Kishan Reddy: న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి

దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు.

Published : 01 Jul 2024 04:20 IST

దేశ హితం కోసమే కొత్త నేర న్యాయ చట్టాలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, భాజపా నేత రాంచందర్‌రావు తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. దేశ ప్రజలు, సమాజ హితం కోసం కేంద్రం కొత్త నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చిందని.. ప్రధాని మోదీపై కోపంతో వాటిని కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడమే వారి పని అని విమర్శించారు. తాను 2019లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కొత్త నేర న్యాయ చట్టాలపై చాలా పనిచేసినట్లు చెప్పారు. ‘ఫోరం ఫర్‌ నేషనలిస్ట్‌ థింకర్స్‌’ ఆధ్వర్యంలో కొత్త నేర న్యాయ చట్టాలపై హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ మెమోరియల్‌ న్యాయ కళాశాలలో ఆదివారం కార్యశాల ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య  అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి కొత్త చట్టాల సారాంశంతో భరత్‌ గోగియా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించి.. మాట్లాడారు. ‘‘దేశంలో వస్తున్న మార్పులు, కొత్తగా నమోదవుతున్న నేరాలు, ప్రజల ఆలోచనా విధానానికి అనుగుణంగా చట్టాలు రావాల్సిన అవసరముంది. నేర న్యాయ చట్టాల విషయంలో విశ్వవిద్యాలయాల వీసీలు, ఐపీఎస్‌ అధికారులు, న్యాయ నిపుణులు, ప్రజలు, స్వతంత్ర సంస్థలు సహా అనేక రంగాల వారి నుంచి వేల అభిప్రాయాలు స్వీకరించి.. కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే కొత్త చట్టాలు వచ్చాయి. కేంద్రం సదుద్దేశంతో తెచ్చిన చట్టాల్లో పొరపాట్లుంటే సలహాలివ్వాలి. భేషజాలకు పోకుండా మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబరు 17న అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయకపోయినా కేంద్రం కొనసాగిస్తుంది. త్వరలో రాష్ట్రంలో అధికారంలోకొస్తే అధికారికంగా నిర్వహిస్తాం’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. స్వాతంత్య్రానికి ముందు తెచ్చిన నేర న్యాయ చట్టాల స్థానంలో కొత్తవి తెస్తే కొన్ని రాష్ట్రాలు బంద్‌ పాటించడం సరికాదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. కార్యశాలలో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, భాజపా నేత ఎన్‌.రాంచందర్‌రావు, మహిళా భద్రతా విభాగం డీఐజీ రెమా రాజేశ్వరి, హైకోర్టులో అదనపు సోలిసిటర్‌ జనరల్‌ బి.నర్సింహ శర్మ, సీనియర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. 

చరిత్రాత్మక రోజు: జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి

కొత్త నేర న్యాయ చట్టాల అమలుతో జులై 1వ తేదీ స్వతంత్ర భారతదేశంలో ఒక చరిత్రాత్మక రోజు కాబోతోందని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి పేర్కొన్నారు. ‘‘బ్రిటిష్‌ హయాంలో లార్డ్‌ మెకాలే భారత ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి నేర న్యాయ చట్టాలను తయారు చేయించాడు. వాటి వల్ల కొన్ని కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతుంది. ఈ సమస్యను కొత్త చట్టాలు పరిష్కరిస్తాయి. పోలీసులు, న్యాయవ్యవస్థ కలిసి వీటిని సమర్థంగా అమలు చేయాలి’’ అని పేర్కొన్నారు. 

నేర బాధితులే కేంద్రంగా చట్టం: జస్టిస్‌ లక్ష్మీనారాయణ

సీఆర్‌పీసీ స్థానంలో తీసుకొచ్చిన భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)ను నేర బాధితులే కేంద్రంగా రూపొందించారని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.లక్ష్మీనారాయణ అన్నారు. ‘నేర బాధితులకు కేసులో సమాచారం తెలుసుకునే హక్కును చట్టం కల్పించింది. ఏదైనా ఘటన జరిగితే ఎలక్ట్రానిక్‌ విధానంలో ఫిర్యాదు చేయొచ్చు. పోలీసు దర్యాప్తునకు నిర్ణీత గడువు, కచ్చితంగా ఏడు రోజుల్లో జడ్జి ముందు స్టేట్‌మెంట్‌ రికార్డు వంటి అంశాలతో కేసు విచారణ వేగంగా జరిగేలా మార్పులు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. 

ప్రజల అవసరాలకు అనుగుణంగా: జస్టిస్‌ మాధవీదేవి

భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌ఏ) ప్రస్తుత దేశ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి పేర్కొన్నారు. ‘‘బ్రిటిష్‌ పాలకులు పాలనా సౌలభ్యం కోసం 1871లో రూపొందించిన ఎవిడెన్స్‌ యాక్ట్‌నే ఇంకా అనుసరిస్తున్నాం. దీని స్థానంలో బీఎస్‌ఏ వచ్చింది. కొత్త చట్టంలో అనేక పాత సెక్షన్లు అలాగే ఉన్నా.. వలసవాద విధానాలకు అనుకూలంగా ఉండే, అవసరం లేని వాటిని తొలగించారు’’ అని వివరించారు.

ఐపీసీని ఆధునికీకరించి బీఎన్‌ఎస్‌: జస్టిస్‌ కె.సురేందర్‌

ఐపీసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునికీకరించే ఉద్దేశంతో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) వచ్చిందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌ తెలిపారు. ‘‘మారుతున్న పరిస్థితుల్లో కొత్త పద్ధతుల్లో నమోదయ్యే నేరాలు, మారిన సమాజానికి అనుగుణంగా నూతన చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు నిర్లక్ష్యంగా ఇతరుల మరణానికి కారణమైన కేసుల్లో శిక్ష పెరిగింది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని