NEET UG 2024: నీట్‌ రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలి

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై సిటింగ్‌ జడ్జ్జితో విచారణ జరిపించడంతోపాటు పరీక్ష మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.

Published : 19 Jun 2024 03:31 IST

విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు 

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై సిటింగ్‌ జడ్జ్జితో విచారణ జరిపించడంతోపాటు పరీక్ష మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది. జరిగిన తప్పిదానికి ప్రధాని నరేంద్రమోదీ బాధ్యత వహించాలని, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. కమిటీ (విద్యార్థి సంఘాలైన ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, వీజేఎస్, పీవైఎల్, వైజేఎస్‌) ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌ వై.జంక్షన్‌ నుంచి వందల మంది విద్యార్థులతో లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిత గందరగోళంలో పడిందన్నారు. దీనికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై స్పందించేందుకు ప్రధానికి 14 రోజుల గడువిచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకపోతే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే ఐకాసతో చర్చించి భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. నిరసన ప్రదర్శనలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందనారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అభిజిత్, ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పుట్ట లక్ష్మణ్, మణికంఠరెడ్డి, ఇతర విద్యార్థి సంఘాల ప్రతినిధులు నాగరాజు, మూర్తి, మహేష్, ఆజాద్, రామకృష్ణ, వెంకటేష్, ధర్మేంద్ర, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని