉండేలా మాస్టర్‌ ప్లాన్‌ను వీలైనంత త్వరగా రూపొందించాలి. నగరంలో నిర్మించే రింగు రోడ్డుకు జాతీయ రహదారులతో కనెక్టివిటీ ఉండేలా చూడాలి. ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. సెప్టెంబరు 9న కాళోజీ జయంతి సందర్భంగా.. కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఆలోగా పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి. నర్సంపేటలో వైద్య కళాశాలను ఈ ఏడాది ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వసతులను మెరుగుపర్చాలి’’ అని మంత్రి ఆదేశించారు. కాజీపేట-అయోధ్యాపురం ఆర్‌ఓబీ పనుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కె.నాగరాజు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, మున్సిపల్‌శాఖ కార్యదర్శి దానకిశోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్‌లు డాక్టర్‌ సత్య శారద, పి.ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీలంక జర్నలిస్టులతో మంత్రి భేటీ 

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటుచేసిన రెండు వారాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక మీడియా ప్రతినిధులతో గురువారం సచివాలయంలో మంత్రి సమావేశమై మాట్లాడారు.  మీడియా సాంకేతిక రంగంలో ఏఐ పాత్ర, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ఎదురవుతున్న సవాళ్లపై జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డీజీ శశాంక్‌ గోయల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని