Sitarama Lift Irrigation: సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 పంప్‌హౌస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

Updated : 28 Jun 2024 07:09 IST

తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరు: తుమ్మల

సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద ఎత్తిపోస్తున్న గోదావరి జలాలు

అశ్వాపురం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 పంప్‌హౌస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఈనెల 13న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులను సందర్శించిన సంగతి తెలిసిందే. సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 పంప్‌హౌస్‌కు విద్యుత్తు కనెక్షన్‌ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. పంప్‌హౌస్‌ పూర్తయి మూడేళ్లు అయినా అప్పటివరకు విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదు. ఆగస్టు 15లోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరందించాలన్న లక్ష్యం నేపథ్యంలో పంప్‌హౌస్‌ను ట్రయల్‌ రన్‌కు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆనాటి నుంచి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. 

పంప్‌హౌస్‌ కంట్రోల్‌ యూనిట్‌లో స్విచ్‌ ఆన్‌ చేస్తున్న జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, చిత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు

రైతులతో పూజలు చేయించిన అనంతరం... 

పంప్‌హౌస్‌ను మంత్రి తుమ్మల గురువారం ఉదయం సందర్శించారు. ఆయన సమక్షంలో జలవనరులశాఖ అధికారులు ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. పంప్‌హౌస్‌ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో పూజలు చేయించిన అనంతరం కంట్రోల్‌ యూనిట్‌లో జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి మొదటి పంప్‌ను ప్రారంభించారు. డెలివరీ సిస్టర్న్‌లో ఆ పంప్‌ మొదటి విభాగం నుంచి గోదావరి జలాలు ఒక్కసారిగా ముందుకు దూకి సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి ప్రవహించాయి. తుమ్మల, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత గోదావరి జలాల్లోకి పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు నిర్వహించారు. ప్రవహిస్తున్న గోదావరి జలాలకు, నేలతల్లికి మంత్రి నమస్కరించారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జలవనరులశాఖ సీఈ ఎ.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈలు కె.వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈఈ చెన్నం వెంకటేశ్వరరావు, డీఈలు కె.శ్రీనివాస్, రాంబాబు, ఏఈలు రమేశ్, ప్రవీణ్, రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.


మూడు, నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు

టా 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా సీతారామ ప్రాజెక్టును తొలుత పూర్తిచేయనున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. మూడు, నాలుగేళ్లలో మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించే ఏర్పాటు చేస్తామన్నారు. ‘కొన్ని నిధులు సమకూర్చితే ఈ ఏడాదే గోదావరి జలాలను ఖమ్మం భూభాగంలోకి తీసుకుపోగలమని.. భద్రాచలం వచ్చినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాం. ఆయన పెద్దమనసుతో స్పందించి నిధులు విడుదల చేశారు. వాటితో విద్యుత్తు, మరికొన్ని పెండింగ్‌ పనులు పూర్తిచేశాం’ అని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని