Piyush goyal: పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు.

Published : 01 Jul 2024 04:23 IST

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ 

వాణిజ్య, వ్యాపారవేత్తల ఆత్మీయ సదస్సులో కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌

బంజారాహిల్స్, న్యూస్‌టుడే: దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌గా, విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు మన స్టార్టప్‌లు సాంకేతికంగా అద్భుతమైన పురోభివృద్ధి సాధించాయన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ‘ఔట్‌ రీచ్‌’ పేరిట జరిగిన వాణిజ్య, వ్యాపారవేత్తల ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారత్‌ను శక్తిమంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే క్రమంలో ఎదురయ్యే సవాళ్లపై కార్పొరేట్‌ సంస్థలతో చర్చించేందుకు, వినూత్న ఆలోచనలు పంచుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్‌ కేంద్రంగా ఉందన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో తయారైన టీకా యావత్‌ ప్రపంచంలో భయాన్ని తొలగించిందన్నారు. సదస్సులో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


తెలంగాణలో భాజపాకు ఆదరణ పెరుగుతోంది: పీయూష్‌ గోయల్‌ 

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: తెలంగాణలో భాజపాకు ఆదరణ పెరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో కందికల్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌ నందనవనం ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇస్కాన్‌ టెంపుల్‌ ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉండగా.. ఈ సారి ఎనిమిది మందిని గెలిపించారని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాజపా భాగ్యనగర్‌ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, సైదాబాద్‌ కార్పొరేటర్‌ అరుణ, భాజపా చాంద్రాయణగుట్ట కన్వీనర్‌ పండరీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని