Electricity Bills: నేరుగా జీపే, ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు

ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్‌ పేర్కొంది.

Updated : 02 Jul 2024 09:16 IST

దక్షిణ డిస్కం సీఎండీ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్‌ పేర్కొంది. ఈ నెల 1 నుంచి నేరుగా గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు అని ‘దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌-డిస్కం) ‘ఎక్స్‌’లో ప్రజలకు తెలిపింది. రిజర్వుబ్యాంకు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులిచ్చినట్లు వివరించింది. ఇక నుంచి డిస్కం వెబ్‌సైట్‌ లేదా టీజీఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని డిస్కం సీఎండీ ముషారఫ్‌ ప్రజలకు సూచించారు. అయితే వీటిల్లో కనుక జీపే, ఫోన్‌పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించే ఆప్షన్‌ ఉంటే ఇక్కడ నుంచి మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు. కాగా, ‘ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ’ దీనికి సంబంధించి ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు.

ఆర్‌బీఐ ఏం చెప్పింది?: బిల్లు చెల్లింపుల్లో భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారానే జరగాలని నిర్దేశించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను బిల్లర్లు ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోలేదు. దీంతో ఫోన్‌ పే, క్రెడ్‌ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్‌ కార్డుల బిల్లులను ప్రాసెస్‌ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్‌లలో క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని