Telangana High Court: కేసీఆర్‌ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిర్ణయం

కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటుపై మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి హైకోర్టు నిర్ణయించింది.

Published : 28 Jun 2024 05:58 IST

జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటును సవాలు చేసిన భారాస అధినేత
రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన న్యాయస్థానం
విచారణ నేటికి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటుపై మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి హైకోర్టు నిర్ణయించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నంబరు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హతపై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా... గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆయన ప్రస్తావించగా... విచారణ చేపడితే ఏమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్‌... నివేదికను అసెంబ్లీకే సమర్పిస్తుంది కదా, అందులో ఇబ్బందేముందని అడిగింది. కమిషన్‌ ఏర్పాటు చేసిన తీరుపైన అభ్యంతరాలున్నాయని న్యాయవాది వివరించారు.

అభ్యంతరాలనే పరిగణనలోకి తీసుకోలేదు: ‘‘కేసీఆర్‌కు ఏప్రిల్‌ 14న కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున గడువు కావాలని ఆయన లేఖ రాశారు. దీనికి ఆమోదించిన కమిషన్‌ విచారణను వాయిదా వేసింది. ఈలోగానే జూన్‌ 11న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిషన్‌ తన ముందున్న వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉండగా అరకొర సమాచారంతో మీడియా సమావేశం పెట్టారు. అందులో ఆయన వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే విచారణకు సంబంధించి ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కమిషన్‌ ఛైర్మన్‌ పదవిలో కొనసాగడంపై కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు గౌరవంగా తప్పుకోవాల్సిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి మరో నోటీసు జారీచేశారు. దాన్నిబట్టి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిష్పాక్షిక విచారణ కొనసాగించకపోవడంతో ఆయనను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాల్సి వచ్చింది. 

కమిషన్‌ వ్యవహార శైలి ఏపీ హైకోర్టు తీర్పునకు విరుద్ధం: కమిషన్‌ వ్యవహార శైలి గతంలో మాజీ సీఎం కె.విజయభాస్కర్‌రెడ్డి కేసులో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉంది. ఆ కేసులో కమిషన్‌ విచారణకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని, న్యాయపరమైన అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు... రామకృష్ణ దాల్మియా కేసులోనూ స్పష్టం చేసింది. ఏలేరు కుంభకోణంపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ సోమశేఖర కమిషన్‌పై పీలా పోతినాయుడు వేసిన కేసులో అప్పటి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి వెలువరించిన తీర్పు ఇక్కడ వర్తిస్తుంది. కమిషన్‌కు నేతృత్వం వహించే వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరించరాదని ప్రవర్తన శైలి గురించి నాడు ఆయన పేర్కొన్నారు. 

 రాజకీయ కక్షలో భాగమే..: విద్యుత్‌ వివాదాలకు సంబంధించి ఏ అభ్యంతరం ఉన్నా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిని (ఎస్‌ఈఆర్‌సీని)  ఆశ్రయించాల్సి ఉంది. గతంలో ఎస్‌ఈఆర్‌సీ ముందు ఫిర్యాదు చేసిన రేవంత్‌రెడ్డి అప్పిలేట్‌ అథారిటినీ ఆశ్రయించకుండా ముఖ్యమంత్రి అయ్యాక మరో కమిషన్‌ ఏర్పాటు చేయడం రాజకీయ కక్షలో భాగమే’’ అని పిటిషనర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వివరించారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌కు నంబరు కేటాయించడానికి ఉన్న అర్హతలపై వాదనలు వినిపించాలని, పూర్వాపరాలపై కాదని అన్నారు. అనంతరం ధర్మాసనం కేసీఆర్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని