Telangana News: మండల, జిల్లా పరిషత్‌లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్‌లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్‌పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.

Updated : 01 Jul 2024 03:49 IST

జడ్పీలకు కలెక్టర్లు, మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులు
ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్‌లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్‌పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు. జిల్లా పరిషత్‌లకు జిల్లా కలెక్టర్లను, మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. 2019 మే నెలలో 539 జడ్పీటీసీ; 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జులై మూడో తేదీన మండల పరిషత్‌లకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. జులై నాలుగో తేదీన 28 జిల్లా పరిషత్‌లకు.. ఆగస్టు 7న ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీలకు ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లు, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నందున ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీల ఎన్నికలను వాయిదావేసి ప్రత్యేకాధికారులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిని ఆమోదించిన అనంతరం ఉత్తర్వులు జారీ అవుతాయి. దీని ప్రకారం తెలంగాణలోని మండల పరిషత్‌లకు జులై నాలుగో తేదీ నుంచి జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు చేపడతారు. ఐదో తేదీన 28 జిల్లా పరిషత్‌లకు.. ఆగస్టు 7న ములుగు,  మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీలకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. 

పంచాయతీల్లో ఫిబ్రవరి నుంచి.. 

రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో జనవరిలో సర్పంచుల పదవీకాలం ముగియగా.. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. గెజిటెడ్‌ అధికారులను ఆయా స్థానాల్లో నియమించారు. త్వరలో మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకూ నియమించనుండటంతో స్థానిక సంస్థల్లో మొత్తం అధికారుల పాలనే సాగనుంది. ప్రత్యేకాధికారుల పాలన ఆరు నెలల వరకు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. ఈ లెక్కన జులై వరకు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. అయితే మరో 6 నెలలు వీటికి ప్రత్యేకాధికారుల పాలన పొడిగించే అవకాశం ఉంది. 

బీసీ రిజర్వేషన్లు తేలాకే..!

బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలు ముడిపడి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన అనంతరం ఈ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వచ్చే ఆగస్టుతో బీసీ కమిషన్‌ పాలకమండలి గడువు ముగిశాక కొత్త పాలకమండలిని నియమించి కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. డిసెంబరు వరకు ఆ ప్రక్రియ కొనసాగే వీలుంది. అంతవరకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగవు. మరోవైపు జులైలో మండల, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుండగా.. వాటికి డిసెంబరు వరకు గడువు ఉంటుంది. అప్పటికి ఎన్నికలు జరిగితే 2025 నుంచి కొత్త పాలకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని