TG News: ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది.

Updated : 04 Jul 2024 06:44 IST

కనీసం రెండేళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత
ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తయినవారికి స్థానచలనం తప్పనిసరి
ఒక క్యాడర్‌లో 40 శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేయరాదు
పారదర్శకంగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌
8వ తేదీ కల్లా ఖాళీలు, బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి
9 నుంచి 12 వరకూ ఆప్షన్ల స్వీకరణ
19, 20 తేదీల్లో ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను సైతం 2012లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది. బదిలీలకు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.

  • 2024 జూన్‌ 30 నాటికి ఒకచోట రెండేళ్ల సర్వీసు పూర్తికానివారిని బదిలీ చేయకూడదు. రెండేళ్లు పూర్తయినవారే దరఖాస్తుకు అర్హులు. కానీ, భార్యాభర్తల నిబంధన కింద బదిలీ కోరేవారికి ఇది వర్తించదు.
  • 2024 జూన్‌ 30 నాటికి ఒకచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి.
  • 2025 జూన్‌ 30లోగా రిటైరయ్యే ఉద్యోగులు.. ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసినా బదిలీ చేయకూడదు. 
  • ఒక ప్రభుత్వ శాఖలో ఒక క్యాడర్‌లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దు.
  • ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారో తెలుపుతూ ఐదు ప్రాంతాల పేర్లను వరస క్రమంలో శాఖాధిపతికి పంపాలి.
  • ఒకే స్థానాన్ని ఎక్కువ మంది ఉద్యోగులు అడిగితే 7 రకాల నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇస్తారు. ఈ 7 నిబంధనలు... భార్య లేదా భర్త ఒకచోట పనిచేస్తుంటే మరొకరు అదే ప్రాంతం అడిగితే వారికి తొలి ప్రాధాన్యం కింద ఇవ్వాలి. వీరు లేకపోతే 2025 జూన్‌ 30లోగా రిటైరయ్యే వారికి రెండో ప్రాధాన్యం, 70 శాతానికి మించి వైకల్యం ఉన్నవారికి మూడో ప్రాధాన్యం, మానసిక వికలాంగులైన పిల్లలుంటే నాలుగో ప్రాధాన్యం, ఆ తరవాత వరస క్రమంలో వితంతువులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ,  కిడ్నీ, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్‌ హార్ట్‌సర్జరీ చేయించుకున్నవారు, బోన్‌ టీబీ బాధితులు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి ప్రాధాన్యం ఇచ్చి కోరుకున్నచోటుకు బదిలీ చేయాలి. 
  • ఉద్యోగి కోరిన స్థానం దక్కితే ‘బదిలీ రవాణా అలవెన్స్‌’కు అనర్హులు.
  • ప్రతి శాఖాధిపతి కేడర్‌వారీగా ఎన్ని ఖాళీలున్నాయి, ఎంత మంది పనిచేస్తున్నారు, అక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారనే జాబితాలను ఈ నెల 8వ తేదీ కల్లా తయారుచేయాలి.
  • నాలుగేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్నవారి పేర్లతో జాబితాను ఈ నెల 5 నుంచి 8వ తేదీకల్లా విడుదల చేయాలి.
  • ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారనేది తెలుపుతూ ప్రాధాన్య క్రమంలో ఐదు ప్రాంతాల పేర్లను ఈ నెల 9 నుంచి 12 వరకూ ఆప్షన్‌గా ఇవ్వాలి.
  • ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఎవరు ఎక్కడికి బదిలీకి అర్హులనే మాస్టర్‌ జాబితాను ఈ నెల 13 నుంచి 18 లోగా శాఖాధిపతులు తయారుచేయాలి.
  • ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని శాఖలు బదిలీ ఉత్తర్వులు జారీచేయాలి. ఈ ఉత్తర్వు జారీఅయిన తర్వాత సదరు ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్‌ అయినట్లుగా పరిగణించాలి. ఉత్తర్వు జారీఅయిన మూడు రోజుల్లోగా ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్‌ కావాలి. 
  • ఈ నెల 20వ తేదీ కల్లా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలి. ఈ నెల 21 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుంది. 
  • ఒక ఆఫీసులో అందరూ నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసి బదిలీకి అర్హులైనా సరే, వారందరినీ బదిలీ చేయకుండా కనీసం కొంతమందిని ఆఫీసు నిర్వహణ కోసం కొనసాగించాలి.
  • మారుమూల ప్రాంతాల్లోని పోస్టులకు అవసరమైనంత మంది ఉద్యోగులు బదిలీ కోరుతూ ఆప్షన్లు ఇవ్వకపోతే లాటరీ విధానంలో ఎంపిక చేయాలి. 
  • పారదర్శకంగా ఆన్‌లైన్‌ వెబ్‌ఆధారిత కౌన్సెలింగ్‌ విధానంలోనే బదిలీలు చేయాలి.
  • ఖాళీలు, బదిలీలకు అర్హులైనవారి పేర్లు, ఇతర వివరాలన్నీ ప్రతి ప్రభుత్వ శాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేయాలి. 

కమిటీలను ఏర్పాటుచేయాలి

బదిలీల నిర్వహణకు ప్రతి శాఖలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేయాలి. రాష్ట్రస్థాయి పోస్టుల్లో పనిచేసేవారిని బదిలీ చేసేందుకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, శాఖాధిపతి, అదనపు కార్యదర్శులతో కమిటీ ఏర్పాటుచేయాలి. మల్టీజోన్‌ లేదా జోనల్‌ స్థాయి ఉద్యోగుల కోసం శాఖాధిపతి, అదనపు కార్యదర్శి, జాయింట్‌ డైరెక్టర్‌ సభ్యులుగా కమిటీ, జిల్లా స్థాయి ఉద్యోగుల కోసం కలెక్టర్, అదనపు కలెక్టర్, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా కమిటీ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ కమిటీల ఆమోదంతోనే బదిలీ ఉత్తర్వులు జారీచేయాలి. ప్రతి శాఖ ముఖ్యకార్యదర్శి తన శాఖలో జరిగే బదిలీల ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఈ మార్గదర్శకాల అమలులో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే సదరు శాఖాధిపతి బాధ్యత వహించాలి. 

ఆరు శాఖలకు మినహాయింపు

బదిలీల మార్గదర్శకాలు ఆరు శాఖలకు వర్తించవని, వాటి అవసరాల దృష్ట్యా మార్పులు చేర్పులు చేసి అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, విద్య, అటవీ, పోలీసుశాఖలకు ఈ వెసులుబాటు కల్పించింది. 

ఐదేళ్ల నుంచి నాలుగేళ్లకు తగ్గింపుతో.. 

వాస్తవానికి ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగిని మాత్రమే కచ్చితంగా బదిలీ చేయాలనే నిబంధన గతంలో ఉంది. 2018 నుంచి సాధారణ బదిలీలు లేనందున ఇప్పుడు 90 శాతం మంది నాలుగేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్నందున వారంతా ‘కచ్చితంగా’ బదిలీ జాబితాలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో పరిపాలన కుంటుపడకుండా ఐదేళ్ల పాత నిబంధన అలాగే కొనసాగించినా లేదా అంతకుమించి సర్వీసు ఉండాలనే నిబంధన పెడితే బాగుండేదని.. అలా కాకుండా, ఐదుని కాస్తా నాలుగేళ్లకు తగ్గించడం వల్ల... కచ్చితంగా బదిలీ అయ్యే వారి సంఖ్య భారీగా పెరగనుందని చెబుతున్నారు. ఇలా కచ్చితంగా బదిలీ అయ్యేవారు ఒక కేడర్‌లో అత్యధిక సంఖ్యలో ఉంటే.. వారిలో 40 శాతం మందిని మాత్రమే మార్చడానికి ఎవరిని ఎంపిక చేయాలనే సూచనలను మార్గదర్శకాల్లో ఇవ్వకపోవడం గమనార్హం. 40 శాతం కోటా కింద ఎవరిని బదిలీకి ఎంపిక చేయాలనే స్పష్టత లేనందున ఈ విషయంలో శాఖాధిపతుల నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. 


నగరాల పోస్టులకు భారీ డిమాండ్‌

ఆర్థిక శాఖ జారీచేసిన మార్గదర్శకాలలో అస్పష్టత కారణంగా.. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ వంటి నగరాల్లోని పోస్టులకు ఎక్కువ డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. ఒక శాఖలో ఒక క్యాడర్‌లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40 శాతం వరకూ బదిలీ చేయాలని ఆదేశించారు. ఒక స్థానంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారందరినీ బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఇంతకుముందు 2018లో సాధారణ బదిలీలు జరిగాయి. అంటే అప్పటి నుంచి ఆరేళ్లుగా ఉద్యోగులంతా పాత స్థానాల్లో కొనసాగుతున్నందున కొన్ని శాఖల్లో 90 శాతం మంది ఉద్యోగులను నాలుగేళ్ల నిబంధన కింద తప్పనిసరిగా బదిలీకి అర్హుల జాబితాలో అన్ని శాఖలు వెల్లడించాల్సి ఉంటుంది. వీరిలో భార్యభర్తలు, 2025 జూన్‌ 30లోగా రిటైరయ్యేవారు కోరుకున్న స్థానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని నిబంధన పెట్టారు. త్వరలో రిటైరయ్యే వాళ్లు నగరాలకు వచ్చినా ఏడాదికల్లా రిటైర్‌మెంట్‌తో ఆ పోస్టులు మళ్లీ ఖాళీకానున్నాయి. 2025 జూన్‌ 30లోగా రిటైరయ్యేవారిని బదిలీ చేయవద్దని ఒక నిబంధన పెట్టి.. వారు కోరుకుంటే ఎక్కడైనా ఇవ్వవచ్చని మరో నిబంధన పెట్టడంతో మార్గదర్శకాల్లో అస్పష్టత ఏర్పడింది. ఇలాంటి వారంతా తప్పనిసరిగా నగరాలు లేదా వాటికి దగ్గరగా ఉన్న పోస్టులనే ఎంచుకుంటారు. మరోవైపు నగరాల్లోని ఉద్యోగుల్లో 90 శాతం మంది నాలుగేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నందున వీరి పోస్టులన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు తమకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని