Solar Power: సౌర విద్యుత్తుపై తెలుగు రాష్ట్రాల నిరాసక్తి

రూఫ్‌టాప్‌(ఇంటిపైకప్పు) సౌర విద్యుత్‌ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

Published : 26 Jun 2024 06:14 IST

రాయితీ ఉన్నా దరఖాస్తుకు వెనకడుగు
14, 16 స్థానాల్లో ఏపీ, తెలంగాణ
ముందంజలో అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర 

ఈనాడు, హైదరాబాద్‌: రూఫ్‌టాప్‌(ఇంటిపైకప్పు) సౌర విద్యుత్‌ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. బిహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాలతో పోల్చినా ఏపీ, తెలంగాణ వెనకబాటులో ఉన్నాయి. అవగాహనలేమి, పాలకుల నుంచి ప్రోత్సాహం లభించకపోవడం, ఉచిత విద్యుత్తు పథకాలే దానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు ‘ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన’ కింద రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తామంది. గత ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ‘ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు’ రాయితీ సొమ్ము విడుదల చేస్తామనే నిబంధన విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆశించిన మేరకు రాలేదని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఓ నివేదికలో తెలిపింది.

సిరిసిల్ల జిల్లాలో మూడే.. అల్లూరి జిల్లాలో 178  దరఖాస్తులు

దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా అస్సాం 2.23 లక్షలు, గుజరాత్‌ 2.14 లక్షలు, మహారాష్ట్ర 1.91 లక్షలు, ఉత్తర్‌ప్రదేశ్‌ 1.89 లక్షల దరఖాస్తులతో వరసగా తొలి 4 స్థానాల్లో నిలిచాయి. ఏపీ 29,740, తెలంగాణ 17,152 దరఖాస్తులతో 14, 16 స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల కనీసం 100 మంది కూడా దరఖాస్తుకు ముందుకు రాలేదు. తెలంగాణలో అత్యధికంగా మేడ్చల్‌లో 2,266 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురే స్పందించారు. ఏపీలోని కాకినాడ నుంచి అత్యధికంగా 1,315, అత్యల్పంగా అల్లూరి జిల్లా నుంచి 178 మాత్రమే వచ్చాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లా నుంచి 18,452 దరఖాస్తులు రాగా..గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి కేవలం 1,296 మాత్రమే వచ్చాయి. ‘ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే సొమ్ముకు అదనంగా కొంత రాయితీ కలిపి ఇస్తుండటం, ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించడంతో రూఫ్‌టాప్‌ సౌరవిద్యుత్‌ ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అది లోపించింది. రాష్ట్రంలో ఒక్కో ఇంటికి 200 యూనిట్లు, ఏపీలో 101 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తుండటం వెనకబాటుకు కారణమని’ డిస్కంలు విశ్లేషిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు