TG News: 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష

సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరంతా బుధవారం జైళ్ల నుంచి విడుదల కానున్నారు.

Published : 03 Jul 2024 02:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరంతా బుధవారం జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హోంమంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ.. క్షమాభిక్ష మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న 213 మంది ఖైదీలతో జాబితా సైతం రూపొందించింది. అయితే సాంకేతిక కారణాలతో వీరి విడుదలకు అప్పట్లో ఉత్తర్వులు జారీకాలేదు. దీనిపై ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తిచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షమాభిక్ష వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. జనవరి 26 వరకూ 213 మంది ఖైదీలకే అర్హత లభించగా.. తాజా ప్రతిపాదనల ప్రకారం మరో 18 మందికి అర్హత లభించింది. దీంతో మొత్తం 231 మంది విడుదలకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు జారీఅయ్యాయి. 

మళ్లీ నేరాలకు పాల్పడితే క్షమాభిక్ష రద్దు

విడుదల సమయంలో ఈ ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషనరీ అధికారి ముందు హాజరుకావాలి. విడుదల తర్వాత ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకూడదు. ఏదైనా నేరానికి పాల్పడితే క్షమాభిక్ష రద్దవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని