TG News: ప్రాజెక్టులకు తక్షణం రూ. 8,500 కోట్లు అవసరం

రాష్ట్రంలో చివరి దశలో ఉండి, ఈ వానాకాలం లోపు పనులు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు తక్షణమే రూ.8,500 కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ సర్కిల్‌ ఇంజినీర్లు కోరినట్లు తెలిసింది.

Published : 26 Jun 2024 06:14 IST

చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు రూ.8వేల కోట్లు 
బడ్జెట్‌ ప్రతిపాదనలపై నీటిపారుదలశాఖ కీలక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చివరి దశలో ఉండి, ఈ వానాకాలం లోపు పనులు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు తక్షణమే రూ.8,500 కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ సర్కిల్‌ ఇంజినీర్లు కోరినట్లు తెలిసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నేతృత్వంలో మంగళవారం జలసౌధలో కీలక సమావేశం జరిగింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ సమావేశాన్ని సమన్వయం చేయగా 19 సర్కిళ్ల సీఈలు, వివిధ విభాగాల ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు, పురోగతి, లక్ష్యాలపై చర్చించారు. బడ్జెట్‌లో వివిధ ప్రాజెక్టులు, నిర్మాణాలకు కలిపి దాదాపు రూ.20వేల కోట్లకు సీఈల నుంచి ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్య ప్రాజెక్టులకు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపుల్లో  మొదటి ప్రాధాన్యం ఇవ్వనుండగా ఆ మేరకు సీఈలు ప్రతిపాదనలు సమర్పించాలని ప్రత్యేక కార్యదర్శి సూచించినట్లు తెలిసింది. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు ఈ ప్రతిపాదనల్లో మొదటి స్థానం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ.8 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని సీఈలు పేర్కొన్నట్లు సమాచారం. 

ఆయకట్టు లక్ష్యంగా ప్రతిపాదనలు... 

సీఈలు సమర్పించే ప్రతిపాదనలు ఆయకట్టు లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ప్రత్యేక కార్యదర్శి సూచించినట్లు తెలిసింది. ‘ప్రాజెక్టుల కింద ఏ మేరకు ఆయకట్టు ఇస్తారనే దానిపై ఆధారపడి బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండాలి. మొదట వందశాతం పూర్తయ్యే ప్రాజెక్టులు, పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. భూ సేకరణ పూర్తి చేయడానికి, ఆ తరువాత పునరావాస చర్యల అనంతరమే నిర్మాణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఉండాలి’ అని సూచించినట్లు తెలిసింది. పలువురు సీఈలు ఇప్పటికే అందించిన ప్రాథమిక వివరాలు సక్రమంగా లేకపోవడంతో మరోమారు ఇవ్వాలని సమావేశంలో పేర్కొన్నారు. వచ్చే శనివారం సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు ఖరారు చేయాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు