electricity circles: నష్టాలొచ్చే విద్యుత్‌ సర్కిళ్లు ప్రైవేటుకు..!

కరెంటు ‘సరఫరా, పంపిణీ, వాణిజ్య’ (ఏటీసీ) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Updated : 29 Jun 2024 07:09 IST

పాతబస్తీ ప్రాంతం అదానీకి అప్పగించే యోచన
ఇప్పటికే ఆ సంస్థ అధ్యయనం
రాష్ట్రంలో 20 శాతం కరెంటు నష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరెంటు ‘సరఫరా, పంపిణీ, వాణిజ్య’ (ఏటీసీ) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ దక్షిణ (సౌత్‌) విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాన్ని అదానీ సంస్థకు అప్పగించబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి రెండురోజుల క్రితం దిల్లీలో మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి ఉన్నతస్థాయిలో సమావేశాలు జరిగాయి. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కం నుంచి సమాచారం సేకరించింది. కరెంటు ‘పంపిణీ, బిల్లుల వసూలు’ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇవ్వాలి. తర్వాత డిస్కంలు టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాలి. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వకపోయినా.. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాతబస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాతబస్తీని అప్పగిస్తున్నందున.. భవిష్యత్తులో నష్టాలొచ్చే ఇతర విద్యుత్‌ సర్కిళ్లకూ అదే విధానం వర్తిస్తుందా అనేది చర్చనీయాంశమవుతోంది. 

‘సౌత్‌’ సర్కిల్‌లో అత్యధికంగా..

హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో అత్యధికంగా 41.4 శాతం నష్టాలున్నాయి. దీని పరిధిలోని బార్కాస్‌ ఫీడర్‌లో ఏకంగా 90.7 శాతం నష్టాలు నమోదవుతున్నాయి. ఈ సర్కిల్‌లో పరిధిలో రోజూ రూ.మూడు కోట్ల విలువైన కరెంటు సరఫరా చేస్తే రూ. కోటిన్నర ఆదాయమే తిరిగి వస్తోంది. మిగతా కోటిన్నర రూపాయలను దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ (డిస్కం) నష్టాలుగా చూపుతోంది. ఈ ఒక్క సర్కిల్‌ నుంచే ఏటా  రూ.500 కోట్లకు పైగా డిస్కం   నష్టపోతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంల వార్షిక నష్టాలు రూ.5,500 కోట్లకు పైగా ఉంటున్నాయి.  వాస్తవంగా సరఫరాలో   సాంకేతిక సమస్యల వల్ల నష్టం సగటున 10-12 శాతం కాగా.. కరెంటు చౌర్యం, బిల్లుల ఎగవేత వంటి సమస్యలే నష్టాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.

దక్షిణ తెలంగాణ డిస్కంలో..

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2022-23లో మొత్తం 55,155.92 మిలియన్‌ యూనిట్ల (మి.యూ.) కరెంటు కొంటే.. సరఫరా నష్టాలు పోను.. 51,242.69 మి.యూ. పంపిణీ చేశారు. ఈ పంపిణీలో చౌర్యం, బిల్లులు కట్టకపోవడం వంటి కారణాలతో చివరికి 46,887.55 మి.యూ.కి మాత్రమే బిల్లుల రూపంలో రాబడి వచ్చింది. 2022-23లో ఈ డిస్కం ఏటీసీ నష్టాలు 19.09 శాతంగా నమోదైతే.. పాతబస్తీలో నష్టాలు ఏకంగా 41 శాతం ఉన్నాయి. 

ఉత్తర డిస్కంలో..

ఉత్తర డిస్కం పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఏటీసీ నష్టాలు గత ఏడాది (2023-24) అత్యధికంగా 37 శాతం నమోదయ్యాయి. కానీ ఈ జిల్లాలో వాస్తవంగా కరెంటు సరఫరా, పంపిణీ నష్టాలు 7 శాతమే. కాళేశ్వరం ఎత్తిపోతల కరెంటు బిల్లుల సొమ్ము ప్రభుత్వం నుంచి సరిగా రాకపోవడంతో ఆ నష్టాలు 37 శాతానికి చేరాయి. 

అక్కడ విద్యుత్‌ సిబ్బందినే రానివ్వరు..

పాతబస్తీలో కరెంటు మీటరు రీడింగ్‌ నమోదు చేయడానికి విద్యుత్‌ సిబ్బందిని ఇళ్లలోకి సైతం కొందరు రానివ్వడం లేదు. బిల్లు కట్టలేదని కరెంటు నిలిపివేసినందుకు పాతబస్తీతో ఒక ఇంటి యజమాని ఇటీవల విద్యుత్‌ సిబ్బందిపై కత్తితో దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇలాంటి దాడులు తరచూ జరుగుతుండడంతో విద్యుత్‌ సిబ్బంది పాతబస్తీలో మీటరు రీడింగ్‌ నమోదు, బిల్లుల వసూలుకు జంకుతున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు సైతం కరెంటు బిల్లులు కట్టనివారికి వత్తాసు పలుకుతూ.. విద్యుత్‌ సిబ్బందిని రావద్దంటూ హెచ్చరిస్తుండటం మరో సమస్య. వీటికితోడు మీటర్‌ ట్యాంపరింగ్, చౌర్యం కారణంగా.. సరఫరా చేసిన కరెంట్‌లో దాదాపు సగం బిల్లింగ్‌లోకి రావడం లేదు. కొన్ని సెక్షన్లలో ఇది 90 శాతం దాకా ఉంది. హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ పరిధిలో 7.20 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులుంటే.. ఏప్రిల్‌ 2024 నాటికి బిల్లుల బకాయిలు రూ. 81 కోట్ల మేర పేరుకుపోయాయి. ఏటీసీ నష్టాలు తగ్గకపోతే డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోతాయని కేంద్రం హెచ్చరిస్తోంది. వీటిని అధిగమించడానికి విద్యుత్‌ సర్కిళ్లవారీగా ‘పంపిణీ, బిల్లుల వసూలు’ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని గతంలో కేంద్రం విద్యుత్‌ నియమావళికి సవరణలు సైతం చేసింది. ఈ నేపథ్యంలోనే వీటిని పాతబస్తీ ప్రాంతంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని