TG Tourism: బర్డ్‌ వాచింగ్‌.. నైట్‌ క్యాంపింగ్‌.. మధ్యలో బోటింగ్‌!

పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..!

Updated : 03 Jul 2024 07:47 IST

ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు
అటవీ, జలవనరుల ప్రాంతాల్లో అభివృద్ధి
మూడు, నాలుగు ప్రాంతాలతో కలిపి ఓ సర్క్యూట్‌
నోడల్‌ ఏజెన్సీగా టీజీఎఫ్‌డీసీ!

లక్నవరం వద్ద పర్యాటకుల విడిది కోసం ఏర్పాటుచేసిన గుడారాలు

చ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! ఇలాంటి అనుభూతినే కల్పించి పర్యాటకులను కట్టిపడేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ట్రెక్కింగ్, బర్డ్‌వాచింగ్, నైట్‌ క్యాంపింగ్, బోటింగ్‌.. వంటివాటిని అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో అడుగులు వేస్తోంది.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మూడు, నాలుగు ప్రాంతాలను ఒక సర్క్యూట్‌ కిందికి తీసుకువస్తూ ప్రాథమికంగా 12 ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను గుర్తించారు. అందులో రక్షిత అటవీ ప్రాంతాల్లో ఏడు, అటవీ ప్రాంతాల వెలుపల అయిదు సర్క్యూట్లు ఉన్నాయి. అమ్రాబాద్, కవ్వాల్‌ వంటి పెద్దపులులు తిరిగే అభయారణ్యాలు.. కుంటాల, పొచ్చెర, భొగత లాంటి జలపాతాలు.. రామప్ప, అనంతపద్మనాభస్వామి, బాసర తదితర ఆలయాలు.. కోటిపల్లి రిజర్వాయర్, శామీర్‌పేట చెరువు, ప్రాణహిత నది, కిన్నెరసాని డ్యాం వంటి జలవనరులను ప్రకృతి పర్యాటక సర్క్యూట్లలో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కొంతమేర సౌకర్యాలున్నాయి. ప్రకృతి పర్యాటక విధానం ఖరారయ్యాక మరిన్ని సౌకర్యాలు, సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. పర్యాటకులు విడిది చేసేలా రాత్రిబసకు అవసరమైన వసతులను కల్పించనుంది. వారికి వినోదాన్ని పంచడానికి వీలుగా ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్‌ వాచింగ్, బోటింగ్, కయాకింగ్, నైట్‌ క్యాంపింగ్‌ వంటి ఏర్పాట్లు చేయనుంది. ప్రస్తుతం పరిమితంగా ఉన్న బోట్లు, సఫారీ వాహనాల సంఖ్యను పెంచనుంది. వీటి వల్ల పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఈ పాలసీ అమలుకు ప్రభుత్వం.. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ)ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది.

కోటిపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులు 

నిధుల సమీకరణపై దృష్టి

ప్రకృతి పర్యాటక అభివృద్ధి, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. దీంతో కర్ణాటక, ఒడిశా, కేరళ రాష్ట్రాలు ప్రకృతి పర్యాటక విధానాన్ని ఎలా అమలుచేస్తున్నాయి, నిధులు ఎలా సమకూర్చుకుంటున్నాయి కోణాల్లో అధికారులు అధ్యయనం చేశారు. కర్ణాటకలో ‘జంగిల్‌ లాడ్జెస్, రిసార్ట్సు’ పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, అటవీ, పర్యాటక శాఖలు, జంగిల్‌ రిసార్ట్స్‌ ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. కేరళలో పర్యాటక శాఖ.. అటవీ శాఖకు నిధులు సమకూర్చుతోంది. తెలంగాణలో టీజీఎఫ్‌డీసీ, పర్యాటక శాఖ, ప్రభుత్వ పథకాలు, సీఎస్‌ఆర్, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ సమీపంలో జింకలు

సర్క్యూట్ల వారీగా ప్రత్యేకతలు:

అమ్రాబాద్‌-సోమశిల: మన్ననూరు, సోమశిలలో వసతి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో సఫారీ,  అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్‌వాటర్‌లో బోటింగ్, శ్రీశైలం ఆలయ సందర్శన.

కవ్వాల్‌: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో సఫారీ, మంచిర్యాలలో గాంధారీ ఫోర్ట్‌ సందర్శన, శివ్వారం వైల్డ్‌లైఫ్‌ శాంక్షరీ సందర్శన, జన్నారంలో వసతి.

వికారాబాద్‌-అనంతగిరి: అనంతగిరిలో బసకు గెస్ట్‌హౌస్, అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన, అనంతగిరి అడవిలో సఫారీ, కోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్, కయాకింగ్‌.

ఖమ్మం-కనకగిరి: కనకగిరి అటవీప్రాంతంలో సఫారీ, బర్డ్‌వాచ్‌, ట్రెక్కింగ్, బోటింగ్, కనకగిరిలో వసతి.

ఆదిలాబాద్‌-కుంటాల: మావల పార్క్‌లో బోటింగ్, బర్డ్‌వాక్, సఫారీ, వసతి. కుంటాల, పొచ్చెర వాటర్‌ఫాల్స్, బోథ్‌ అర్బన్‌పార్క్‌ సందర్శన, సాత్నాల చెరువులో బోటింగ్, ట్రెక్కింగ్‌.

కొత్తగూడెం-కిన్నెరసాని: కిన్నెరసాని ప్రాంతంలో వసతి. డ్యాంలో బోటింగ్, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగ్, రంగాపురం క్యాంప్‌ సందర్శన, జంగాలపల్లి అటవీప్రాంత సందర్శన.

పాకాల-ఏటూరునాగారం: తాడ్వాయి హట్స్, పాకాల, లక్నవరంలో వసతి, భొగత వాటర్‌ఫాల్స్, రామప్ప ఆలయం సందర్శన, ఏటూరునాగారం అభయారణ్యంలో టెక్క్రింగ్, క్యాంపింగ్, బర్డ్‌ వాచ్, పాకాల అభయారణ్యంలో క్యాంపింగ్‌.

నిజామాబాద్‌-నందిపేట: ఉమ్మెడ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో వసతి. బ్యాక్‌ వాటర్‌లో బోటింగ్, కృష్ణ జింకల సఫారీ, గాదెపల్లిలో రాత్రి బస, బాసర ఆలయ సందర్శన.

నల్గొండ-గాజుబిడెం: గాజుబిడెం బ్యాక్‌ వాటర్‌లో బస, బోటింగ్, నెల్లికల్‌ ఎకోపార్క్‌లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్‌.

మేడ్చల్‌-శామీర్‌పేట: చెరువులో బోటింగ్, బర్డ్‌ వాచ్, రిసార్టుల్లో బస.

సంగారెడ్డి-మంజీర: మంజీర డ్యాం దగ్గర వసతి. డ్యాంలో బోటింగ్, బర్డ్‌ వాచింగ్‌.

ఆసిఫాబాద్‌-కాగజ్‌నగర్‌: వేంపల్లిలో వసతి. ప్రాణహితలో బోటింగ్, గుండెపల్లిలో ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్‌వాచింగ్‌. రాబందుల పాలరాపుగుట్ట సందర్శన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని